Share News

Montha Cyclone: ఉగ్రమొంథా..!

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:44 AM

ఏం జరుగుతుందో.. ఏమైపోతుందో.. ఎక్కడ తీరం దాటుతుందో.. గత మూడు రోజులుగా ఒక్కటే టెన్షన్‌.. ఎందుకంటే మొత్తమొంథా కమ్మేసింది.. పచ్చని గోదావరి జిల్లాల్లో అల్లకల్లోలం.. తుఫాన్‌ తీవ్రతకు అతలాకుతలమయ్యాయి..

Montha Cyclone: ఉగ్రమొంథా..!
అల్లకల్లోలం : తుఫాన్‌ తీవ్రత కారణంగా ఉప్పాడ వద్ద బీచ్‌రోడ్డుపైకి ఎగసిపడుతున్న అలలు..

  • భీకరం.. భయంకరం

  • వణికించిన తుఫాన్‌..ఉమ్మడి జిల్లా విలవిల

  • ఈదురుగాలులు, కుంభవృష్టి వానలు

  • ఉప్పాడ వద్ద బీచ్‌రోడ్డుకు గండ్లు

  • నేడు బడులకు సెలవు

ఏం జరుగుతుందో.. ఏమైపోతుందో.. ఎక్కడ తీరం దాటుతుందో.. గత మూడు రోజులుగా ఒక్కటే టెన్షన్‌.. ఎందుకంటే మొత్తమొంథా కమ్మేసింది.. పచ్చని గోదావరి జిల్లాల్లో అల్లకల్లోలం.. తుఫాన్‌ తీవ్రతకు అతలాకుతలమయ్యాయి.. ఎటు చూసినా కూలిన చెట్లు.. భారీ వృక్షాలు.. విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు.. కొబ్బరిచెట్లు.. వెన్నువిరిగిన వరి చేలు.. అంతా బాగుందనుకునేలోపే ఉపద్రవం.. ఎటు చూసినా కష్టం.. నష్టమే మిగిల్చింది.. ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఒక పక్కన చంద్రబాబు.. మరో పక్కన పవన్‌.. సమీక్షలు చేస్తూనే ఉన్నారు.. పోలీసులు అప్రమత్తమయ్యారు.. పలు రైళ్లు, బస్‌ సర్వీసులు రద్దు చేశారు. బడులకు సెలవులిచ్చేశారు.. తుఫాన్‌ సహాయక చర్యల నిమిత్తం సీఎం చంద్రబాబు రానుండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు..

(కాకినాడ/అమలాపురం - ఆంధ్రజ్యోతి): కుంభవృష్టిగా వాన.. కూకటివేళ్లతో లేచిపోయిన వేలాది కొబ్బరిచెట్లు.. తాటిచెట్లు.. సముద్రం కూడా ప్రళయంగా మారింది.. మొంథా తుఫాన్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను చిగురుటాకులా వణికించింది.1996 నవంబరు 6 తుఫా న్‌ను గుర్తుచేస్తూ ప్రజలు విలవిలలాడేలా చేసింది. కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలు తుఫాన్‌ తీవ్రతకు విలవిల్లాడాయి. ఉదయం నుంచీ ఈ రెండు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.

అదే సమయంలో తీవ్రమైన పెను గాలులు భయాందోళనలకు గురిచేశాయి.గాలుల తీవ్రతకు మహా వృక్షాలు నేలకొరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది చెట్లు కూకటివేళ్లతో సహా నేలవాలాయి. అటు తుఫాన్‌ తీరం దాటే సమయంలో మంగళవారం అర్ధరాత్రి కాకినాడ,కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టిని మించిన వాన కురిసింది.అటు తీర ప్రాం తంలో ఈదురుగాలులు భీకరంగా మారి హోరున శబ్దాలతో జనాన్ని వణికించాయి.అర్ధరాత్రి పన్నెండు దాటే సమయానికి కోనసీమ జిల్లాలో వేలాది కొబ్బరి, ఇతర చెట్లు నేలకూలాయి.అమలాపురం- రావుల పాలెం జాతీయ రహదారి పైనా భారీ వృక్షాలు నేలకూలాయి.

అంతర్వేదిపాలెంలో తుఫాన్‌ తీరం దాటడంతో సము ద్రం అల్లకల్లోలంగా మారింది. అంతర్వేదిలో సముద్రపు కెరటాలు లైట్‌హౌస్‌కు తాకాయి. రాజోలు నియోజకవర్గంలో పలు సెల్‌ టవర్లు దెబ్బతిన్నాయి.తుఫాన్‌ హెచ్చ రికలతో కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నా యుడు హుటాహుటిన అమలాపురం చేరుకుని అధి కారులతో సమీక్షించారు. ఇక మంగళవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై రాకపో కలు నిలిపివేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా అన్ని బస్సులను కోనసీమకు వెళ్లకుండా నిలిపివేశారు. దాదాపు అన్ని చోట్ల దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

