Share News

పంచాయతీరాజ్‌ శాఖలో సంస్కరణలపై సంబరాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:50 AM

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్‌ శాఖలో ఇటీవల చేపట్టిన సంస్కరణలు అభినందనీయమని జిల్లాలోని పంచాయతీ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం, మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.

  పంచాయతీరాజ్‌ శాఖలో సంస్కరణలపై సంబరాలు

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్‌ శాఖలో ఇటీవల చేపట్టిన సంస్కరణలు అభినందనీయమని జిల్లాలోని పంచాయతీ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం, మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ ఆధ్వర్యంలో దశాబ్దాల కాలం అనంతరం సంస్కరణలకు శ్రీకారం చుట్టడం పట్ల బుధవారం కామనగరువులోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. జిల్లా సంఘాల అధ్యక్షులు జి.మల్లికార్జునరావు, రుద్రరాజు ఎస్‌ఎస్‌ సూరపరాజుల ఆధ్వర్యంలో తొలుత సమావేశం నిర్వహించారు. జీవోఎంఎస్‌ నంబరు 35లో భాగంగా పంచాయతీల విస్తరణాధికారి పోస్టును డిప్యూటీ ఎంపీడీవోగా మార్పు చేయడంతో పాటు ఎంపీడీవోల పదోన్నతుల్లో విస్తరణాధికారులకు 60శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎంపీడీవో పదోన్నతుల్లో ఏవోలకు 34శాతం అవకాశం కల్పించగా వారికి అన్యాయం జరిగిందని అనడం తగదన్నారు. గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-6 వరకు, విస్తరణాధికారుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండడం వల్లనే 60శాతం వాటా కల్పించడం జరిగిందన్నారు. మండలపరిషత్‌, జిల్లాపరిషత్‌లలో జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్ట్‌, ఏవోల సంఖ్యాబలం తక్కువగా ఉండడం వల్ల 34శాతం వాటా కల్పించారని వివరించారు. ఏవోలకు ఏవిధమైన అన్యాయం జరగలేదని ప్రభుత్వానికి వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. జీవో నంబరు 35పట్ల హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తూ స్వీట్లు పంచారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధులు యు.నాగేంద్ర, ఎండీ అబ్బాస్‌, శెట్టిమల్లి రాజమోహన్‌, దుర్గాశ్రీనివాస్‌, రెహ్మాన్‌, రెడ్డిశిరీష, తేజ, కల్యాణ్‌, వల్లీ, అశోక్‌, రమ్య, మల్లేశ్వరి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:50 AM