Share News

శాకంబరిగా కోటసత్తెమ్మ

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:52 AM

ఆషాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ శాకంబరిగా దర్శనమిచ్చారు.

శాకంబరిగా కోటసత్తెమ్మ

నిడదవోలు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ఆషాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ శాకంబరిగా దర్శనమిచ్చారు. కోట సత్తెమ్మ తల్లి హోల్‌సేల్‌ కూరగాయల వర్తక సంఘం వారు రెండు టన్నులకు పైగా వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో శాకంబరి అలంకరణ చేశారు. ఆలయ ఆవరణ అంతా ఆకుకూరలు, కూరగాయలు, వేపాకు దండలతో పచ్చగా కనిపించేలా అలంకరించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు.ఆదివారం అమ్మవారికి రూ.2,61,460ల ఆదాయం లభించినట్టు దేవ స్థానం ఈవో తెలిపారు.

ఆలయాన్ని ఆధునీకరిస్తాం : దుర్గేష్‌

ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ అంతర్భాగంగా శక్తి స్వరూపిణి కోట సత్తెమ్మ దేవస్థానం అభివృద్ధికి కృషి చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. అమ్మవారిని మంత్రి దుర్గేష్‌ దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కోట సత్తెమ్మ దర్శనానికి భక్తులు రావడం గమనించామని .. ఆలయం అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించిందన్నారు.ఆలయాన్ని ఆధునీకరిస్తామన్నారు. ఆయ న వెంట ఆలయ ఈవో వి.హరిసూర్య ప్రకాష్‌, ఆలయ చైర్మన్‌ దేవులపల్లి రవి శంకర్‌, మునిసిపల్‌ కౌన్సిలర్లు పువ్వల రతీ దేవి, గోపిరెడ్డి శ్రీనివాస్‌, చిలకల శారదాదేవి, కూటమి నాయకులు ఉన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:52 AM