Share News

నిధులు తెచ్చినా..టెండర్లు ఎందుకు పిలవలేదు..

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:01 AM

రాజమండ్రి ప్రధాన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు రూ.271 కోట్ల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు అవుతున్నా ఇంకా టెండర్లు ఎందుకు పిలవలేదని రాజమ హేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవను కలిసి ఆరా తీశారు.

నిధులు తెచ్చినా..టెండర్లు ఎందుకు పిలవలేదు..
రైల్వే జీఎం శ్రీవాస్తవతో చర్చిస్తున్న ఎంపీ పురందేశ్వరి

ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక

సమయం లేదని కలిసిన ఎంపీ

పుష్కరాలకు పనులవ్వాలని సూచన

కొవ్వూరులో రైలు హాల్ట్‌లపై విన్నపం

పలు అభివృద్ధి పనులపై చర్చ

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రాజమండ్రి ప్రధాన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు రూ.271 కోట్ల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు అవుతున్నా ఇంకా టెండర్లు ఎందుకు పిలవలేదని రాజమ హేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవను కలిసి ఆరా తీశారు. ఆంధ్రజ్యోతిలో మంగళ వారం పుష్కరాల నేపథ్యంలో రైల్వే పనుల్లో కదలిక లేదంటూ ప్రచురితమైన ‘సమయం లేదు మిత్రమా’ అనే కథనంపై ఆమె స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ పురందేశ్వరి సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవను కలిశారు. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తేవాలని కోరారు. పార్లమెంట్‌ పరిధిలోని పలు రైలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని, పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. గోదావరి, కొవ్వూరు రైల్వేస్టేషన్లలో టాయిలెట్స్‌ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. నిడదవోలు జంక్షన్‌లో రూ.150 కోట్లతో చేపట్టిన ఎలక్ర్టిఫికేషన్‌ పనులు, 4, 5 ప్లాట్‌ఫాం పనులు పూర్తయినా మెయిన్‌లైన్‌లో కలపడానికి అవసరమైన రూ.6 కోట్లను విడుదల చేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వే ప్రాజెక్టు 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడం, సర్వే జరిగినప్పటికీ పనులు పూర్తవలేదనే విషయాలను ఎంపీ ప్రస్తావించారు. వీటిపై రైల్వే జీఎం శ్రీవాస్తవ స్పందిస్తూ రాజమండ్రి ప్రధానరైల్వే స్టేషన్‌ అభివృద్ధికి సంబంధించిన పనులకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి మొదటి దశ పనులను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా నిధులివ్వాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వల్ల సత్తుపల్లి వరకూ పనులు చేశామని, ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తామని జీఎం వివరణ ఇచ్చారు. ఎంపీ పురందేశ్వరి వెంట రైల్వే యూనియన్‌ నాయకుడు ఉన్ని కృష్ణన్‌, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు బీజేపీ కౌన్సిలర్‌ పీఎం కృష్ణ ఉన్నారు.

కొవ్వూరులో రైళ్లకు హాల్ట్‌ ఇవ్వండి

కొవ్వూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): కరోనాకు ముందు వరకూ కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో 18 రైళ్లు ఆగేవని, ఇప్పుడు 8 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, ముఖ్యంగా చెన్నయ్‌, తిరుపతి వెళ్లే రైళ్లుతోపాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ కూడా ఆగడం లేదని ఎంపీ పురందేశ్వరి ప్రస్తావించారు. రైళ్లకు తిరిగి హాల్ట్‌లను పునరుద్ధరించాలని జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవకు బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో 2019లో 34 రైళ్లకు హాల్ట్‌ ఉండేదని, కొవిడ్‌ సమయంలో రైళ్ల హాల్ట్‌లను పూర్తిగా నిలిపివేయడంతో కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి 100కు పైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 2019 నాటి రైళ్లకు హాల్ట్‌లను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై జీఎం సానుకూలంగా స్పందించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. అనపర్తి, నిడదవోలు స్టేషన్లలో జన్మభూమికి హాల్ట్‌ కల్పించాలని కోరారు.

Updated Date - Jul 16 , 2025 | 01:01 AM