Share News

ఇంటి నుంచి బయలుదేరి.. గోదావరిలో శవంగా తేలి..

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:00 AM

అమలాపురం టౌన్‌/పి.గన్నవరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి రాజమహేంద్రవరం బయలు దేరిన ఓ వ్యక్తి కొన్నిరోజుల తర్వాత గోదావరిలో శవంగా తేలాడు. అయితే తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య, బంధువర్గీయులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీ

ఇంటి నుంచి బయలుదేరి..  గోదావరిలో శవంగా తేలి..
అమలాపురం పోలీసుస్టేషన్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న మృతుడి భార్య దేవి, శ్రీనివాస్‌ ఫైల్‌ఫొటో

మృతదేహంపై కత్తి గాయాలు

తన భర్త మృతికి ఐదుగురే కారణమని భార్య ఆరోపణ

అమలాపురం టౌన్‌/పి.గన్నవరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి రాజమహేంద్రవరం బయలు దేరిన ఓ వ్యక్తి కొన్నిరోజుల తర్వాత గోదావరిలో శవంగా తేలాడు. అయితే తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య, బంధువర్గీయులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. భర్త అదృశ్యం వెనుక ఐదుగురు వ్యక్తులు ఉన్నారని మీడియాకు చెప్పింది. ఈ సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే భర్త మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, పి.గన్నవరం ఎస్‌ఐ శివకృష్ణ తెలిపిన సమాచారం ఇలా ఉంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మం డ లం పేరూరు శివారు కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్‌ (37) ఈనెల 25న ఇంటి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్తున్నట్టు భార్య కంచిపల్లి దేవి తెలిపాడు. భర్త తిరిగి రాకపోవడంతో అన్నిచోట్లా గాలించి చివరకు ఈనెల 27న అమలాపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి సుజుకీ మోటారుసైకిల్‌పై బయలుదేరిన శ్రీనివాస్‌ భార్యతో సాయంత్రం వరకు 3సందర్భాల్లో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తరువాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లిలో గోదావరిలో బుధవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఆ సమాచారాన్ని ఎస్‌ఐ శివకృష్ణ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి చేతులపై ఎరుపురంగు తాడుతో పాటు కుడిచేతిపైన రుషి, దేవి, వినీత్‌ అని ఆంగ్ల అక్షరాలతో టాటూలు ఉన్నాయి. హీరో చిరంజీవితో పాటు ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ టాటూ కూడా మరో చేతిపై ఉంది. దాంతో సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు మృతుడి సోదరుడు అంజితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది శ్రీనివాస్‌ మృతదేహమే అని అంజి నిర్ధారించాడు. దాంతో ఈ కేసును అమలాపురం పోలీసుస్టేషన్‌కు బదలాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తలించారు. డీకంపోజ్‌ అయిన మృతదేహంపై పలుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అందజేశారు. తన భర్త మృతికి అమలాపురానికి చెందిన ప్రముఖ వ్యాపారి గంగుమళ్ల కాసుబాబు, శంకర్‌, భాస్కర్ల ప్రసాద్‌, సలాది అప్పన్న, రావులపాలెనికి చెందిన అనిల్‌ కారణమని మృతుడి భార్య దేవి ఆరోపించింది. పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత గానీ తాము ఏమీ చెప్పలేమని పట్టణ సీఐ వీరబాబు తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 12:00 AM