విలపింఛన్!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:02 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది.. నేటికీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడంలేదు.
నోటిఫికేషన్‌కు ఎదురుచూపులు
కూటమి ప్రభుత్వం రాకతో ఆశలు
17 నెలలైనా స్పందన రాక లబోదిబో
వెల్లువలా దరఖాస్తులు, వినతులు
సామర్లకోట, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది.. నేటికీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడంలేదు. దీంతో వేలాది మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభు త్వంలో ఐదేళ్లు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. కొందరికి ప్రత్యే కంగా రూ.15 వేలు పింఛను అందజేస్తున్నారు. ఈ నేప థ్యంలో పింఛనుకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చిప డింది. దీంతో దరఖాస్తుదారులు పెరిగారు. కూటమి ప్రభుత్వంలో వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తుందని లబ్ధిదారులు ఆనుకు న్నారు.కానీ అలా జరగలేదు. దీంతో ప్రభుత్వం నుంచి స్పందనకు ఎదురుచూస్తు న్నా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 60 వేల మంది వరకూ కొత్త పిం ఛన్లకు అర్హులు ఉన్నట్టు సమాచారం.
పెండింగ్‌లో 30 వేల దరఖాస్తులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అంబే డ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధి సచి వాల యాల్లో నవంబరు 20 నాటికి సుమారు 30 వేల నూత నంగా పింఛన్లకు దరఖాస్తులు ఉన్నట్టు సమాచారం. వీటిలో కనీసం 24 వేల మందికైనా పింఛను అర్హత ఉం టుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7,42,704 పింఛను దారులకు ప్రతి నెలా రూ.322.94 కోట్ల మేర సొమ్ములను ప్రతి నెలా చెల్లిస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉన్న దరఖాస్తులకు మంజూరు లభిస్తే ప్రభుత్వానికి అదనంగా మరో రూ.12 కోట్ల మేర భారం కానున్నట్టు అంచనా.
కొన్ని ఉదాహరణలు ఇలా..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకలకు చెందిన మాచవరపు రిత్విక గ్రేస్‌కు ఆరేళ్లు. దివ్యాంగురాలు.. రెండు కాళ్లు పనిచేయవు.. తరచూ ఫిట్స్ వస్తుంటాయి.. బ్రెయిన్ డ్యామేజీ ఉంది.. దీంతో సదరం సర్టిఫికెట్‌లో 100 శాతం ఇచ్చారు.. బాలిక తండ్రి చిరు ప్రైవేట్ ఉద్యోగి.. గత నాలుగేళ్లుగా దివ్యాంగ పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. నేటికీ నమోదు కాలేదు. కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా పింఛన్ మంజూరవుతుందని అనుకున్నాడు.. ఈ ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి. తమ కుమార్తెకు దివ్యాంగ పింఛన్ ఎప్పుడు మంజూరవుతుందో.. ఎప్పుడు తమ కష్టాలు తీరతాయోనని ఎదురుచూపులు చూస్తున్నారు...
కాకినాడకు చెందిన యాళ్ల లలితకు ప్రస్తుతం ఏడేళ్లు. మానసిక, శారీరక దివ్యాంగురాలు..సదరం సర్టిఫికెట్‌లో వంద శాతం ఇచ్చారు.. బాలిక తండ్రి తాపీ పని చేస్తుంటాడు.. గత ఐదేళ్లుగా దివ్యాంగ పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా డు.. నేటికీ నమోదు కాలేదు.కూటమి ప్రభుత్వంలోనైనా పింఛన్ మంజూరవుతుందని అనుకున్నాడు..ఇప్పుడూ ఇదే పరిస్థితి.
కాకినాడలోని దుమ్ములపేటకు చెందిన కృష్ణవర్థన్‌కు నాలుగేళ్లు. డ్రోన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. సదరం సర్టిఫికెట్‌లో 80 శాతం ఇచ్చారు..తండ్రి ఆటోడ్రైవర్. అంతంతమాత్రమే ఆదాయం. గత మూడేళ్లుగా పింఛన్‌కు దరఖాస్తు చేస్తూనే ఉన్నాడు.దరఖాస్తులకు వందల్లో ఖర్చవుతుంది కానీ నేటికీ ఫలితం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లబోదిబోమంటున్నారు.