మన కోటావోడు..ఇక లేడా!
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:02 AM
క్రూరమైన విలనిజమైనా, కడుపుబ్బ నవ్విం చే హాస్యరసమైనా, కన్నీళ్లు పెట్టించే సెం టిమెంటు సీనైనా.. ఏదైనా అవలీలగా చేసేసి.. సీన్‌ను పండించగల అతి అరుదైన ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు.. గోదావరి జిల్లా వాళ్లకు మాత్రం ఎప్పటికీ కోటావోడు..
తొలి సినిమా ప్రాణం ఖరీదు
కోనసీమలోనే చిత్రీకరణ
కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు
అమలాపురం రూరల్, జూలై 13(ఆంధ్రజ్యోతి): క్రూరమైన విలనిజమైనా, కడుపుబ్బ నవ్విం చే హాస్యరసమైనా, కన్నీళ్లు పెట్టించే సెం టిమెంటు సీనైనా.. ఏదైనా అవలీలగా చేసేసి.. సీన్‌ను పండించగల అతి అరుదైన ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు.. గోదావరి జిల్లా వాళ్లకు మాత్రం ఎప్పటికీ కోటావోడు..హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు తన సహజశైలి నటనతో, వాక్ చాతుర్యంతో చలనచిత్రసీమలో ప్రత్యేక స్థానం సాధించారు. సహజ నటుడిగా పేరొందిన కోట శ్రీనివాసరావుకు కోనసీమతో ఎంతో అనుబంధం ఉంది. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంలో తొలిసారిగా కోట శ్రీనివాసరావు నటించారు.ఆ చిత్రం షూటింగ్ సఖినేటిపల్లి మండలం గుడిమూల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సినిమాల్లో నటిస్తూనే బ్యాంకు ఉద్యోగిగా కొనసాగారు. 1987లో కోటశ్రీనివాసరావు సమనసలోని స్టేట్ బ్యాంకులో పని చేశారు. నాటి గ్రామ సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్‌ను సందర్శించారు. టాకీస్ వద్ద శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. చిత్రమేమిటంటే ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్‌లో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం ఆడుతోంది. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు నటించారు. కోట శ్రీనివాసరావు మృతిచెందారన్న సమాచారం ఎంతో కలచివేసిందని నాటి సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు అన్నారు.
ఎన్నో మరుపురాని పాత్రలు
తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంటలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే విలక్షణమైన పాత్రల్లో నటించారు. పిసినారి తండ్రిగా ఆయన చేసిన పాత్ర ఎంతో మెప్పించింది. గోదావరి జిల్లాలోనే ఈ చిత్ర ం షూటింగ్ జరగ్గా ఈ పాత్రలో కోడిని కట్టేసి సగం పగిలిన కళ్ల అద్దాలతో ఉత్తి అన్నం తింటూ చికెన్ తిన్నట్టుగా ఫీలయ్యే సీన్‌ను ఇప్పటికీ మీమ్స్‌లో వైరల్ చేస్తుంటారు. కోటా నటించిన మరో మరుపురాని చిత్రం వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్.. ఇందులో ఏళ్ల పాపారావుగా ఆయన పండించిన హాస్యం అద్భుతం.. రాజమహేంద్రవం, కోనసీమల్లో ఈ చిత్ర షూటింగ్ జరగ్గా.. గోదావరి యాసలో కోటా పలికిన డైలాగులు మరో స్థాయిలో ఉంటాయి. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ చిత్రంలో గుర్నాథం పాత్ర కోటకు మరో ఆణి ముత్యం లాంటిది.తెలుగు భాషను ప్రేమించే జమిందారుగా..