ఓ..మై గాడ్!
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:10 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నామినేటెడ్ పోస్టులకు ఆశావహులు పెరుగుతు న్నారు. ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ముందు క్యూకడుతున్నారు. పోస్టులు ఇప్పించాలని కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1713 ఆలయాలు
పెద్ద ఆలయ బోర్డులకు డిమాండ్
వాడపల్లి ఆలయంపై ప్రధాన దృష్టి
పోటీపడుతున్న కూటమి నేతలు
ప్రముఖ ఆలయాల్లోనూ ఇంతే
నియోజకవర్గాల వారీ కసరత్తు
పెరుగుతున్న ఆశావహులు
కొన్ని కుర్చీలపై కర్చీఫ్‌లు
ద్వితీయస్థాయి నేతల పైరవీలు
(రాజమహేంద్రవరం /అమలాపురం - ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నామినేటెడ్ పోస్టులకు ఆశావహులు పెరుగుతు న్నారు. ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ముందు క్యూకడుతున్నారు. పోస్టులు ఇప్పించాలని కోరుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వమేర్పడి పది నెలలు కావస్తుండడంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కూటమి నాయకులు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగిన మరికొందరు వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.ఈ నెలాఖరుకి లేదా ఏప్రిల్ చివరికి వేలాది మంది కూటమి నేతలు, కార్యకర్తలకు నామి నేటెడ్ పోస్టులు దక్కనున్నాయి.
ఆలయ కమిటీల సందడి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు కమిటీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గుర్తింపు పొందిన దేవా లయాలు 1713కు పైగా ఉన్నాయి. అన్నవరం, వాడపల్లి, పిఠాపురం, సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ, అయినవిల్లి, కోటసత్తెమ్మ, అంతర్వేది, అప్పనపల్లి, రాజమ హేంద్రవరంలో కోటిలింగేశ్వరస్వామి, ఉమా మార్కెండేయస్వామి వంటి అనేక పెద్ద దేవా లయాలు ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ఏం జరిగిందో కానీ రూ.5 లక్షల ఆదాయంకంటే తక్కువ ఉన్న దేవాలయాలకు ట్రస్ట్‌బోర్డుల నియామకం వద్దని అప్పట్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 627 వరకూ ఉంటాయి. కూటమి ప్రభు త్వం చొరవ తీసుకుని రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకునేటట్టు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే 1713 దేవాలయాల కు కమిటీలను నియమించవచ్చు. ప్రస్తుతం ఐదు లక్షలకంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న సుమారు 590 దేవాలయాలకు మాత్రం కమిటీ లను వేసే ఆలోచన జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలవి 127 ఉన్నాయి. ఇవికాకుండా తక్కువ ఆదాయం గలవి 68 వరకూ ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవి 226, రూ.కోట్లలో ఆదాయం ఉన్నవి 19 ఉన్నాయి. మొత్తం అన్ని రకాలు కలిసి 611 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఐదు లక్షలకంటే ఎక్కువ ఆదాయం కలవి 200, పెద్దవి 11 ఉన్నాయి. అన్ని రకాలు కలిపి 900 ఉన్నాయి. గత నెలలో సీఎం చంద్రబాబు స్వ యంగా ఈ కమిటీలకు పేర్లను ప్రతిపాదించా లని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో సందడి మొదలైంది.
కత్తిమీద సాములా..