తుఫాన్‌ తీవ్రతకు కాకినాడ ఉప్పాడ బీచ్‌ ప్రళయంగా మారింది. పదిహేను మీటర్లకు పైగా ఎత్తున అలలు ఎగసిపడడంతో బీచ్‌ రోడ్డుకు రెండుచోట్ల గండిపడింది. మరోపక్క తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తీరప్రాంత ప్రజలను అధికారులు బస్సుల్లో తరలించారు.మంగళవా రం ఉదయం నుంచీ చెట్లు కూలిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను ఎక్కడిక్కడ అధికారులు నిలిపివేశారు. కూలిన విద్యుత్‌ స్తంభాలను మార్చడం, ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్లను కొత్తవి ఏర్పాటుచేసి విద్యుత్‌ సరఫరాను గంటల వ్యవధిలోనే పునరుద్ధరించారు.కొన్ని గ్రామాల్లో మాత్రం అంధకారం నెలకొంది. తుఫాన్‌ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటగా..దీని ప్రభావంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

తాటిచెట్టు విరిగిపడి మహిళ దుర్మరణం

పలకరించడానికి వచ్చిన ఒక మహిళ తాడిచెట్టు విరిగిపడి మృతిచెందింది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామానికి చెందిన గూడపల్లి వీరవేణు (49) అదే గ్రామంలో ఉండే తన ఆడబడుచు కుమారుడు అనారోగ్యం పాలవడంతో అతడిని పలకరించడానికి వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో ఈదురుగాలుల ప్రభావంతో తాడిచెట్టు విరిగి మీద పడి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో మాకనపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సందర్శించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారీ వాహనాలు నిలిపివేత

తుఫాన్‌ నేపథ్యంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై రాత్రి ఏడు గంటల నుంచి భారీ వాహనాలు నిలిపివేశారు. జగ్గంపేటలో చెన్నై టు కోల్‌కతా జాతీయ రహదారి మూసివేశారు. దాంతో భారీ వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.

నేడు సీఎం చంద్రబాబు రాక?

సీఎం చంద్రబాబు బుధవారం ఉమ్మడి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే బుధవారం మధ్యాహ్నానికి ఆయన రాజమహేంద్రవరం చేరుకుంటారని సమాచారం. తుఫాన్‌ తీవ్ర త అధికంగా ఉండడం, తీరం దాటిన సమ యంలో భారీగా నష్టం చోటుచేసుకున్న నేప థ్యంలో స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

గంటగంటకు పవన్‌ సమీక్ష

పిఠాపురం : తుఫాన్‌ ప్రభావం కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సూచించారు. నివేదికలు ఆధారంగా మంగళవారం ప్రతి గంటగంటకు తుఫాన్‌ పరిస్థితులపై కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ప్రత్యేక అధికారి కృష్ణతేజ, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌లతో సమీక్షించారు. పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, ఔషధాలు, పాలు అందుబాటులో ఉంచ డంతో పాటు జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కేం ద్రాల్లో 12 వేల మందికి మధ్యాహ్న భోజనం, 15 వేల మందికి రాత్రి భోజనం ఏర్పాటు చేశామని, 5 వేల పాలప్యాకెట్లు, 1.50 లక్షల వాటర్‌ ప్యాకెట్లుతో పాటు వాటర్‌ ట్యాంకర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట తదితర గ్రామాల్లో సహాయక కార్యక్రమాల పర్యవేక్షణకు గ్రామానికో ప్రత్యేకాధికారిని నియమించామన్నారు.

ధైర్యంగా ఉండండి : మంత్రి దుర్గేష్‌

నిడదవోలు : మొంథా తుఫాన్‌ పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రజలకు అండగా ఉన్నామని.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడ దవోలులోని తమ క్యాంపు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని.. అత్య వసర పరిస్థితుల్లో అధికారులు.. ప్రజలకు మధ్య అనుసంధానం చేస్తామన్నారు.తుఫాన్‌ బాధిత ప్రజలు 98481 66644, 95503 65446, 88865 19418 94404 07096 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

అప్రమత్తంగా ఉండాలి : పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌ : మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పురందేశ్వరి రాష్ట్రంలోని తుఫాన్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లా డారు.ముందస్తు చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని,సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో వలంటీర్లుగా సేవలందించడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తెలిపారు.

ముంపు లేకుండా చర్యలు : ఎంపీ

పిఠాపురం : ఏలేరు వరద ముంపు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురం-గొల్లప్రోలు మధ్య పిడిందొడ్డి రెగ్యులేటర్‌ సమీపంలో కోతకు గురవుతున్న ఏలేరు కాలువ గట్లను మంగళవారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులతో కలిసి పరిశీలించారు. గట్లు కోతకు గురి కాకుండా ఇసుక బస్తాలు వేసే పనులను పరిశీలించారు. ఏలేరు కాల్వ గట్లపై పడిపోయిన చెట్లను తక్షణం తొలగించాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈకి ఫోనులో సూచించారు. అనంతరం గొల్లప్రోలు బల్లకట్టు వద్ద ఏలేరు వరదను పరిశీలించారు. గట్లకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 29 , 2025 | 02:24 PM