మాతృత్వానికే మాయని మచ్చ
ABN , Publish Date - May 13 , 2025 | 01:07 AM
పిఠాపురం, మే 12 (ఆంధ్రజ్యోతి): రెండో పెళ్లికి అడ్డుగా ఉందనే ఉద్దేశ్యంతో కర్కశత్వం ప్రదర్శించి కన్నపేగునే చిదిమేసింది ఆ కన్న (కసాయి) తల్లి. అందుకు పూర్తిగా సహకరించింది అమ్మ
రెండో పెళ్లికి అడ్డువస్తుందనే చిన్నారిని పీక నులిమి చంపేసి నూతిలో పడేశారు
అమ్మ, అమ్మమ్మ కర్కశత్వం
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
పిఠాపురం, మే 12 (ఆంధ్రజ్యోతి): రెండో పెళ్లికి అడ్డుగా ఉందనే ఉద్దేశ్యంతో కర్కశత్వం ప్రదర్శించి కన్నపేగునే చిదిమేసింది ఆ కన్న (కసాయి) తల్లి. అందుకు పూర్తిగా సహకరించింది అమ్మమ్మ. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ సంఘటనలో ఐదు నెలల చిన్నారిని అత్యంత పాశవికంగా పీక నులిమి చంపివేసి పక్కనే ఉన్న నూతిలో పడవేసి, క్షుద్రపూజలు జరిగినట్టు చూపించి హత్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూడడంతో చిన్నారిని హత్య చేసిన అమ్మ, అమ్మమ్మలను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం సీఐ జి.శ్రీనివాస్, పట్టణ ఎస్‌ఐ మణికుమార్ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే...
పిఠాపురం పట్టణం జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన ఐదు నెలల చిన్నారి యశ్వితను ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చంపి నూతిలో పడవేశారని నరసింగపురం గ్రామానికి చెందిన పెదపాటి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో సాంకేతికపరమైన అంశాలను ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టారు. తల్లి, అమ్మమ్మ ఈ హత్యకు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన యశ్విత తల్లి పసుపులేటి శైలజ, పెదపాటి సతీష్ ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదు నెలల క్రితం పాప (యశ్విత) పుట్టింది. శైలజ వివాహం జరిగిన నాటి నుంచి భర్త తనను అత్తవారింటికి తీసుకువెళ్లకపోవడం, యశ్విత పుట్టినప్పుడు భర్త కుటుంబసభ్యులు, బంధువులు రాకపోవడం, భర్త ముందులా సఖ్యతతో లేకపోవడం శైలజ కొంతకాలంగా ఇబ్బందిగా ఉంది. అదే సమయం లో ముందు నుంచీ అనుకున్న మేనత్త కొడుకు తో కాకుండా ప్రేమించి వివాహం చేసుకోవడం, సతీష్‌కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చని అమ్మమ్మ పసుపులేటి అన్నవరం భావించింది. అమ్మ శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి పథకం ప్రకారం ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చిన్నారి యశ్విత పీక నొక్కి చంపేసి వాళ్ల ఇంటి వెనుక ఉన్న అడ్డాల కుమారి ఇంటి ఆవరణలో గల బావిలో పడేశారు. అనంతరం చేసిన హత్యను కప్పి పుచ్చుకునేందుకు పాపను ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటారని నమ్మించేందుకు ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు జరిగినట్టు చూపించారు. అయితే అక్కడ వేసిన పసుపు, కుంకుమ ఇం టిలో నుంచి తెచ్చినట్టు ఉండటం, బావి సమీపంలో అమ్మమ్మ సెల్ పడిపోవడం తదితర అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు సాగించి ఇద్దరినీ అరెస్టు చేశారు.
అందరికి న్యాయం చెప్పే...
హత్య కేసులో కీలకంగా ఉన్న చిన్నారి యశ్విత అమ్మమ్మ అన్నవరం వారి కులపెద్దల్లో ఒక రిగా ఉంది. పలు విషయాల్లో న్యాయం చెప్తూ ఉండడంతో పాటు గొడవలు, వివాదాలు సర్దు బాటు చేస్తుంది. అందరికీ న్యాయం చెప్పే ఈమె మాత్రం కూతురితో కలిసి ముక్కుపచ్చలారని ఐదు నెలల ఆడబిడ్డను పీక నులిమి హత్య చే యడం విస్మయాన్ని కలిగించింది. అమ్మ, అమ్మ మ్మలు ఇంత కర్కశత్వంగా ఎలా వ్యవహరించగలిగారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచేసే అవకాశాలున్నాయనిభావిస్తున్నారు.
లోతుగా విచారణ
చిన్నారి హత్య కేసులో మరికొంత మంది పాత్ర ఉంటుందనే భావనలో పోలీసులు ఉన్నా రు. దీంతో మరింత లోతుగా విచారణ సాగించాలని నిర్ణయించారు. కోర్టు అనుమతితో అమ్మ, అమ్మమ్మలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. భర్త, మేనమామ, తాతయ్య, ఇతర కుటుంబసభ్యుల పాత్రపై విచారణ జరపనున్నారు. అదే విధంగా శైలజ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని వాట్సాప్ సంభాషణలు, ఫోన్ కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు.