Share News

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ తలవంచలేదు

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:03 AM

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సినిమాల్లోను ఎవరికీ తలవంచలేదని, ఇప్పుడు రాజకీయాల్లోను అలానే ఉన్నారని సహజ నటి జయసుధ అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ తలవంచలేదు

అప్పుడు.. ఇప్పుడు అలానే ఉన్నారు.. మార్పులేదు

సహజ నటి జయసుధ

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సినిమాల్లోను ఎవరికీ తలవంచలేదని, ఇప్పుడు రాజకీయాల్లోను అలానే ఉన్నారని సహజ నటి జయసుధ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా సోమవారం వచ్చిన ఆమె హర్షకుమార్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను హర్ష సతీమణి సరళతోపాటు తనయులు జీవీ శ్రీరాజ్‌, జీవీ సుందర్‌ ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా జయసుధ విలేకరులతో మాట్లాడారు. ‘పవన్‌కల్యాణ్‌ కోరుకుంటే కోట్లు పెట్టి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు, దర్శకులు ఉన్నారు. కానీ వాటిని వదులుకుని కమిట్‌మెంట్‌తో రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డారు. ఎవరైనా నాకు ఎందుకు వచ్చిన గొడవ అని మధ్యలోనే వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ పవన్‌కల్యాణ్‌ అలా కాదు.. నిలబడ్డారు. ఆయనలో అప్పుడు.. ఇప్పుడు ఎటువంటి మార్పులేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని అన్నారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ కుటుంబంతో తనకు రాజకీయపరంగా కాకుండా ముందునుంచే సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

గోదావరి జిల్లాల ప్రజలు చూపించే ఆప్యాయత, ఆదరణ ఎనలేనివి... రాజమహేంద్రవరం నాకు సెకండ్‌ హోమ్‌ లాంటిది... అన్నారు సహజ నటి జయసుధ. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆమె సోమవారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.

గోదావరి జిల్లాలతో మీ అనుబంధం?

1975-80 మధ్యలో గోదావరి జిల్లాల్లో షూటింగ్‌లకు వస్తే ఉండేందుకు సరైన హోటల్‌ సదుపాయం ఉండేది కాదు. కానీ కాని గోదావరి జిల్లాల ప్రజలు మమ్మల్ని వారి సొంత కుటుంబసభ్యుల్లా చూసుకునేవారు. వారి ఆప్యాయత మరువలేము.

మీ సొంత ఊరు?

మా నాన్నగారిది తిరుపతి. అమ్మమ్మగారిది విజయనగరం. అయితే నాకు రాజమహేంద్రవరం సెకండ్‌ హోమ్‌ లాంటిది. ఇక్కడి ప్రజలు చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకునేవారు. ఆ రోజులు వేరు. అవి గోల్డెన్‌ డేస్‌. నాకు కోస్తా ప్రాంతంలో ఫ్యాన్‌ పాలోయింగ్‌ వుంది.

సినీ పరిశ్రమలో నాటికీ, నేటికీ వచ్చిన మార్పులు?

చాలా ఆధునిక పరిజ్ఞానం వచ్చింది. అనేక మార్పులు వచ్చాయి. ఎంతో మందికి అవకాశాలు వస్తున్నాయి. కొత్త నటీనటులు వస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఓటీటీ రంగ ప్రవేశం చేసింది.

మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు?

350కు పైగా సినిమాలు చేశాను. అనేక పాత్రలు సంతృప్తి ఇచ్చాయి. కుటుంబ కథా చిత్రాలు బాగా పేరుతెచ్చాయి. నాడు అగ్రనటులతో నటించాను. నేటి అగ్రనటులకు తల్లి పాత్రలు పోషించాను. 25ఏళ్ల తర్వాత మలయళం సినిమా చేస్తున్నాను. ఏ రోల్‌ పడితే అది చేయను.

ప్రస్తుతం రాజకీయాలపై ఇంట్రస్ట్‌ వుందా?

గతంలో నేను తెలంగాణలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా చేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. ఈ వయసులో రాజకీయాలకు సూట్‌ అవుతానా లేదో చూడాలి. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. రోల్‌ అనేది ముఖ్యం. అది ప్రామిస్‌ చెయ్యలేకపోయినప్పుడు ఉండలేము. రోజూ పని అనేది ఉండాలి. స్మృతిఇరానీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.

మీరు సినీ రంగంలోకి రావడానికి ప్రేరణ?

ఇది చిన్నప్పటి విషయం. గూగుల్‌లో కూడా తప్పులు ఉన్నాయి. నేను 12వ ఏట సినీ పరిశ్రమలోకి వచ్చాను. మా ఆంటీ విజయనిర్మల గారు నన్ను తీసుకువచ్చారు. ఆమె నాకు ప్రేరణ. ఎన్నో సినిమాలు చేశాను. ఆనందంగా ఉంది.

Updated Date - Dec 09 , 2025 | 02:03 AM