మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:11 AM
మండపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ (51) గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి గతంలో
గుండెపోటుతో చుండ్రు శ్రీవరప్రకాష్ కన్నుమూత
ఇంటికి తరలివచ్చిన నాయకులు, వ్యాపారవేత్తలు
మండపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ (51) గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి గతంలో అనారోగ్యంతో మరణించగా, ఆయన మాతృమూర్తి అనంతలక్ష్మి(అమ్ములు) ఏడాది కిందట కన్నుమూశారు. ఆయన కుమారుడు కిరీటి యూఎస్‌లో చదువుతుండగా ఆయన కుమార్తె ఇంటర్ చదువుతున్నారు. ప్రకాష్‌కు సేవాతత్పరుడిగా పట్టణంలో మంచిపేరు ఉంది. ఆదివారం రోజంతా పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొ న్న ఆయన రాత్రి ఇంటికి చేరిన తర్వాత ఆరోగ్యం నలతగా అనిపించడంతో సమీపంలో ఆర్‌ఎంపీని పిలిపించుకున్నారు. తర్వాత మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారి గుండెపోటుతోపాటు బీపీ అధికం కావడంతో ఆయనను ఇంటి వద్ద నుంచి హుటాహుటిన మండపేటలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన కన్నుమూశారని వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణ వార్త పట్టణమంతా వ్యాపించటంతో పార్టీ శ్రేణులు, హితులు కేపీ రోడ్డులో దాసిరెడ్డి వారి వీధిలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆయన పార్ధివదేహా న్ని ఇంటి వద్ద ఉంచారు. ఆయన కూమారుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా ప్రకాష్ మృతితో ఆయన కుటుంబంతోపాటు టీడీపీలో విషాదచాయలు అలుముకున్నాయి. మండపేట మున్సిపల్ చైర్మన్‌గా 2014- 2019 మధ్య పనిచేసిన ప్రకాష్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు శానిటేషన్ విషయంలో పలు అవార్డులు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అన్నివిధాలా పార్టీ వ్యవహారాల్లో వెన్నుదన్నుగా నిలిచేవారు. ప్రస్తుతం మండపేటలో టీడీపీ వ్య వహారాల ఇన్‌చార్జిగానూ ఉన్నారు.
తీరనిలోటు : మంత్రి సుభాష్
విద్యావంతుడు రాజకీయనేత్త, వ్యాపారవేత్త, సామాజిక సేవా తత్పరుడిగా చుండ్రు శ్రీవరప్రకాష్ అతిపిన్న వయస్సులోనే గుండెపోటుకు గురై మరణించడం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి కుటుంబానికి తీరని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. సోమవారం మండపేటలో ప్రకాష్ స్వగృహానికి మంత్రి చేరుకుని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ప్రకాష్ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అమలాపురం ఎంపీ జీవీ హరీష్‌మాధుర్, ఏపీఐడీసీ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
మండపేటలో దుకాణాలు బంద్
చుండ్రు శ్రీవరప్రకాష్ ఆకస్మిక మరణంతో మండపేట పట్టణంలో చాంబర్ ఆప్ కామర్స్ పిలుపు మేరకు సోమవారం వ్యాపార సంస్థలు మూసివేశారు. అలాగే మంగళవారం పట్టణంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ప్రకాష్ మృతికి సంతాపంగా మూసివేస్తున్నామని ప్రైవేటు పాఠశాల యాజమాన్యల సంఘప్రతినిధులు సోమవారం ప్రకటించారు.