‘పెన్షన్’ కలకలం!
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:42 AM
అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్లు అందించడంతోపాటు అనర్హులను గుర్తించేందుకు ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ల పరిశీలనా కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ల పరిశీలన అనంతరం జిల్లాలో ఏకంగా 2,899 మందిని అనర్హులుగా గు ర్తించారు. ప్రత్యేక షెడ్యూల్ మేరకు వైద్యుల బృందం దివ్యాంగ పెన్షన్ల పరిశీలన చేపట్టింది.
దివ్యాంగ పెన్షన్ల పరిశీలన దాదాపుగా పూర్తి
సెప్టెంబరు నుంచి అనర్హులు ఏరివేత
జిల్లావ్యాప్తంగా 2,899 పెన్షన్లు నిలుపుదల
652 మంది ఇతర పెన్షన్లకు బదలాయింపు
అర్హత ఉంటే అప్పీలుకు మరో అవకాశం
నెలనెలా రూ.6 వేల పెన్షన్ పొందుతున్న దివ్యాంగుల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రత్యేక వైద్య బృందాలతో దివ్యాంగత్వాన్ని పునః పరిశీలన ద్వారా అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని ఇటీవల ప్రభుత్వం చేపట్టింది. వైకల్యం, చూపు, వినికిడి, మానసిక రుగ్మతలతోపాటు వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పెన్షన్లను అందిస్తున్నారు. ఇందులో కొందరు అర్హత మేరకు వైకల్య శాతం ఉండకపోయినా పెన్షన్ పొందుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు జిల్లాలో 2,899 దివ్యాంగ పెన్షన్లను నిలిపివేయడం కలకలం సృష్టించింది.
అమలాపురం రూరల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్లు అందించడంతోపాటు అనర్హులను గుర్తించేందుకు ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ల పరిశీలనా కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ల పరిశీలన అనంతరం జిల్లాలో ఏకంగా 2,899 మందిని అనర్హులుగా గు ర్తించారు. ప్రత్యేక షెడ్యూల్ మేరకు వైద్యుల బృందం దివ్యాంగ పెన్షన్ల పరిశీలన చేపట్టింది. ఈనేపథ్యంలో జిల్లాలో అనర్హులైన 2,899 మంది పెన్షన్లను సెప్టెంబరు నుంచి నిలుపుదల చేస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పెన్షన్ల వెరిఫికేషన్‌కు హాజరుకానివారు, ఇంతవరకు షెడ్యూలు పొందనివారు 7,888మంది ఉన్నట్టు లెక్క తేల్చారు. దివ్యాంగ శాతాన్ని బట్టి పెన్షన్లు ఇవ్వడంతో పాటు దివ్యాంగ పెన్షన్లకు అనర్హులు అయినప్పటికీ వృద్ధాప్య, ఇతర కేటగిరీలకు అర్హత ఉన్న 652 మందిని ఇతర పెన్షన్లకు బదలాయించారు. జిల్లావ్యాప్తంగా 32,101 మంది దివ్యాంగ పెన్షన్ల పరిశీలనకు లక్ష్యంగా నిర్దేశించారు. వారిలో లోకో మోటార్ పెన్షన్లు 16,934, విజువల్ ఇంపైర్‌మెంట్ 4,036, హియరింగ్ ఇంపైర్మెంట్ పెన్షన్లు 3,992, మెంటల్ రిటార్డేషన్ పెన్షన్లు 3,751, మెంటల్ ఇల్‌నెస్ 1,277, మల్టిపుల్ డిజేబులిటీ పెన్షన్లు 2,111 ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 24,213 పెన్షన్ల పరిశీలనను వైద్యుల బృందం పూర్తిచేసింది. ఇంకా 7,888 మంది పెన్షన్ల పరిశీలన చేయాల్సి ఉంది. వీరిలో పలువురికి షెడ్యూల్ ఇచ్చినప్పటికీ హాజరుకాలేదని చెప్పారు. మిగిలిన వారికి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. పెన్షన్ల పరిశీలన తర్వాత అత్యఽధికంగా ఆలమూరు మండలంలో 212 పెన్షన్లు, అత్యల్పంగా అమలాపురం అర్బన్‌లో 36 పెన్షన్లను నిలుపుదల చేశారు. పెన్షన్ల పరిశీలన అనంతరం సచివాలయాల వారీ జాబితాలను విడుదల చేశారు. ఆయా దివ్యాంగ పెన్షన్‌దారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే పెన్షన్లు నిలుపుదల అయినవారు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. నోటీసు అందుకున్న 30రోజుల్లోగా సంబంధిత మండల పరిషత్ అభి వృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్లకు అప్పీలు చేసుకోవచ్చని డీఆర్డీఏ అధికారులు తెలిపారు.