దర్యాప్తు మొదలు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:20 AM
అమలాపురం, మండపేట/రాయవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈనెల 8వ తేదీన బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ద్విసభ్య కమిటీ సభ్యులు స్పష్టంచేశారు. రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్‌వర్క్స్‌లో బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనంలో మొత్తం పది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించి ద్విసభ్య కమిటీని నియమించింది. శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధిశా
రాయవరంలో బాణసంచా పేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ద్విసభ్య కమిటీ బృందం
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత పరిశీలించి న్యాయం చేస్తాం
పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, ఐజీ రవికృష్ణల బృందం
బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తాం : సురేష్‌కుమార్ వెల్లడి
ఘటనాస్థలంలో ఆద్యంతం పరిశీలన.. ఆధారాలు గుర్తింపు
పర్యటనలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్‌మీనా
అమలాపురం, మండపేట/రాయవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈనెల 8వ తేదీన బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ద్విసభ్య కమిటీ సభ్యులు స్పష్టంచేశారు. రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్‌వర్క్స్‌లో బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనంలో మొత్తం పది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించి ద్విసభ్య కమిటీని నియమించింది. శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణతో కూడిన ద్విసభ్య కమిటీ బృందం పేలుడు జరిగిన శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌ను ఆద్యంతం పరిశీలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన తరువాత స్థానిక నిర్వాహకులు, అధికారులను విచారించారు. రాయవరం ప్రాంతీయ రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మికశాఖ అధికారులతో కలిసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ద్విసభ్య కమిటీ సభ్యులు సమగ్రంగా విచారణ చేపట్టారు. అనంతరం రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక మీడియాతో వీరు మాట్లాడారు. ఫోరెన్సిక్ నివేదిక రా గానే ఘటన పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ప్రమాదంలో మరణించిన పది మంది కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టంచేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఘటన జరిగిన వెంటనే నిర్వహించిన ప్రాథమిక విచారణ నివేదికలను పరిశీలించామని వెల్లడించారు. స్థానిక అధికారులు బాణసంచా తయారీ కేంద్రం వద్ద సంబంధిత భద్రతా ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశంపై సంయుక్త తనిఖీలు జరిపి తగిన లైసెన్సులు, నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)లను సెప్టెంబరు నెలలోనే జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే బాణసంచా తయారీ ప్రక్రియలో భద్రతా నిబంధనలు పూర్తిగా పాటించారా లేదా అన్న విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఘటన సమయంలోను, ఆ తరువాత నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ద్విసభ్య కమిటీ సభ్యులైన సురేష్‌కుమార్, రవికృష్ణకు వివరించారు. ఘటనా స్థలంలో అణువణువునా పరిశీలిన చేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారథి, ఆర్డీవో డి.అఖిల, తహశీల్దార్ బి.భాస్కర్, కార్మికశాఖ సహాయ కమిషనర్ టి.నాగలక్ష్మి, పోలీసు సిబ్బంది ఉన్నారు. కాగా ద్విసభ్య కమిటీ పరిశీలన సమయంలో మీడియాతోపాటు ప్రజా సంఘాల ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి ఆదుకుంటామని ద్విసభ్య కమిటీ సభ్యులు ఇచ్చిన హామీతో బాధితుల్లో ఒకింత చల్లబడ్డారు. సాయంత్రం 4 గంటల వరకు కమిటీ సభ్యులు అక్కడే ఉండి ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివిధ కోణాల్లో విచారణ చేశారు.
మరో బాణసంచా కేంద్రం పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం రాయవరం సంఘటనపై నియమించిన ప్రత్యేక అధికారుల బృందం పేలుడు ప్రదేశానికి సమీపంలో ఉన్న మరో బాణసంచా తయారీ కేంద్రం భవానీ ఫైర్‌వర్క్స్‌ను సందర్శించి పరిశీలించింది. వాస్తవానికి పేలుడు తర్వాత భవానీ బాణసంచా తయారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇకపై ఈ కేంద్రంలో కూడా బాణసంచా తయారీకి అనుమతి ఇవ్వవద్దని అధికారులు తేల్చిచెప్పారు. కేవలం బాణసంచా విక్రయాలకు మాత్రమే తప్ప తయారీకి అనుమతి లేదని స్పష్టంచేశారు.
విచారణలో.. అనుమతి లేదు!
బాణసంచా పేలుడు ఘటనపై ద్విసభ్య ఉన్నతాధికారులు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ రాయవరం ఎండీడీవో కార్యాలయంలో రెండు గంటలపాటు విచారణ నిర్వహించారు. జిల్లా, డివిజన్ అధికారులను మినహా ఎవరినీ అనుమతించలేదు. విచారణ అనంతరం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తు వేర్వేరుగా అధికారులను కలసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతోపాటు ప్రజాసంఘాల ప్రతినిధులను కూడా పిలిపించుకుని వారి గోడును అధికారులు విన్నారు. మృతులు కుటుంబాలకు రూ.50 లక్షల వంతున ఆర్థికసాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
త్వరలో బాధితులకు నష్టపరిహారం అందిస్తాం : వేగుళ్ల
రాయవరం బాణసంచాపేలుడు మృతుల కుటుంబాలకు త్వరలోనే నష్టపరిహరం ప్రభుత్వం అందించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. విచారణ కోసం వచ్చిన ద్విసభ్య అధికారులను కలిసి మాట్లాడడం జరిగిందని, బాధితులకు న్యాయం చేసేందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.