Share News

పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 02:09 AM

రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌)లో ఎల్లపుడూ పరిశుభ్రత కొనసాగేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, దొంగతనాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.

పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు9, (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌)లో ఎల్లపుడూ పరిశుభ్రత కొనసాగేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, దొంగతనాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. నవజాత శిశువుల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ) ఏర్పాటును వేగవంతం చేయాలని స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జీజీహెచ్‌ అధికారులతో సమావేశమై కొత్త విభాగాల ఏర్పాటు, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య పరిరక్షణ వంటి అంశాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భద్రతా సిబ్బంది లోనికి వచ్చేవారి, బయటకు వెళ్లేవారి వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. భద్రతా సంస్థలు ఈ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించేలా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. జీజీహెచ్‌ లేఅవుట్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆర్చ్‌ నిర్మించాలని, ఆసుపత్రికి ఒకటి లేదా రెండు మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మార్గాలను బారికేడ్లు వేసి మూసివేయాలన్నారు. అవుట్‌పేషెంట్‌ సేవలు సమయానికి ప్రారంభమయ్యేలా టోకెన్‌ కౌంటర్లు పెంచాలని, న్యూరో సర్జరీ విభాగానికి అవసరమైన తాత్కాలిక సాంకేతిక నిపుణులను నియమించి సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. మృతదేహాలను తరలించడానికి మహాప్రస్థానం వాహనాలతోపాటు ప్రైవేటు వాహనాల నూ ఎంపానెల్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఆర్‌వీ సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 02:09 AM