Share News

మట్టి..పెట్టేశారు!

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:21 AM

ఒకటి కాదు రెండు కాదు కాదు..ఏకంగా రూ.350 కోట్లు.. గత ప్రభుత్వ హయాం లో ఉమ్మడి జిల్లాలో కొందరు వైసీపీ నేతలు కొల్లగొట్టేసిన పోలవరం మట్టి విలువ ఇది..

మట్టి..పెట్టేశారు!
అక్రమంగా సాగినా : నాడు పోలవరం కాలువ గట్టు వద్ద మట్టి తరలింపు(ఫైల్‌)

రూ.350 కోట్లకుపైగా మట్టి మాయం

కోట్లు వెనకేసుకున్న వైసీపీ నేతలు

ప్రభుత్వం మారి ఏడాదిన్నర

అక్రమార్కులపై ఇంత వరకూ చర్యల్లేవ్‌

తాజాగా రూ.300 కోట్లు మట్టి దోపిడీ

పశ్చిమ,కృష్ణా జిల్లాల్లో అధికారుల నిర్ధారణ

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఒకటి కాదు రెండు కాదు కాదు..ఏకంగా రూ.350 కోట్లు.. గత ప్రభుత్వ హయాం లో ఉమ్మడి జిల్లాలో కొందరు వైసీపీ నేతలు కొల్లగొట్టేసిన పోలవరం మట్టి విలువ ఇది.. అధికారం అండతో అనుమతుల్లేకుండా రియల్‌ ఎస్టేట్‌, ఇళ్ల స్థలాల చదునుకు అడ్డగోలుగా విక్రయించి సంపాదించింది అంతకుమించే. ఈ మట్టిని బొక్కేసిన అక్రమార్కులపై ఇప్పటికీ కనీస చర్యలు లేకపోవడం విస్మయపరుస్తోంది. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై విచారణ జరుగు తుందని భావిస్తే ఇంతవరకు ఆ ఊసే లేదు. ఒకరకంగా చెప్పాలంటే అప్పటి మట్టి అక్రమా లను మట్టుపెట్టేశారనే ఆరోపణలు వ్యక్త మవు తు న్నాయి. తాజాగా ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో వైసీపీ హయాంలో పోలవరం మట్టి అక్రమ తవ్వకాలు రూ.300 కోట్లు అని నిర్దారణ అయిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న రూ.350 కోట్ల అక్రమ తవ్వకాల సంగతేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కొండలు కరిగాయ్‌

కాకినాడ, తూర్పుగో దావరి జిల్లాల పరిధిలో పోలవరం ఎడమ ప్రధాన కా లువ వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం దగ్గర మొదలయ్యే ఈ కాలువ గోకవరం, కోరుకొండ, రాజానగరం, గం డేపల్లి, ప్రత్తిపాడు, జగ్గంపేట, గొల్లప్రోలు, శంఖవరం, తొండంగి, తుని మండలాల మీదుగా పయనిస్తోంది. గత టీడీపీ ప్రభు త్వంలో ఈ కాలువను 18 మీటర్ల లోతు వరకు తవ్వారు. దీంతో దాదాపు నాలుగు కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి వచ్చింది. కాలువ వెంబడి భూముల్లో 15 అడుగుల ఎత్తు వరకు మట్టి మేటలు వేశారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రమేపీ ఆ మట్టి కొండలు కరిగిపోతూ వచ్చాయి. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ మట్టిపై వాలిపోయారు. ప్రధానంగా రాజానగరం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాల పరిధిలో పోలవరం మట్టిని వైసీపీ ఐదేళ్లలో వేలాది టిప్పర్లలో తరలించేశారు. టిప్పర్‌ మట్టిని రూ.8 వేలకు కాకినాడ, రూ.12 వేలకు తాళ్లరేవు, యానాం, రూ.4 వేలకు పిఠాపురం, రూ.15 వేలకు కోనసీమలో అనేక రియల్‌ఎస్టేట్‌ స్థలాల చదునుకు విక్రయించి కోట్లు గడించేశారు. ప్రత్తిపాడు,పిఠాపురం నియోజకవర్గాల పరిధిలో చెందుర్తి జాతీయరహదారి పక్కనే పోలవరం కాలువ వెంబడి కోటిన్నర లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి మేటలు,తునిలో 70 లక్షలకుపైగా క్యూబిక్‌మీటర్ల మట్టి నిల్వలను కాజేశారు. దీనంతటినీ అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా యథేచ్ఛగా తరలించుకుపోయారు.