ఆయన గ్రాంధిక భాషలో మా ట్లాడుతూ పండించిన హాస్యం భలే ఉంటుంది. ‘ఉత్తరపురుషుడు’, ‘నిశివర్ణోష్ణోదకము’ ‘ఉష్ణగ్రాహకఘటం’, ‘అశ్వము అధిరోహించుట’, ‘చతుష్చక్ర శకట నివాస స్థానము’ అనే పదాలు.. ఆయన నోటి వెంట ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాయి. తర్వాత కోనసీమ పరిసరాల్లో తీసిన ఖైదీనెంబరు 786లో ఆయన సూర్యచంద్రరావు పాత్రలో మెప్పించారు. యమలీలలో ఇన్‌స్పెక్టర్ రంజిత్, హలోబ్రదర్‌లో తాడిమట్టయ్య,వినోదంలో బంగారం సహా ఇంకా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1992లో విడుదలైన భలే ఖైదీలు చిత్రం కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. కీలక సన్నివేశాల చిత్రీకరణలో కాకినాడలోని ప్రైవేటు బస్సులో షూటింగ్ నిర్వహించారు. ఈ చిత్రంలో అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామప్రసాద్ ఆర్టీసీ కండక్టర్‌గా నటించారు. కోట శ్రీనివాసరావు మృతిచెందారన్న వార్త తనను ఎంతగానో కలచివేసిందని శ్రీరామప్రసాద్ నాటి షూటింగ్ సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఇక అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రముఖ రచయిత దువ్వూరి సుబ్రహ్మణ్యశర్మ పలు పర్యాయాలు కోట శ్రీనివాసరావును కలి శారు.ఆయనతో అనుబంధాన్ని సుబ్రహ్మణ్యశర్మ వివరించారు. కోట శ్రీనివాసరావు మృతికి ఎంపీ పురం దేశ్వరి సంతాపం తెలిపారు.
‘కోటా’భిమానులు..
దేవీపట్నం/రాజమహేంద్రవరం కల్చరల్/ నిడదవోలు, జూలై 13(ఆంధ్రజ్యోతి): ముద్దుల ప్రియుడు చిత్రం దేవీపట్నం ఉమాచోడేశ్వరస్వామి ఆలయంలో షూటింగ్ చేశారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు కొబ్బరికాయల సుబ్బయ్య పాత్రలో నటించారు. సినీనటుడు కోట శ్రీనివాసరావుతో తమకు గల అనుబంధాన్ని రాజమహేంద్రవరానికి చెందిన నటుడు, గాయకుడు జిత్‌మోహన్ మిత్ర పంచుకున్నారు. సుమారు 50 సినిమాల్లో ఆయనతో కలిసి నటించినట్టు చెప్పారు. కోట శ్రీనివాసరావుతో తాను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామం, రాజమహేంద్రవరం సిటీ పరిధిలోని మోరంపూడిలో జరిగిన సినిమా షూటింగుల్లో పాల్గొన్నట్టు తెలిపారు. నిడదవోలు పరిసర ప్రాంతాల్లో 1996 సంవ త్సరం తాళి సినిమా చిత్రీకరణ సమయంలో సినీనటుడు కోట శ్రీనివాసరావు నిడదవోలు పట్టణంలోని సుంకవల్లి గణేశ్వరరావు నివా సంలో విడిది చేశారు. ఆ సమయంలో గణే శ్వరరావు కుమారుడు సుంకవల్లి శ్రీధర్ వారి తో ఫొటో దిగారు. ఆయన మృతితో గోదావరి జిల్లాల్లో అభిమానులు జ్ఞాపకాల నెమరు వేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు.
అనపర్తిలో ‘కోట’ ఎన్నికల ప్రచారం
అనపర్తి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కోట శ్రీనివాసరావు మరణం తీరని లోటని బీజేపీ నాయకుడు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి అ న్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు అనపర్తి వచ్చిన ఆయనతో ముచ్చటించే అవకాశం కలిగిందన్నారు. అనపర్తి జీబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన బి.రత్నారెడ్డి..1966లో ఏలూరులోని సీఆర్‌రెడ్డి కళాశాలలో కోట శ్రీనివాసరావుతో కలిసి డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.