గొల్లపుంత.. అమ్మిందెంత!
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:16 AM
మండపేట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మండపేట పట్టణంలో గొల్లపుంతకాలనీ అంటే తెలియని వారుండరు. నిర్వాసితుల కోసం ఏర్పడిన అతిపెద్ద కాలనీ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆలమూరు ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి కృషి పలితంగా 128 ఎకరాల ప్రభుత్వ భూమిని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలుగా పట్టాలు పంపిణీ చేశారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు అందించడంతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారు లు మూడు వంతుల మంది ఇతరులకు విక్రయించేశారు. తర్వాత కూడా క్రయవిక్రయాలు జరిగిపోయాయి. ఇక్కడ స్థలాల విక్రయాల ద్వారా కొంద రు దళారులు కో
2009లో 128 ఎకరాల్లో
వేల మందికి ఇళ్ల పట్టాలు
ఏకంగా 567 ఇళ్ల స్థలాలు
క్రయవిక్రయాలు
ఇటీవల మండపేట రెవెన్యూ
అధికారుల పట్టాల సర్వే
బాధ్యుల నుంచి లిఖితపూర్వక వివరణల సేకరణ
బినామీ పేర్లతో పట్టాలు
పొందిన వాళ్లే అధికం
అవసరమైతే పట్టాలు రద్దు..
కొత్త పట్టాల మంజూరు
అక్రమ కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు
మండపేట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మండపేట పట్టణంలో గొల్లపుంతకాలనీ అంటే తెలియని వారుండరు. నిర్వాసితుల కోసం ఏర్పడిన అతిపెద్ద కాలనీ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆలమూరు ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి కృషి పలితంగా 128 ఎకరాల ప్రభుత్వ భూమిని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలుగా పట్టాలు పంపిణీ చేశారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు అందించడంతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారు లు మూడు వంతుల మంది ఇతరులకు విక్రయించేశారు. తర్వాత కూడా క్రయవిక్రయాలు జరిగిపోయాయి. ఇక్కడ స్థలాల విక్రయాల ద్వారా కొంద రు దళారులు కోట్లకు పడగలెత్తారు. అయితే ఈ కాలనీలో ప్రస్తుతం లబ్ధిదారుదారులెందరు, స్థలం పొందిన వారు ఇల్లు నిర్మించుకున్నారా, లేదా ఇక్క డ స్థలం కొని ఇల్లు నిర్మించుకున్నాడా అనే విషయంపై ఈ ఏడాది జూలైలో రెవెన్యూ శాఖ ఆధ్వ ర్యంలో 14 బృందాలు సర్వే నిర్వహించాయి. ఇక్కడ 2009 నాటికి మొత్తం 2 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా, ఏకంగా 567 మందికి చెందిన ఇళ్ల స్థలా లు చేతులు మారినట్టు తేలింది. దీంతో మండపేట రెవెన్యూ శాఖాధికారులు విక్రయాలు జరిపిన వారందరికీ ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతోపాటు స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారు, విక్రయాలు జరిపిన దళారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రిజిస్ట్రేషన్ కాకపోయినా...
వాస్తవానికి ప్రభుత్వం అందించే ఇంటి స్థలాలను విక్రయించే వీలులేదు. ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కుదరదు. అయితే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి కొందరు లేఖర్లు విక్రయం జరిగినట్టుగా దస్తావేజులు రాసేసి కొనుగోలుదారులకు ఇచ్చేశారు. ఇక్కడ ఇంటి స్థలం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఇక ఇక్కడ గృహరుణం పొందిన దానికి వేరే రేటు కూడా పెట్టి అధిక ధరలకు విక్రయించినట్టు కూడా విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం గొల్లపుంతకాలనీలో పట్టా పొంది ఇళ్లను నిర్మించుకున్న నిజమైన లబ్ధిదారులెంతమంది ఉన్నారు, ఇంటి స్థలం కొనుగోలుచేసి ఇంటి నిర్మించుకున్న వారెందరనే జాబితా సిద్ధం చేశారు. ఇప్ప టికే 567 మందికి రెవెన్యుశాఖ క్రయవిక్రయాలు చేతులు మారిన వారికి నోటీసులు జారీచేశారు. దాంతో గొల్లపుంతకాలనీ వాసులంతా స్థానిక తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీం తో రెవెన్యు అధికారులు అమ్మిన వ్యక్తి, కొనుగోలుచేసిన వ్యక్తుల నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకుంటున్నారు. ఇక ఇక్కడ గృహనిర్మాణం రుణం పొందిన ఇంటిని రూ.15 లక్షల వరకు విక్రయాలు సాగించేశారని కూడా విచారణలో వెల్లడైంది. ఇక్కడ కాలనీలో బినామీల పేరిట భారీగా ఇళ్లను నిర్మించి పట్టాలు చేతులు మార్చిన వారిలో స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బందువులు కూడా ఉన్నట్టు సమాచారం. దీనిపై మండపేట మండల తహశీల్దార్ పి.తేజేశ్వరరావును వివరణ కోరగా కాలనీలో సర్వే నిర్వహించగా 567మందికి చెందిన పట్టాలు క్రయవిక్రయాలు జరిగినట్టు వెల్లడైందని చెప్పారు. వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుంటున్నామని, అర్హతను బట్టి పాతపట్టాలను రద్దుచేసి కొత్త పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మొత్తం మీద గొల్లపుంతకాలనీలో ఇళ్ల స్థలాలు విక్రయాలు కొందరిలో గుబులు పుట్టిస్తుండగా, టిడ్కో గృహాల విషయంలోనూ లబ్ధిదారుల పత్రాలను తాకట్టు పెట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్న వారిపైనా దృష్టి పెట్టాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.