అల..ఆనంద‘పురాలు’!
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:55 AM
పట్టణాలు, నగరాల్లో ఇంజనీరింగ్ సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
20 ఏళ్ల తరువాత పెంపుదల
ఒక్కొక్కరికి రూ.3,500 లబ్ధి
730 మంది కార్మికుల ఆనందం
అవుట్‌సోర్సింగ్ వర్కర్ల హర్షం
మరో హామీ నెరవేర్చిన సర్కారు
(పిఠాపురం-ఆంధ్రజ్యోతి)
పట్టణాలు, నగరాల్లో ఇంజనీరింగ్ సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు కేటగిరిల్లో ఉన్న వర్కర్ల వేతనాలను రూ.3,500 చొప్పున పెంచి జీవో జారీ చేయడంపై కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కీలకమైన ఇంజనీరింగ్ విభాగంతోపాటు వాటర్‌వర్క్స్, వీధి దీపాల నిర్వహణ, కంప్యూటర్ విభాగాల్లో అవుట్‌సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నా రు. ఈ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీరి సంఖ్యే అధికం. తాగునీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్ తదితర అంశాలపై ప్రజలకు మెరుగైన సేవలందడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నా రు. కొంతకాలంగా వీరి వేతనాలు పెరగలేదు. పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచినా ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారి వేతనాలను గత వైసీపీ ప్రభుత్వం పెంచలేదు. తమ వేత నాలు పెంచాలంటూ వీరు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు దేశం కూటమి నాయకులు గత ఎన్నికల సమయంలో వీరి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జీతాల పెంపుతోపాటు ఇతర డిమాండ్లపై తగిన స్పందన లభించకపోవడం తో ఇటీవల ఆందోళనబాట పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇంజనీరింగ్ వర్కర్లు పిఠాపురంలో భారీ ప్రదర్శన జరపడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాలు అందించారు.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు
అప్కాస్ (ఏపీ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్) పై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం వీరి డిమాండ్లను పరిశీలించి వేతనాలు పెంచాలని సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం అంగీకరించి ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న నాన్ పీహెచ్ వర్కర్లకు తదుపరి కేటగిరి వేతనాలు వర్తింపజేయడం ద్వారా రూ.3,500 వరకూ పెం పుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తు తం ఇంజనీరింగ్‌తో సహా వివిధ విభాగాల్లో ఉన్న మూడు కేటగిరీల నాన్ పీహెచ్ వర్కర్లకు వేతనాల పెంచడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.
730 మంది కార్మికులు
కాకినాడ జిల్లాలో కాకినాడ కార్పొరేషన్, పిఠాపురం, పెద్దాపురం, తుని, సామర్లకోట మునిసిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మునిసిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సుమారు 730 మందికి పైగా అవుట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనపెంపు ప్రయోజనం లభిస్తుందని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా తాము కోరుతున్న వేతనాల పెంపును ప్రభుత్వం అంగీకరించడంతో ఆనందోత్సాలు వ్యక్తంచేస్తూ స్వీట్లు పంచుకున్నారు.
స్పందించారు.. పెంచారు
మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించి వేతనాల పెంపుదలకు అంగీకరించారు. కేటగిరి-1 అవుట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలను రూ. 21,500 నుంచి రూ24,500కు, కేటగిరీ-2లో 18,500 నుంచి 21,500కి, కేటగిరి-3లో 15,000 నుంచి 18,500కి పెంచారు. వేతనాల పెంపు వల్ల కలిగే అదనపు భారాన్ని ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు తమ నిధులు నుంచి భరించాల్సి ఉంటుంది.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కూటమి ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిఠాపురంలోని జిల్లా ప్రతినిధులు సీహెచ్ సురేష్‌కుమార్, చిన్నారి సురేష్ తదితరులు తెలిపారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమ కష్టాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఇక రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఇంజనీరింగ్ వర్కర్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కలిసి ధన్యవాదాలు తెలిపా రు. రాష్ట్ర అవుట్ సోర్సింగ్ మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల ఏసుబాబు, సహాయ కార్యదర్శి బుంగ యేసురాజు, జిల్లా అధ్యక్షుడు కొటాని ముకుందరాం, నగర అధ్యక్షుడు సిరిక ప్రసాద్, కార్యదర్శి బాలభవాని కుమార్, ఉపాధ్యక్షుడు బి సాయి.. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గత వైసీపీలో ఎన్ని ఆందోళనలు చేసినా ఎవరు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం తమ డి మాండ్లను గౌరవించి వేతనాలు పెంచడం ఆనం దంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో 13వేల మం ది కార్మికులు ప్రయోజనం పొందారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కాగా మండపేటలోనూ సీఎంకు పాలాభిషేకం చేశారు.
20 ఏళ్ల కల తీరింది..
20 ఏళ్లుగా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇంజనీరింగ్, నాన్ పీహెచ్ సిబ్బంది ప్రత్యేక జీవోగాని వేతనాలు పెంపుదల చేపట్టలేదు. తొలిసారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక జివో ద్వారా జీతాలు పెంచింది. అందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సంక్షేమ పథకాలు అమలుచేయాలి.
- పెదపాటి గురునాథ్, మునిసిపల్ ఇంజనీరింగ్ సంఘ రాష్ట్ర సలహాదారుడు, కొవ్వూరు