పుష్కరాల్లో రద్దీ నియంత్రణకు ఏఐ
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:52 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 10 ప్రధాన పనితీరు సూచికల (కెపీఐ)అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 22( ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 10 ప్రధాన పనితీరు సూచికల (కెపీఐ)అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతితో కలిసి శుక్రవారం అధికారులతో కేపీఐ,గోదావరి పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. పుష్కరాల్లో రద్దీ నియంత్రణకు ప్రతి ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా ఏఐ సహాయంతో భక్తుల రద్దీని ముందుగానే పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందని అందుకే గోదావరి పుష్కరాల్లోను అమలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నగరంలో ఉన్న 1.12 లక్షల గృహాలకు అసెస్‌మెంట్ నెంబర్లు తప్పనిసరిగాఉండాలన్నారు. నీటి కనెక్షన్లు 100 శాతం ఆన్‌లైన్‌లో కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. డోర్ టు డోర్ చెత్త సేకరణ 99.42 శాతం సాఽధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌ఈడీ బల్బులు వినియోగం పెంచాలని , పన్నుల కలెక్షన్ , ఆటో మ్యుటేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం రాజమహేంద్రవరంలో సుమారు మూడుగంటలు నగరంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తొలుత నారాయణపురంలోని గోదావరి పుష్కరాల ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్నూకర్ బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, చెస్, కేరమ్స్, టాయ్ గన్ షూటింగ్, జిమ్ పరికరాలను పరిశీలించారు. వీలైనంత త్వరగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌న్ ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కాంచనగర్‌లోని స్పోర్ట్స్ పార్కు, ఆల్‌బ్యాంక్ కాలనీలో యోగా పార్కులను సందర్శించారు. జేఎన్‌రోడ్డులోని స్ట్రోమ్ వాటర్ డ్రెయినేజీ పనులను పరిశీలించారు. నగరంలో ఇప్పటి వరకు 23 కిమీల మేర స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ లైన్లు ఉండగా వాటికి అదనంగా మరో 10 కిమీ మేర నిర్మించాల్సిన అవసరం ఉం దని పిన్సిపల్ సెక్రటరీ దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు.సమగ్రమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించి సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. అనంతరం హుకుంపేట లో నూతనంగా నిర్మిస్తున్న 50.6 ఎంఎల్‌డీ సీవేజ్ ట్రిట్మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు. డిసెంబరులోపు సీవేజ్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించడానికి ప్రత్యేకమైన డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరు వ్యర్థా లను కాలువలలో వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గోదావరి బండ్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పరిశీలించారు. ఇందులో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్లాటర్ హౌస్, గోకవరం బస్టాండ్ వద్ద మహిళా మార్ట్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకి ప్రత్యేక బ్రాండింగ్ కలగచేసే క్రమంలో అవని అనే పోర్టల్ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట జేసీ ఎస్ చిన్నరాముడు, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజవల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్‌ఈలు ఎంసిహెచ్ కోటేశ్వరరావు, జిజపాండురంగారావు, ఈఈలు మాధవి, రీటా, మదర్సాఆలీ తదితరులు పాల్గొన్నారు.