Share News

పుష్కర అంచనా రూ.2 వేల కోట్లు

ABN , Publish Date - May 04 , 2025 | 12:56 AM

గోదావరి 2027 పుష్కరాలకు రూ.2 వేల కోట్లు అంచనాలు ప్రభుత్వానికి పంపించామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

పుష్కర అంచనా రూ.2 వేల కోట్లు
రోడ్డుపనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): గోదావరి 2027 పుష్కరాలకు రూ.2 వేల కోట్లు అంచనాలు ప్రభుత్వానికి పంపించామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం 9వ డివిజన్‌ వెంకటేశ్వనగర్‌లో రూ.90 లక్షలతో చేపడుతున్న రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో ఇంటర్నల్‌ రోడ్డుకు సంబంధించి గత వైసీపీ హయాంలో వెంకటేశ్వరనగర్‌ రోడ్డుకు నిధులు మంజూరైనా.. ఈ ప్రాంతంలో వైసీపీ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా ఏళ్ళతరబడి రోడ్డు వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 7న గోదావరి రివర్‌ ఫ్రంట్‌ పనులు ప్రారంభి స్తున్నామని చెప్పారు. అప్పర్‌ ప్రామినేట్‌ పనులు ముందుగా చేపడుతున్నామని.. లోయర్‌ ప్రామినేట్‌ పనులకు ఇరిగేషన్‌ అధికారుల అనుమతి రావాల్సి ఉందన్నారు. గత పదినెలల్లో రాజమహేంద్రవరంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామన్నారు. నగరంలో 21 పార్కుల సుందరీకరణకు రూ.10 కోట్లు కేటాయించామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 12:56 AM