Share News

మొంథా.. వర్రీ..యే!

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:41 AM

మొంథా తుఫాన ముంచేసింది.. వరి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. తుఫాన్‌కు ముందు రెండు రోజులు అల్పపీడనాలతో కురిసిన వర్షాలకు చేలల్లో నీరు చేరి పంట దెబ్బతినగా తీవ్ర తుఫానతో మరింత నష్టపోయింది. రోజుల తరబడి నీళ్లల్లో పంట నానిపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది.

మొంథా.. వర్రీ..యే!
కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో నీట మునిగిన వరిచేను

  • తుఫాన మిగిల్చిన క(న)ష్టం..

  • లక్షలాది ఎకరాల్లో మునిగిన పంట

  • లబోదిబోమంటున్న అన్నదాత

  • జిల్లాల వారీగా బృందాల ఏర్పాటు

  • నష్టం అంచనాల్లో అధికారులు

  • వారం రోజుల్లో పూర్తి నివేదిక

  • అల్పపీడనంతో అక్కడక్కడా వానలు

(కాకినాడ/రాజమహేంద్రవరం/అమలాపురం-ఆంధ్రజ్యోతి)

మొంథా తుఫాన ముంచేసింది.. వరి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. తుఫాన్‌కు ముందు రెండు రోజులు అల్పపీడనాలతో కురిసిన వర్షాలకు చేలల్లో నీరు చేరి పంట దెబ్బతినగా తీవ్ర తుఫానతో మరింత నష్టపోయింది. రోజుల తరబడి నీళ్లల్లో పంట నానిపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.326కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. నష్టం లెక్కింపు కొన సాగుతుండడంతో పెరిగే అవకాశం ఉంది. వరి, ఉద్యాన వన పంటలతో పాటు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. విద్యుత శాఖకు నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పొలాలు మునకలో ఉండడం తో యాప్‌ ద్వారా అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నష్టాల అంచనాలు తేల్చే పనిలో పడ్డాయి.

కాకినాడలో రూ.98 కోట్లు

మొంథా తుఫాన జిల్లాలో అన్నదాతను నిలు వునా ముంచేసింది. భారీ ఈదురుగాలులు, కుండ పోత వానతో వరి వెన్నువిరిచింది. మరికొద్ది వారాల్లో చేతికి రానున్న పంటను చిదిమేసింది.దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు లబోదిబోమంటు న్నా రు. తుఫాన్‌ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుండడంతో గురువారం పలు చోట్ల ఏక ధాటిగా కుండపోతగా వాన కురిసింది. ఎగువున భారీ వర్షాలతో ఒక వైపు గోదావరి.. మరో వైపు ఏలేరుకు వరద ముప్పు పెరుగుతోంది. మొంథా తుఫాన్‌ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటడంతో వ్యవసాయశాఖ బుధవారం కాకినాడ జిల్లా వ్యాప్తం గా 368 గ్రామాల్లో బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో నష్టం అంచనాలు వేస్తోంది. ఖరీఫ్‌ సీజన లో కాకినాడ జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుచేయగా గురువారం నాటికి ప్రాథమికంగా 50,700 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుర్తించా రు.ఈ నష్టం విలువ రూ.98 కోట్ల వరకు అంచనా. మొత్తం జిల్లాలో 261 గ్రామాల్లో నష్టం జరగ్గా పంట నష్టపోయిన అన్నదాతలు 33,596 మందిగా గుర్తిం చారు.ఇది పెరగనుంది. పంట నష్టం అంచనాలు పూర్తయ్యే సరికి వారం పట్టనుంది. అత్యధికంగా పెదపూడి మండలంలో 16 వేల ఎక రాల్లో వరి దెబ్బతింది. ధాన్యం తడిచి మొలకలు వచ్చేశాయి. గురువారం పర్యటించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి నష్టం తీవ్రతను మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోనలో వివరించా రు. మొక్కజొన్న 200 ఎకరాలు, పత్తి 2,700 ఎకరాల్లో నష్టపోయింది.

తూర్పున రూ.80 కోట్లు

మొంథా కష్టమొచ్చింది..భారీ నష్టాన్ని మిగిల్చింది.. తుఫాన ప్రభావం కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్త వ్యస్తమైంది. జిల్లా లో వివిధ శాఖలకు సంబం ధించి ప్రాఽథమిక అం చనా ప్రకారం రూ.107 కోట్లకు పైగా నష్టం వాటి ల్లింది.అధికారులు క్షేత్రస్థాయిలో అంచనాల్లో నిమ గ్నమయ్యారు.జిల్లాలో 209 గ్రామాలపై తుఫాన ప్రభావం చూపినట్టు అంచనా వేశారు. 10,626 మంది నష్టపోయారు. వ్యవసాయరం గంలో 2115 హెక్టార్ల పంటపై ప్రభావం పడింది. ఉద్యానవన పంటలు 581.4 హెక్టార్లలో నష్టం జరి గింది. జిల్లాలో 56 గృహాలు దెబ్బతిన్నాయి. 68 రిలీఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, 2718 మందికి పున రావాసం కల్పించారు. 18,872 మందికి ఆహారం, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో 87.99 కిలోమీటర్ల మేర 48 ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిని రూ.54.57 కోట్ల నష్టం వాటిల్లింది. పంచా యతీ రాజ్‌కు చెందిన 33 రోడ్లు 69.465 కిలో మీటర్ల మేర దెబ్బతినగా రూ.45.81 కోట్లు నష్టం వాటిల్లింది.మైనర్‌ ఇరిగేషన వనరులు 21 దెబ్బతి నగా రూ.6.87 కోట్లు నష్టం జరిగింది. 123 వాటర్‌ ట్యాంక్‌లు డ్యామేజీ అయ్యాయి.జిల్లాలో 429 హెల్త్‌ సబ్‌-సెంటర్లు ఉన్నాయి. 251 మెడి కల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. విద్యుత శాఖకు రూ.37.34 లక్ష లు నష్టం వచ్చినట్టు ప్రాథమిక అంచనా వేశారు.

