Share News

రుణం రణం

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:25 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ సామాజికవర్గాల వారికి రుణాల పంపిణీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

రుణం రణం

ప్రజాప్రతినిధులకు ‘సవాల్‌’గా మారిన కార్పొరేషన్‌ లబ్ధిదారుల ఎంపిక

ఉమ్మడి జిల్లాలో బీసీ, కాపు కార్పొరేషన్లకు 7,303 యూనిట్లు మంజూరు

8అందిన దరఖాస్తులు 1,11,038.. అర్హత సాధించిన వారు స్వల్పమే

లబ్ధిదారులకు షాక్‌ ఇస్తున్న బ్యాంకులు.. రుణాల కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి

8కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దరఖాస్తుదారులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ సామాజికవర్గాల వారికి రుణాల పంపిణీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లకంటే 15 రెట్లు అధికంగా దరఖాస్తులు పోటెత్తాయి. దాంతో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికార యంత్రాంగం అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు దరఖాస్తుదారుల ఒత్తిడితో అర్హులైన లబ్ధిదారులను సిఫారసు చేసేందుకు ఎమ్మెల్యేలు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో బీసీ, కాపు కార్పొరేషన్‌, ఈడబ్ల్యుఎస్‌ కింద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 7,303 యూనిట్లు మంజూరు కాగా వాటికోసం 15 రెట్లు అధికంగా అంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షా 11వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిని ఆయా పట్టణాలు, కార్పొరేషన్లు, మండలాల వారీగా ఇటీవల అధికారులు ఇంటర్వ్యూలకు పిలిచి రుణాలకు అర్హులైన లబ్ధిదారుల అన్వేషణలో పడ్డారు. ఈ దశలోనే రాజకీయ ఒత్తిళ్లతో రుణాలు తమకే మంజూరు చేయాలంటూ పట్టణ, మండల స్థాయి ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, మరికొందరైతే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సుల పేరుతో రుణ మంజూరు కోసం పైరవీలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం కూటమి ప్రజాప్రతినిధులకు ప్రాణసంకటంగా మారింది. ఎవరిని నొప్పించినా రానున్న రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.

దరఖాస్తుదారులు 15 రెట్లు అధికం..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 7,303 యూనిట్లకుగాను మొత్తం 1,11,038 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 63,412 మంది. కాపు కార్పొరేషన్ల ద్వారా 45,290, ఈడబ్ల్యుఎస్‌ కింద 2336 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వాటన్నింటినీ ఆయా కార్పొరేషన్‌కు చెందిన అధికారులు విశ్లేషించి అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాటిలో భాగంగా బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం కాకినాడ జిల్లాలో 1,895 యూనిట్లకోసం 31,856 మంది దరఖాస్తు చేశారు. వారిలో ఆయా మండలాలకు చెందిన అధికారులు 777 మందిని ఎంపిక చేయగా 245 మందికి రుణాలు ఇచ్చేందుకు ప్రస్తుతం బ్యాంకర్లు అంగీకరించారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్‌ కోసం 775 యూనిట్ల కోసం 21,455 మంది దరఖాస్తు చేయగా వారిలో 390 మందిని అధికారులు ఎంపిక చేశారు. 106 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. అదేవిధంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బీసీ కార్పొరేషన్‌కు 1,366 రుణాలు లక్ష్యం కాగా 15,148 మంది దరఖాస్తు చేశారు. వారిలో మండలస్థాయిలో అధికారులు 399 మందిని ఎంపిక చేయగా కేవలం 22 మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అదేవిధంగా కాపు కార్పొరేషన్‌ ద్వారా 756 యూనిట్ల లక్ష్యం కాగా 15,643 మంది దరఖాస్తు చేశారు. మండలస్థాయి అధికారులు ఇప్పటివరకు 343 మందిని ఎంపిక చేశారు. కేవలం 16 మందికే బ్యాంకులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. తూర్పుగోదావరికి సంబంధించి బీసీ కార్పొరేషన్‌ ద్వారా 1,341 యూనిట్లు లక్ష్యంగా కాగా ఇందుకోసం 16,408 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో అధికారులు 243 మందిని ఎంపిక చేయగా బ్యాంకులు మాత్రం 23 మంది లబ్ధిదారులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కాపు కార్పొరేషన్‌ ద్వారా 758 యూనిట్ల లక్ష్యం కాగా 8,192 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 174 మందిని అధికారులు ఎంపిక చేయగా కేవలం తొమ్మిది మందికి మాత్రమే ఇప్పటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి.

ఎమ్మెల్యేలకు శిరోభారం..

బీసీ, కాపు కార్పొరేషన్‌, ఈడబ్ల్యుఎస్‌ రుణా లకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్ర ఒత్తిడి ప్రారంభమైంది. తమ వారికే రుణాలు మంజూరుచేసేలా సిఫార్సులు చేయాలంటూ లబ్ధిదారులను వెంటేసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, మేము పెట్టుకున్న లోన్లు మంజూరు చేయకపోతే గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి వస్తుందంటూ కొందరు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. అయితే రుణాల మంజూరులో గానీ, లబ్ధిదారుల ఎంపికలో గానీ తమ ప్రమేయం ఏమీ ఉండదని, అభ్యర్థుల అర్హతలు, వారు పెట్టుకునే వ్యాపారాలకు సంబంధించి యూనిట్లు, బ్యాంకుల్లో వారికి ఉన్న సిబిల్‌ స్కోర్‌ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని కార్పొరేషన్‌ అధికారులు రుణాలు మంజూరు చేస్తారని ప్రజాప్రతినిధులు నచ్చచెబుతున్నారు. ఇక దరఖాస్తుల సమయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఇప్పుడు వార్డుకు ఒకటి, గ్రామానికి ఒకటి లోన్లు ఇస్తే ఎలాగంటూ నేతలు తలలుపట్టుకుంటున్నారు.

బీసీ రుణాలు.. సబ్సిడీలు..

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

బీసీలకు ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంక్‌ రుణా లతో ఈ సహాయం అందుతుంది. యూనిట్‌ విలువ రూ.2 లక్షల వరకూ ఉంటే సబ్సిడీ 50 శాతం లేదా, రూ.75 వేలు మించకుండా ఉం టుంది. యూనిట్‌ కాస్ట్‌ రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటే 50 శాతం లేదా, రూ. 1,25,000వరకూ సబ్సిడీ ఉంటుంది. రూ.3 లక్షల నుంచి 5లక్షల వరకూ యూనిట్‌ విలు వ ఉంటే, సబ్సిడీ రూ.2 లక్షల వరకూ ఉం టుంది. జనరిక్‌ మెడికల్‌ షాపులకు కూడా రు ణాలు ఇస్తున్నారు. రూ.8 లక్షల విలువ ఉంటే రూ.4 లక్షలు సబ్సిడీ లభిస్తోంది. మేదర, కుమ్మర శాలివాహన వారికి బుట్టల అల్లకం, కుండల తయారీకి రుణమిస్తారు. యూనిట్‌ కాస్ట్‌ రూ.3 లక్షలుంటే రూ.1.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎం టర్‌ ప్రైజస్‌ పథకం కింద రూ.25 లక్షల వర కూ యూనిట్‌ విలువ ఉంటుంది. ఇందులో రూ.10 లక్షలు సబ్సిడీ, రూ.10 లక్షలు బ్యాంక్‌ రుణం, రూ.5 లక్షలు లబ్ధిదారుడి వాటా.

Updated Date - Apr 10 , 2025 | 01:25 AM