Share News

మంత్రి నిమ్మల సమక్షంలో గొరగనమూడి పంచాయితీ

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:12 AM

ఎట్టకేలకు గొరగనమూడి డ్రెయిన్‌కు మోక్షం లభించింది. ఉప్పలగుప్తం మండలంలో 1,200 ఎకరాల్లో వరి పొలాలను నిండా ముంచేస్తున్న గొరగనమూడి డ్రెయిన్‌ను ఆధునికీకరించాలంటూ ఎన్నో ఏళ్ళుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే డ్రెయిన్ల పరిస్థితిపై దృష్టి సారించారు. రూ.66 లక్షలతో గొరగనమూడి డ్రెయిన్‌లో పూడికతీతకు టెండర్లు ఖరారు చేశారు. నెలలు గడుస్తున్నా సదరు కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు.

మంత్రి నిమ్మల సమక్షంలో గొరగనమూడి పంచాయితీ
పాలకొల్లులో మంత్రి రామానాయుడుతో మాట్లాడుతున్న ప్రాజెక్టు చైర్మన్‌ శ్రీనివాస్‌

  • నేటి నుంచి డ్రెయిన్‌ పూడికతీత పనులు

ఉప్పలగుప్తం, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు గొరగనమూడి డ్రెయిన్‌కు మోక్షం లభించింది. ఉప్పలగుప్తం మండలంలో 1,200 ఎకరాల్లో వరి పొలాలను నిండా ముంచేస్తున్న గొరగనమూడి డ్రెయిన్‌ను ఆధునికీకరించాలంటూ ఎన్నో ఏళ్ళుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే డ్రెయిన్ల పరిస్థితిపై దృష్టి సారించారు. రూ.66 లక్షలతో గొరగనమూడి డ్రెయిన్‌లో పూడికతీతకు టెండర్లు ఖరారు చేశారు. నెలలు గడుస్తున్నా సదరు కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. డ్రెయిన్స్‌ అధికారులు దీనిపై రోజుకొక విధంగా మాట్లాడుతున్నారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సార్వా సాగు చెయ్యాలంటే డ్రెయిన్‌లో పూడిక తీయాల్సిందే. లేకుంటే సార్వా సాగుచేయలేమని రైతులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో నీటిసంఘం ప్రాజెక్టు చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌, ఉప్పలగుప్తం నీటి పంపిణీ సంఘం చైర్మన్‌ దంగేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నీటిసంఘాల చైర్మన్లు, రైతు ప్రతినిధులు శుక్రవారం రాత్రి జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడును పాలకొల్లులో కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన ఎస్‌ఈతో మాట్లాడారు. ఎస్‌ఈ కిందిస్థాయి అధికారుల ను ప్రశ్నించగా ప్రస్తుతం కాంట్రాక్టరు అల్లవరం మండలంలో పనులు చేస్తున్నారని, చేసిన వాటికి బిల్లులు రాకపోవడంతో గొరగనమూడి డ్రెయిన్‌ పనులు ప్రారంభించలేదని సమాచారమిచ్చారు. ఈ సమాచారంతో ఆగ్రహించిన మంత్రి సకాలంలో పనులు చెయ్యని కాంట్రాక్టర్‌కు ఎందుకు నోటీసు ఇవ్వలేదని ఎస్‌ఈని ప్రశ్నించినట్టు ఉప్పలగుప్తం డీసీ చైర్మన్‌ చిట్టిబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దీంతో ఎస్‌ఈ కిందిస్థాయి అధికారులను వివరణ కోరారన్నారు. ఫలితంగా ఈనెల 13న గొరగనమూడి డ్రెయిన్‌ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ సన్నమద్ధమయ్యారు. శనివారం యంత్రాలను డ్రెయిన్‌ వద్దకు చేర్చారు. కాగా ఎస్‌ఈ గోపీనాథ్‌ డ్రెయిన్‌ పనులు ప్రారంభిస్తారని రైతులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, నీటి సంఘం చైర్మన్‌ నల్లా సత్యనారాయణ, కాట్రేనికోన డీసీ మాజీ చైర్మన్‌ అరిగెల నానాజీ, అడబాల సత్యనారాయణ, చిక్కం వెంకటకృష్ణ, చిక్కం పెద్దబ్బులు, రవణం మధు తదితరులున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:12 AM