నాచు సాగు పర్యావరణానికి మేలు: కలెక్టర్
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:20 AM
చెరువు ఆధారిత సముద్రపు (పాచి) నాచు సాగు వల్ల పర్యావరణానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు మేలు చేకూరుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.
మామిడికుదురు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): చెరువు ఆధారిత సముద్రపు (పాచి) నాచు సాగు వల్ల పర్యావరణానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు మేలు చేకూరుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. సీవీడ్జ్ ఎనర్జీ అన్నది సముద్రపు నాచును పెంచే ఒక వినూత్న పద్ధతి అన్నారు. శనివారం మామిడికుదురు మండలం కరవాక తూర్పుపాలెంలో బీచ్ రోడ్డులోని సీవీడ్జ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం విస్తీర్ణంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటుచేసిన ఫాం పాండ్, ఫిష్ పాండ్‌లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సముద్రపు నాచుతో అనేక ప్రయోజనాలు ఉంటాయని కలెక్టర్ అన్నారు. ఈ నాచు వల్ల ఆరోగ్యపరంగా, వ్యవసాయపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దీనిద్వారా సేంద్రీయ ఎరువులు తయారై వ్యవసాయంలో నేలసారాన్ని, మొక్కల పెరుగుదలను పెంచడానికి దోహదపడతాయన్నారు. అలాగే మానవుని శరీరంలో పలు రకాల వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారన్నారు. ఔత్సాహిక రైతులు నాచును పండించడానికి ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అమలాపురం ఆర్డీవో కె.మాధవి, తహశీల్దార్ సుబ్రహ్మణ్యాచార్యులు, డిప్యూటీ తహశీల్దార్ కె.శరణ్య, ఉద్యానవనశాఖ, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.