అనుమతుల్లేకుండా మింగుడు..

నిబంధనల ప్రకారం పోలవరం కాలువ మట్టిని తవ్వా లంటే జలవనరులశాఖ అనుమతి తీసుకోవాలి. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతుల్లేకుండానే మట్టి కొండలు కొల్లగొట్టారు.గనులు, జలవనరులశాఖ అధి కారులు కమీషన్లు పుచ్చుకుని కళ్లు మూసుకోవడంతో పోలవరం మట్టి 95 శాతానికి పైగా మాయమైపోయిం ది. ఒక ప్పుడు భారీ మేటలున్న ప్రాంతాల్లో ఇప్పుడు ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా ల్లో ఆరున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి మాయమై పోయింది. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరిగిరిలో 350 ఎకరాల్లో అప్పటి సీఎం జగన్‌ చేతుల మీదుగా 2021 డిసెంబర్‌ 25న పేదలకు ఇళ్లస్థలాలు పంచారు. ఈ భూములు సముద్రానికి అతిసమీపంలో లోతట్టులో ఉన్నాయి. ఈ లేఅవుట్‌ను లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితో చదును చేశారు. ఇందుకోసం గొల్లప్రోలు మండలం చెందుర్తి జాతీయరహదారిని ఆను కుని ఉన్న పోలవరం కాలువ మట్టిని అప్పటి కాకినాడసిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వేలాది టిప్పర్లలో తరలించి కోట్లలో మెక్కేశారు. అప్పట్లో కాకినాడ కీలకనేత ఒక్కరే పోలవరం మట్టిలో రూ.6 కోట్ల వరకు మింగేశారు.

ఎందుకిలా..

ప్రభుత్వం మారి దాదాపు ఏడాదిన్నరవుతోంది. కానీ ఇంతవరకు పోలవరం మట్టి అక్రమాలపై ప్రభుత్వం కనీసం దృష్టిసారించ లేదు. రూ.350 కోట్లకుపైగా విలువైన మట్టిని అప్పటి నేతలు అక్రమంగా అమ్మేసుకున్నా ఇంత వరకు విచారణ చేపట్టకపోవడంతో అక్రమార్కులు దర్జాగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో పోలవరం మట్టిని వేలం వేస్తే రూ.350 కోట్ల వరకు రాబట్టవచ్చని 2019లో అధికారులు లెక్కగట్టారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ మట్టంతా తమ పార్టీ నేతలకు దోచిపెట్టింది. పైగా ఈ దోపి డీపై అప్పట్లో ప్రతిపక్ష హోదాలో టీడీపీ పోరాటం చేసింది. ఇప్పుడు చేతిలో అధికారం ఉన్నా కనీసం మట్టి అక్రమాలపై విచారణకు ఆదేశించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మట్టిలో కలిపేశారా?

కాకినాడ నగరంలో గత వైసీపీ హయాంలో రూ.450 కోట్లకుపైగా విలువైన టీడీఆర్‌ బాండ్ల జారీపై విజిలెన్స్‌ నివేదిక సిద్ధమైంది. రేషన్‌ బియ్యం కుంభకోణంపై సిట్‌, ఆడుదాం ఆంధ్రా అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. పోలవరం మట్టి అక్రమాలపై ఏ విచారణ లేదు. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 1.21 కోట్ల క్యూబిక్‌ మీటర్లు రూ.300 కోట్ల విలువైన పోలవరం మట్టి దోపిడీకి గురైందని తాజాగా అక్కడ జలవనరుల శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.350 కోట్లకుపైగా విలువైన మట్టిని మింగేసిన అక్రమార్కులపై కనీసం అధికారులు కూడా ఉలకడం లేదు. దీంతో పోలవరం మట్టి అక్రమాలను మట్టుపెట్టేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 04 , 2025 | 12:21 AM