Share News

ఆర్టీ‘షీ’ బస్‌!

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:05 AM

మహిళలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, మహిళా సాధికారత కోసమే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

ఆర్టీ‘షీ’ బస్‌!
మహిళల ఉచిత బస్‌ పథకం ప్రారంభించి అదే బస్‌లో ప్రయాణిస్తున్న మంత్రి దుర్గేష్‌ ఇతర నాయకులు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, మహిళా సాధికారత కోసమే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం స్త్రీ శక్తి - మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మంత్రి దుర్గేష్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులతో కలిసి మంత్రి దుర్గేష్‌ కొంతదూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.ఈ మేరకు టిక్కెట్‌ కూడా కొనుగోలు చేశారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కూటమి సంక్షేమంతో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదని, రాష్ట్రంలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాధికారి వైఎస్‌ఎన్‌ మూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, డీఎం మాధవ్‌ పాల్గొన్నారు.

మహిళలకు ప్రయోజనం

ఉచిత బస్‌ పథకం మాలాంటి దిగువ మధ్యతరగతి మహిళలకు ఎంతో ఉపయోగకరం. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారికి మరిం త ప్రయోజనం.ఉచిత బస్సు వల్ల పుణ్యక్షేత్రాలకు, పండుగలు, ఇతర సమయాల్లో రాకపోకల ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ ఆదాయంలో ఎంతో కొంత మిగులుతుంది.

Updated Date - Aug 16 , 2025 | 01:05 AM