తాగునీరందాలంటే అనధికార కుళాయిలు తొలగించాలి
ABN , Publish Date - May 12 , 2025 | 12:38 AM
గ్రామాల్లో వాటర్ ట్యాంకులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు అవసరాలకు మించి ఎక్కువగా తాగునీరు అందుతోంది. క్రమంగా శివారుకు వచ్చేసరికి తగిన స్థాయిలో నీరందక జనం ఇక్కట్లు పడుతున్నారు.
స్థానికేతర అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని శివారు ప్రాంతాల ప్రజల డిమాండ్
ఉప్పలగుప్తం, మే 11(ఆం ధ్రజ్యోతి): గ్రామాల్లో వాటర్ ట్యాంకులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు అవసరాలకు మించి ఎక్కువగా తాగునీరు అందుతోంది. క్రమంగా శివారుకు వచ్చేసరికి తగిన స్థాయిలో నీరందక జనం ఇక్కట్లు పడుతున్నారు. ఫలితంగా తాగునీటి కోసం ప్రతిరోజూ మహిళలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధికారులకు ఇస్తున్న వినతి పత్రాల్లో తమకు తాగునీరందక పోవడానికి కారణాలను ఉటంకిస్తున్నారు. గ్రామాల్లో అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, వాటి ఉనికిని ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారుల నుంచి స్పందన మాత్రం శూన్యం. పంచాయతీలు అక్రమ కనెక్షన్లు, మోటార్ల తొలగింపు విషయాల్లో తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నో పర్యాయాలు పంచాయతీలు, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ కనెక్షన్లు, మోటార్లు తొలగించారు. ఎనిమిది మోటార్ల కనెక్షన్లు తొలగించామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సురేష్ తెలిపారు. పేరాయిచెరువు, మధురపేట, అల్లవరం మండలం నక్కారామేశ్వరం గ్రామల్లో అక్రమ కనెక్షన్లు తొలగించామన్నారు. పంచాయతీలు తమకు సహకరించడం లేదన్నారు. ప్రజలందరికి సరిపడా తాగునీరు ప్రాజెక్టుల నుంచి సరఫరా జరుగుతున్నా శివారు ప్రాంతాల వారు వేసవిలో తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. అక్రమ కనెక్షన్లు, మోటార్లు తొలగించాల్సిన బాధ్యత పంచాయతీలదేనని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. తాము తొలగించాలంటే రాజకీయ జోక్యం అడ్డుపడుతోందని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. అందుకే స్థానికేతర అధికారులతో స్పెషల్ డ్రైవ్ ద్వారా తాగునీటి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని శివారు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ కుళాయి కనెక్షన్లు, మోటార్ల జాబితా గ్రామ పంచాయతీల వద్ద ఉందని, స్థానికేతర అధికారుల ద్వారా డ్రైవ్ నిర్వహించేలా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.