Share News

వైద్యం అందలేదు.. ప్రాణం ఆగలేదు!

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:42 AM

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): 24గంటలు వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేసి ఉండడంతో సకాలంలో

వైద్యం అందలేదు.. ప్రాణం ఆగలేదు!
పీహెచ్‌సీలో విచారణ జరుపుతున్న డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌

హోటల్‌ కార్మికుడికి గుండె నొప్పి

చేబ్రోలు పీహెచ్‌సీకి తాళాలు

108 వచ్చేసరికే మృతి

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): 24గంటలు వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేసి ఉండడంతో సకాలంలో వైద్యం అందక వ్యక్తి మ రణించిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మంగళవారం జరిగింది. దీంతో పీహెచ్‌సీ వైద్యుడిని సస్పెండ్‌ చేయగా, స్టాఫ్‌నర్సుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

చేబ్రోలు గ్రామంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న శరభవరం గ్రామానికి చెందిన ఇమ్మంది మాణిక్యం(56) తెల్లవారుజామున 2గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడం తో చేబ్రోలు పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అయితే పీహెచ్‌సీకి తాళాలు వేసి ఉండడంతో సిబ్బంది ఎవ్వరు లేరు. దీంతో 108 అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేయగా గంట తర్వాత వచ్చింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. 24గంటలు పనిచేయాల్సిన పీహెచ్‌సీ మూసి ఉండడంతోనే వైద్యం అందక మాణిక్యం మరణించినట్టు స్థానికులు తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిలో నలుగురిని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌ వేయడంతో పాటు వైద్యుల్లో ఒకరు సెలవులో ఉండడంతో పీహెచ్‌సీలో ఎవ రు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడినట్లు వా రు చెప్పారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఒకరు మరణించినట్లు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, టీడీపీ నాయకుడు బత్తుల శ్రీను ఆరోపించారు. మరోవైపు టీడీపీ, జనసేన నాయకులు పీహెచ్‌సీని పరిశీలించారు.

డీఎంహెచ్‌వో విచారణ

వైద్యం అందక వ్యక్తి మరణించిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయ అధికారులు ఆరా తీశారు. కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికా రి నరసింహనాయక్‌ చేబ్రోలు చేరుకుని విచారణ చేపట్టారు. ఆరునెలల నుంచి సిబ్బంది కొరతపై ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని గ్రామస్తులు ప్రశ్నించారు. పీహెచ్‌సీకి తాళాలు వేసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యాధికారి సస్పెన్షన్‌

పీహెచ్‌సీకి తాళాలు వేసి ఉండడం, వైద్యం అందక వ్యక్తి మరణించిన సంఘటనలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సాయిరతన్‌ను డ్యూటీ రోస్టర్‌ వేయడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందులకు గానూ సస్పెం డ్‌ చేసినట్టు డీఎంహెచ్‌వో మంగళవారం రాత్రి తెలిపారు. అదేవిధంగా స్టాఫ్‌నర్సుకు షో కాజ్‌ నోటీసు జారీ చేశామని తెలిపారు. ఇద్దరు వైద్యులకు గానూ ఒక వైద్యుడు డాక్టర్‌ వి.నిఖిల్‌ సెలవులో ఉన్నట్లు చెప్పారు. డిప్యూటేషన్‌పై ఉన్న స్టాఫ్‌నర్సును తక్షణం చేబ్రోలులో రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించేందుకు తాళ్లరేవు నుంచి డాక్టర్‌ ఎల్‌ సురేష్‌కుమార్‌ చేబ్రోలుకు డిప్యూటేషన్‌పై నియమించినట్లు చెప్పారు. కాగా సిబ్బంది కొరత, డిప్యూటేషన్లపై ఫిర్యాదు చేసినా ఆరునెలలుగా స్పందించని జిల్లా అధికారులు ఇప్పుడు సంఘటన వెలుగులోకి రాగానే చర్యలు తీసుకోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:42 AM