Share News

కాలుష్య కోరల్లో ‘చాగల్నాడు’

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:16 AM

మెట్ట ప్రాంతమైన చాగల్నాడు ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేందుకు టీడీపీ హయాంలో రూపుదిద్దుకున్న చాగల్నాడు కాలువ నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని కంపుకొడుతోంది. ఎక్కడికక్కడే కాలువ కుచించుకుపోవడం ఒక వంతు అయితే మరో వైపు కాలువ గట్లు మాయమై సహజ స్వరూపాన్ని కోల్పోయి బలహీనంగా దర్శనమిస్తున్నాయి.

 కాలుష్య కోరల్లో ‘చాగల్నాడు’
చాగల్నాడు కాలువలో కాలుష్యం

  • కుచించుకుపోతున్న కాలువ

  • కానరాని పూడికతీత పనులు

  • పట్టించుకోని అధికారులు

రాజానగరం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మెట్ట ప్రాంతమైన చాగల్నాడు ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేందుకు టీడీపీ హయాంలో రూపుదిద్దుకున్న చాగల్నాడు కాలువ నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని కంపుకొడుతోంది. ఎక్కడికక్కడే కాలువ కుచించుకుపోవడం ఒక వంతు అయితే మరో వైపు కాలువ గట్లు మాయమై సహజ స్వరూపాన్ని కోల్పోయి బలహీనంగా దర్శనమిస్తున్నాయి. కాలువ తవ్విన సమయం లో వచ్చిన మట్టి కాలువ గట్లు వెంబడి కొండలను తలపించిన మట్టి గుట్టలను సైతం కొంతమంది అక్రమార్కులు మాయం చేసేశారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో మట్టి తరలించుకుపోవడంతో గట్లు పూర్తిగా బలహీనంగా మారాయి. కాలువ వెంబడి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్ధాలు నేరుగా కాలువలో కలుస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చాగల్నాడు కాలువ ఆశయం, మెట్టప్రాంత ప్రజల ఆశలు కలగానే మిగిలాయి. చాగల్నాడు కాలువను ఇటీవల కాలంలో కొంతమంది అక్రమార్కులు అడ్డాగా మార్చుకుని ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుండ గా, మరో వైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కాలువ ఇరువైపుల గట్టను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేం టో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్ధ జలాలు కాలువలో కలుస్తుండటంతో కాలువలో మురుగునీరు పచ్చని తివాసీ పర్చినట్లుగా మారి కనీసం పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పో తోంది. కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసిన సమయంలో మురునీరంతా చెరువుల్లోకి, పంట పొలాల్లోకి చేరి లేనిపోని రోగా లు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని, ఆయకట్టు రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించి అధికారులు స్పందించి కాలువలో పూడికతీత పనులు చేపట్టి, స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించి, చాగల్నాడు కాలువను కాలుష్యం బారినుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 01:16 AM