Share News

ఆస్తుల పరినక్షణ!

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:07 AM

కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ఒక సర్వే చేస్తోంది.. ఈ సర్వే ఎంతో లాభదాయకం. యాజమాన్య వివాదాలు, దీర్ఘకాలికంగా చట్టపరమైన కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

ఆస్తుల పరినక్షణ!
సర్వే చేస్తున్న సిబ్బంది

భూ వివాదాల పరిష్కారమే లక్ష్యం

రాష్ట్రంలో 10 పట్టణాల్లో అమలు

పైలెట్‌ ప్రాజెక్టుకు కాకినాడ ఎంపిక

స్థలాలకు ఖచ్చితమైన రికార్డులు

డిజిటలైజేషన్‌ చేసేలా ఏర్పాట్లు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ఒక సర్వే చేస్తోంది.. ఈ సర్వే ఎంతో లాభదాయకం. యాజమాన్య వివాదాలు, దీర్ఘకాలికంగా చట్టపరమైన కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. రోడ్లు, మురుగు కాలువలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల అమలుకు అడ్డంకులు ఉండవు. ఆస్తులు, భూరికార్డులు పారదర్శకంగా డిజిటలైజ్డ్‌ విధానంలో అందుబాటులో ఉంచుతారు. నగరపాలక సంస్థ, కేంద్ర, ప్రభుత్వాల ఆస్తుల గుర్తింపునకు అవకాశం ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో భూములు, స్థలాలపై కచ్చితమైన రికార్డుల తయారీ, ఉన్న రికార్డుల నవీకరణ ద్వారా వివాదాలకు పరిష్కారం చూ పాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు జాతీయ జియో స్పేషియల్‌ పరిజ్ఞానం ఆధారంగా పట్టణ ఆవాసాల్లో భూ సర్వే (నక్ష) పేరుతో ఈ ఏడాది సర్వే చేపట్టింది. పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు దేశవ్యాప్తంగా 152 పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేసి రూ.194 కోట్లు కేటాయించింది. మన రాష్ట్రంలో పది పుర, నగరపాలక సంస్థలను కేంద్రం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. వాటిలో ఒంగోలు, అనం తపురం,గుంటూరు,నెల్లూరు, కర్నూలు, ఏలూ రు, తిరుపతి, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు మన జిల్లాలోని కాకినాడ నగరపాలక సంస్థను తొలివిడతగా కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో 524 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే చేసి 9.50 లక్షల ఆస్తులను మ్యాపింగ్‌ చేసి డిజిటలైజ్‌ చేయనున్నారు. 2026 మార్చి నెలాఖరులోపు ఈ ప్రా జెక్టు పూర్తి చేసి ప్రజలకు కార్డులు అందజేయనున్నారు. రెండో దశలో మరికొన్ని పట్టణాలు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాకినాడలో ముందస్తు సర్వే...

కాకినాడ నగరంలో ప్రస్తుతం ముందస్తు ఏరియల్‌ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా డిపార్ట్‌మెంట్‌, ఎల్‌ టీఐ మైండ్‌ట్రీ అనే ఓ ప్రైవేటు సంస్థ ఈ సర్వే చేపట్టనుంది. డ్రోన్స్‌ ఎగరవేత, జీపీఎస్‌ కోఆర్డినేషన్‌కు సెంట్రల్‌ పాయింట్లు మార్కింగ్‌ చేసుకున్నారు. కాకినాడలో 32 కిలోమీటర్ల మేర 20 మార్కింగ్‌ పాయింట్లు వేశారు. ఈ ప్రాంతాల నుంచే డ్రోన్లు ఎగరవేసి బౌండరీల ఛాయాచిత్రాలను తీసుకుంటారు.

మూడు విడతల్లో సర్వే

ఈ సర్వే మూడు విడతల్లో చేపడతారు. ప్రస్తుతం ఆ సర్వేకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం మైసూరులో జరుగుతోంది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పది నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్లకు వారం రోజులపాటు శిక్షణ అం దిస్తున్నారు. ఈ నక్ష సర్వే మూడు దశల్లో ముగి సాక డిజిటలైజ్డ్‌ కార్డుతో కూడిన ఆస్తి ధ్రువపత్రం అందజేస్తారు. ఏ విధమైన సమస్య లు లేనివాటిని తొలుత సర్వే చేస్తారు. ప్రజలు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు, కచ్చితమైన వివరాలు అందించాలి. - కృష్ణారావు, డీసీపీ, కాకినాడ

Updated Date - Jun 07 , 2025 | 01:07 AM