డిసెంబరు 31కి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:42 AM
రాష్ట్రవ్యాస్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవు తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
దివాన్‌చెరువు/అనపర్తి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాస్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవు తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.రాజానగరం మండలం సంపత్‌నగరం, అనపర్తి మండలం పొలమూరు, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామాల్లో రైతుసేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాలను మంగళవారం సందర్శించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా గౌరవించాలని, రైతులను అవమానపరిస్తే ప్రభుత్వాన్ని అవమానించినట్లేనని మిల్లర్లను హెచ్చరిం చారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 89 వేల మంది రైతుల నుంచి 1.80 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.430 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. తేమశాతం, గోనెసంచులు, రవాణా వంటి అంశాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల సిబ్బందికి మూడు నెలలుగా పర్యాయ పరిశీలనతో శిక్షణ ఇస్తున్నామని తద్వారా రైతుల్లో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఇబ్బం దులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక మీదట పడకూడదన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుతం 4 గంట ల్లోనే సొమ్ములు జమచేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో కొందరు మిలర్లు చూపిన నిర్లక్ష్యం రైతులకు ఇబ్బందిగా మారిందని అందువల్ల ధాన్యం రవాణా మిల్లింగ్ ప్రతి దశలోను కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తోందన్నారు. పంటలకు సాగునీటిని సమృద్ధిగా అందించడంతో రైతులు రెండు పంటలు పండించుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరలాల్సిన ఆవశ్యకతను వివరించారు. రైతుల కోసం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.గత ప్రభుత్వంలో రైతులకు బకాయి పెట్టిన సొమ్ములు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. జేసీ వై.మేఘస్వరూప్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత వారి నుంచి వేలి ముద్రలు తీసుకున్న 4 గంటల్లోనే నగదు జమచేయడం జరుగుతోందన్నారు. ఆయన వెంట రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, ఆర్డీవో కృష్ణనాయక్,డీఎస్‌వో ఎం.పార్వతి, డీసీవో ఎం.వెంకటరమణ డీఎం సీఎస్ గణేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు, పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, ఏఎంసీ చైర్మన్ జత్తుక సూర్యకుమారి, జనసేన నాయకుడు రావాడ నాగు, కూటమి నాయకులు ఉన్నారు.