ఈనెల 14వ తేదీన పిఠాపురం కేంద్రంగా జనసేన రాష్ట్ర స్థాయి ప్లీనరీ నిర్వహణకు ఆ పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లీనరీలో చర్చనీయాంశంగా నామినేటెడ్ పదవులపై చర్చ జరగొచ్చని జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం వద్ద తమకు తగిన గుర్తింపు లభించడం లేదనే అంశాన్ని లేవనెత్తడం ద్వారా ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో అగ్రతాంబూలం కల్పించాలనే ఒత్తిడి పెంచనున్నట్టు సమా చారం. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్టపడ్డ కేడర్‌ను కాదని.. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి చేరిన కొందరు నాయకులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రాధాన్యం కల్పిస్తున్నారంటూ ఇప్పటికే ఆయా కేడర్లు ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నాయి. రాజో లు నియోజకవర్గంలో నిజమైన జనసేన శ్రేణులకు అన్యాయం జరుగుతోందని, వైసీపీ నుంచి వచ్చినవారికే పెద్దపీట వేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తిమీద సాములాగే ఉంది
ఏఎంసీలు.. కార్పొరేషన్లు
మార్కెట్ కమిటీల చైర్మన్ల పదవులకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఏయే సామాజిక వర్గానికి ఏయే మార్కెట్ కమిటీ ఇవ్వాలనేది నిర్ణయించారు. దాంతో ఎమ్మెల్యేలు కొంత మందికి ముందుగానే అభయహస్తం ఇవ్వడంతో వారి స్థానే భార్యల పేర్లు గానీ, ఇతరుల పేర్లను ప్రతిపాదించడానికి రకరకాల సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ఇక ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ డైరెక్టర్లను నియమించకపోవడంతో వాటికి ఆశావహులు పైరవీలు ప్రారంభించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులు తమకు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల స్థానాలు కల్పించాలంటూ ఒత్తిడి పెంచారు. ఈసారి పదవుల భర్తీలో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నియోజకవర్గాల స్థాయిలో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నందున వారిని, అటు బీజేపీని సమన్వ యం చేసుకుంటూ పదవులు ఇవ్వాల్సి ఉంది.
పోస్టుల భర్తీపై సీఎం సమీక్ష
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం నారా చంద్రబాబునాయుడు అమరావతిలో ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరుకు నియోజకవర్గస్థాయిలో ఉన్న మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, ఇతర కమిటీల్లో నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. సొసైటీలకు పాలకవర్గాలు, డీసీసీబీ కమిటీలకు సభ్యుల నియామకాన్ని పూర్తిచేసే యోచన ఉంది.
నాయకులకు పెను సవాల్..
కీలక దేవస్థానాలకు పాలకమండళ్ల నియామకం సవాళ్లుగా మారుతున్నాయి. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో వాడపల్లి, అంతర్వేది, అయినవిల్లి, మురమళ్ల, అప్పనపల్లితోపాటు వివిధ ఆలయాలకు పాలకమండళ్లను నియమించడం ఎమ్మెల్యేలకు శిరోభారంగా మారింది. వీటిలో ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పాలకవర్గానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఇదే తరహా పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లోను నెలకొన్నాయి.
ఒక్కో ట్రస్ట్‌బోర్డుకు 11 మంది
ఒక్కో దేవాలయానికి 11 మంది ట్రస్ట్‌బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. చైర్మ న్‌తో పాటు 10 మంది సభ్యులు ఉం టారు. దీనివల్ల వేలాది మంది కార్యకర్తలకు పదవులు దక్కనున్నాయి. మూడు పార్టీల నాయకులు అధిష్ఠానం ఆదేశాల మేరకు పంచుకుంటారు. ఈ సారి ట్రస్ట్‌బోర్డుల్లో 50 శాతం మహిళా సభ్యులను నియమించనున్నారు.ఈసారి కొత్త గా నాయీ బ్రాహ్మణులు ఒకరు, బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఒకరికి తప్పనిసరిగా స్థానం కలిగించేటట్టు ప్రభుత్వం చట్టం చేసింది.మిగిలిన 50 శాతం జనరల్ కేటగిరీలో ఉంటాయి. ప్రతి కమిటీలోనూ ఆలయ పూజా రులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
మద్యం తాగేవాళ్లకు నోచాన్స్
దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీల్లో మందుతాగే అలవాటు ఉన్నవారికి అవకాశం లేదు. ముఖ్యంగా హిందువై ఉండాలి. కనీసం 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. దేవుడిపై విశ్వాసం ఉండాలి. క్రిమినల్ కేసులు ఉండకూడదు. ఎండోమెంట్ భూములు లీజుకు తీసుకుని ఉండకూడదు. బకాయిలు ఉండకూడదు. వారి బంధువులు లీజుదారులై ఉండకూడదు. ఐపీ పెట్టినవారు, కుష్టువ్యాధి గ్రస్తులూ అనర్హులే. ట్రస్ట్ బోర్డులో సభ్యులెవ రికీ గౌరవ వేతనం ఉండదు. ఆలయ అభివృ ద్ధికి, దేవునికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యం.