Share News

కొవ్వూరు స్టేషన్‌కు అమృత్‌ భారత్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:29 AM

అమృత్‌ భారత్‌లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

కొవ్వూరు స్టేషన్‌కు అమృత్‌ భారత్‌
కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపుతున్న ఎంపీ, ఎమ్మెల్యే..

మచిలీపట్నం,తిరుపతి రైళ్లకు హాల్ట్‌

పచ్చజెండా ఊపిన పురందేశ్వరి

మిగిలిన రైళ్లకు హాల్ట్‌ కల్పిస్తాం

కొవ్వూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : అమృత్‌ భారత్‌లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం - కడప ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లకు అప్‌, డౌన్‌ హాల్ట్‌ కల్పించారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నం- కడప ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కరోనా సమయంలో కొవ్వూరులో ఆగే రైళ్లను రద్దు చేశారన్నారు. కొవ్వూరు పరిసర ప్రాంతాల ప్రజలు కోరడంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విన్‌ వైష్టవ్‌ను కలిసి విన్నవించినట్టు పేర్కొ న్నారు. ఈ మేరకు కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లకు హాల్ట్‌ కల్పించారన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన రైళ్ల హాల్ట్‌కు కృషి చేస్తానన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ కేంద్రం,రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు సుపరిపాలన అందజేస్తుందన్నారు. జిల్లాలో ట్రాన్స్‌ఫోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పూర్తి శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను ఎంపీ పురందేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా నాలుగు రైళ్లు నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దానిలో భాగంగా ముందుగా తిరుమల, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమణి రామకృష్ణారావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్‌ నాదెళ్ల శ్రీరామ్‌, ఎంపీపీ కాకర్ల నారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పరిమి రాధ, కోడూరి లక్ష్మీనారాయణ, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:29 AM