ఆపరేషన్ అలర్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 01:21 AM
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మిన వేళ దేశంలో యుద్ధ సమయంలో వివిధ ప్రాంతాల్లో బాంబుల దాడి జరిగితే ఎలా వ్యవహించాలనే దానిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తున్నాయి.
అనుకోని బాంబుల దాడి జరిగితే ఇలా వ్యవహరించండి
రాజమహేంద్రవరంలో సమన్వయ శాఖల మాక్ డ్రిల్
విశాఖను కేటగిరి-2గా ప్రకటించడంతో అప్రమత్తం: జేసీ
రాజమహేంద్రవరం సిటీ/బిక్కవోలు/కోరుకొండ/అనపర్తి, మే 8( ఆంధ్రజ్యోతి): భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మిన వేళ దేశంలో యుద్ధ సమయంలో వివిధ ప్రాంతాల్లో బాంబుల దాడి జరిగితే ఎలా వ్యవహించాలనే దానిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్, వై-జంక్షన్ తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, వైద్యఆరోగ్య శాఖల సమన్వయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, సిబ్బంది యుద్ధ సమయంలో ఎటువంటి సేవలు అందిస్తారో ప్రయోగత్మకంగా వివరించారు. బాంబ్ దాడి జరిగినప్పుడు నేలపై కూర్చుని చెవులు, కళ్లు మూసుకుని కూర్చోవాలని, ఛాతిని నేలపై పెట్టకుండా మోచేతులపై బెండ్ అవ్వాలని, భవనాలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీసుకువెళ్లాలో ప్రదర్శించారు. అడ్డు వచ్చిన వాటిని కట్ చేసుకుని లోపలికి ప్రవేశించే విధంగా కటింగ్ మిషన్, దాడి జరిగిన చోట, అగ్నిప్రమాదం జరిగిన చోట విక్టిమ్ లోకేటెడ్ కెమెరాతో లోపలి వారిని గుర్తించే ప్రక్రియ కూడా ప్రదర్శించారు. అలాగే అపార్టుమెంట్లు, భవనాల్లో బాంబులు పెట్టినప్పుడు వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో, ప్రమాదాలను దాటుకుని ఎలా బయట పడాలో పోలీసులు ప్రదర్శించారు. యుద్ధంలో గాయపడిన వారికి ఏవిధంగా వైద్యం అందించాలో, విషమస్థితిలో ఉంటే సీపీఆర్ ఎలా చేయాలో వైద్యసిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నాన్ని కేటగిరి-2గా పరిగణించడంతో దానికి దగ్గగా ఉన్న రాజమహేంద్రవరంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సమన్వయ శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్‌ను నిర్వహించి అవగాహన కలిగించామన్నారు. చేపట్టామన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టును, పరిశ్రమలు ఉన్నచోట్ల హైఅలర్డ్ ఉందన్నారు. కార్యక్రమం ఏఎస్పీ ఏవీ సుబ్బారాజు, ఆర్డీవో కృష్ణనాయక్, పోలీసు, వైద్యఆరోగ్య, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే బిక్కవోలులో తహశీల్దార్ సత్యకృష్ణ ఆధ్వర్యంలోను, కోరుకొండలో తహశీల్దార్ సుస్వాగతం ఆధ్వర్యంలోను, అనపర్తిలో ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోను మాక్‌డ్రిల్ నిర్వహించారు. బిక్కవోలు ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారి దుర్గాదేవి, ఎస్‌ఐ రవిచంద్రకుమార్, కోరుకొండ ఎంపీడీవో అశోక్‌కుమార్, సర్పంచ్ కర్రి లక్ష్మి సరోజ, అనపర్తి తహశీల్దార్ అనిల్‌కుమార్, ఫైర్ ఆధికారి శ్రీనివాసరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.