రమ్మీ.. జీవితం డమ్మీ!
ABN , Publish Date - Apr 11 , 2025 | 02:03 AM
అతడిది కాకినాడ జిల్లా కొత్తపల్లి మం డలం రామన్నపాలెం. ఉప్పాడ సెంటర్లో వాహనాల స్పేర్‌పార్టుల వ్యాపారం. తండ్రికి ఉన్న 90 సెంట్ల పొలాన్ని రూ. కోటీ36 లక్షలకు విక్రయించాడు. ఈ సొమ్ముతో వేరేచోట పొలం కొనాలి. కానీ ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లో ఈ మొత్తం సొమ్ముతోపాటు మరో నాలుగు లక్షలు సైతం దఫదఫాలుగా ఆడి పోగొట్టుకున్నాడు.

పొలం అమ్మి ఆన్‌లైన్ రమ్మీలో కోటీ 40 లక్షలు పోగొట్టుకున్న వైనం
ఆపై పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
యథేచ్ఛగా రమ్మీ ఆన్‌లైన్ గేమ్.. ఎక్కడ చూసినా ఆన్‌లైన్ పేకాటే
బానిసలైపోతున్న యువతరం.. ఇదో రకం లూటీ
రోడ్డునపడుతున్న కుటుంబాలు.. నియంత్రణ సాధ్యమేనా
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): అతడిది కాకినాడ జిల్లా కొత్తపల్లి మం డలం రామన్నపాలెం. ఉప్పాడ సెంటర్లో వాహనాల స్పేర్‌పార్టుల వ్యాపారం. తండ్రికి ఉన్న 90 సెంట్ల పొలాన్ని రూ. కోటీ36 లక్షలకు విక్రయించాడు. ఈ సొమ్ముతో వేరేచోట పొలం కొనాలి. కానీ ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లో ఈ మొత్తం సొమ్ముతోపాటు మరో నాలుగు లక్షలు సైతం దఫదఫాలుగా ఆడి పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 8న పురుగుమందు తాగేశాడు. వెంటనే కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అప్పుడు అసలు విష యం వెలుగుచూసింది. ఈ తరహాలోనే ఆన్‌లైన్ రమ్మీ క్యాష్ గేమ్స్‌లో ఆడి లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నవారు, ఇళ్లు, పొలాలు అ మ్మి మరీ ఆడిన వారు, కళాశాలల్లో ఈ గేమ్‌కు బానిసలై చదువులు అటకెక్కినవారు కోకొల్లలు గా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి పేకాట ఆడటం నేరం. ఎక్కడైనా పేకాట ఆడితే వారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు. కానీ అదే పేకాట ఆన్‌లైన్‌లో ఆడితే కేసులు ఉండవు. ఇదే అదనుగా సరదాగా ఆడుకున్న రమ్మీ ఆటను పెద్ద జూదంగా మార్చేశారు. ఇంట్లో, ఆఫీసుల్లో, బస్టాండుల్లో, రెస్టారెంట్లలో, పార్కుల్లో, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో రాత్రి పగలూ తేడా లేకుండా ఆన్‌లైన్‌లో రమ్మీ పేకాట ఆడేస్తున్నారు. వీటిని నియంత్రించే పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి పేకాట ఆన్‌లైన్‌లో ఆడటం కూడా అధికారికంగా కుదరదు. కానీ కొంతమంది ఈ పేకాటను ఎక్కడో గోవా, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, కలకత్తా, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తూ ఆన్‌లైన్‌లో రమ్మీని ఆడిస్తూ కోట్లాది రూపాయలు లాగేస్తున్నారు. రమ్మీలో తొలుత డబ్బులు వచ్చేలా చేసి అలవాటు చేయడం ద్వారా ఆటగాళ్లకు వలవిసురుతారు. ఈ వలలో పడ్డ ఆటగాడు విలవిల కొట్టుకుని చివరికి అప్పులు పాలై ఊరువదిలి పెట్టి పారిపోయే పరిస్థితి. ముఖ్యంగా యువత ఈ రమ్మీగేమ్‌ల వైపు ఆసక్తి చూపడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తొలుత చిన్న ప్రారంభమైనా క్రమేపీ లక్షల్లోకి ఈ గేమ్ వెళ్లిపోతుంది. దీనికి మళ్లీ కొంతమందితో ప్రమోట్ చేయించడంతో చాలామంది యువత ఈ ఉచ్చులోకి దిగుతున్నారు. యువతతోపాటు పెద్దవాళ్లు కూడా ఈ ఆటలకు బానిసలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఆన్‌లైన్‌లో రమ్మీ పేకాట పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కొంతమంది సాముహా న్ని ఒకచోట కేంద్రీకృతం చేసి వారు కార్డులను వారికి ఓపెన్‌గా చూసుకుని గేమ్ ఆడి దానిని ఆ గ్యాంగ్‌లోని వారే షో కొట్టేవిధంగా వ్యూహత్మకంగా ఇది నడుస్తుంది. దీనివల్ల వివిధ ప్రాం తాల నుంచి ఆడేవారంతా నష్టపోతారు. నగదు అంతా ఈ గేమ్ నిర్వహించే ముఠాకే వెళ్లిపోతుంది. దీన్ని ఆధారాలతో పట్టుకునే వారే ఉండ రు. ఆన్‌లైన్ పేకాటలు, బెట్టింగ్ యాప్‌లపై ఎటువంటి ఫిర్యాదు ఉండడంలేదు. దీనికి కార ణం ఆన్‌లైన్ జూదంలో సొమ్ములు పోగొట్టుకున్నామని చెప్పుకోలేరు. ఒకవేళ చెబితే తొలుత చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు కాబట్టి దాంతో విషయం వెలుగుచూసే అవకాశం ఉం డదు. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ జూద క్రీడలపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరెన్నో కుటుంబాలు రోడ్డునపడతాయి.