కోనసీమలో రూ.148 కోట్లు

మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 78 వేల ఎకరాల్లో రూ.148 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. 22 మండలాలు, మూడు పట్టణాలు, ఒక నగర పంచాయతీ పరిధిలో జరిగిన పంట నష్టాలు నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ జిల్లా యంత్రాంగాన్ని గురువారం ఆదేశించారు. నష్టాల అంచనాలో అధికార బృందాలు నిమగ్నమ య్యాయి. ఒకట్రెండురోజుల్లో తుఫాన్‌ నష్టాలను రూపొందించిన కలెక్టర్‌కు నివేదించనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రాథమికంగా 31 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాలను నియమించి నష్టాలను అంచనా వేస్తున్నారు. కౌలు రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 300 విద్యుత్‌ స్తంభాలతోపాటు 125 కిలోమీటర్ల పరిధిలో చెట్లు, వివిధ రకాల వృక్షాలు కుప్పకూలాయి. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలని నివేదించారు.జిల్లాలో 47 పాఠశాలల్లో డ్యామేజీలు అయినట్టు విద్యాశాఖ అంచనాలు రూపొందించాయి. రానున్న ఐదు రోజుల్లో నివేదికలు రూపకల్పనలు చేసి సమర్పించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.

తుఫాన బాధితులకు సాయమిలా..

తుఫాన్‌ వల్ల పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసరాలతో పాటు కుటుంబానికి రూ.3 వేలు, ఒంటరి వ్యక్తులకు రూ.వెయ్యి వంతున పరిహారం అందించడానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాకినాడ తీరప్రాంతంలో ఉన్న 45 గ్రామాల్లో 30 వేల మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. చేనేత కార్మికులకు బియ్యాన్ని అందించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వీటిని ప్రారంభించి మూడురోజుల్లోగా పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని ఇళ్లకు వెళ్లేవారికి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వంటనూనె, పంచదారతోపాటు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. పశు సంవర్థకశాఖ 50 శాతం రాయితీపై దాణాను పంపిణీకి సిద్ధం చేసింది.

వానలు..వరదలు..

తీవ్ర తుఫాన తీరం దాటి బలహీన పడి తీవ్ర వాయుగుండగా కొనసాగుతుండడంతో పలుచోట్ల భారీవర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం,సామర్లకోట, యు.కొత్తపల్లి, గోపా లపురం తదితర మండలాల్లో 3 గంటల కుపైగా భారీగా కుండపోత వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత నిలిపివేశారు. మరో పక్క భారీ వర్షాలతో కాలువలు, చెరు వులు పొంగిపొర్లుతున్నాయి. కాకినాడ- సామర్లకోట రహదారిలో పలుచోట్ల భారీగా నీరు చేరిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. అటు ఏలేరు రిజర్వాయరుకు ఎగువ నుంచి భారీగా ఇనఫ్లో కొనసాగు తుం డడంతో వరద ముప్పు పొంచి ఉంది. గురు వారం ఉదయం ఇనఫ్లో 38 వేల క్యూసెక్కు లకు చేరడంతో అధికారులు బెంబేలెత్తారు. ఇప్పటికే కాలువల ద్వారా నీరు 7 వేల క్యూసె క్కులకు దిగువకు వదులుతుండగా మరింత కిందకు వదిలితే అనేక మండలాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందారు. కిర్లంపూడిలో ఒకచోట గండిపడడంతో ఇసుక బస్తాలు ఉంచారు. ఏలేరుకు వరద తగ్గుతూ పెరుగుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్‌ షాన మోహన రిజర్వాయరును పరిశీలించారు. అన్నవరంలో పంపా రిజర్వాయరుకు వరద పోటెత్తుతోంది.దీంతో తుని రూరల్‌ పరిధిలోని తిమ్మాపురం శివారున రహదారులపై నీరుచేరింది.

నేటి నుంచి వేటకు ఓకే..

మొంథా తుఫాన ముప్పుతో సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. దీంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమై ఇబ్బంది పడుతున్నారు.తుఫాన ముప్పు తొల గడంతో మత్స్యకారులు శుక్రవారం నుంచి వేటకు వెళ్లవచ్చని వాతావరణ శాఖ ప్రకటిం చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలు నేటితో నిలిపివేయనున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:41 AM