తిలకించారు.. పులకించారు!
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:33 AM
పవిత్రకార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి హంస వాహనంపై కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవుడి కోనేటిలో విహరించారు.
కోరుకొండ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : పవిత్రకార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి హంస వాహనంపై కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవుడి కోనేటిలో విహరించారు. అంతకు ముందు స్వామివారిని ప్రత్యేక పల్లకీలో ఆశీనులు గావించి దిగువ దేవస్థానం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కిలోమీటరు దూరంలో ఉన్న దేవుడి కోనేరు వద్దకు చేర్చారు. అక్కడ దేవుడి కోనేటిలో సిద్ధంగా ఉంచిన హంస వాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఆశీనులు గావించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పరాసర రంగరాజభట్టర్ స్వామి ఆధ్వర్యంలో పెద్దింటి, పెరవలి, పెదపాటి అనువంశిక అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మినరసింహస్వామి హంస వాహనం దేవుడి కోనేటిలో మూడు సార్లు విహరించారు. కన్నుల పండువగా జరిగిన ఈ తెప్పోత్సవాన్ని కోరుకొండ పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు తిలకించి.. పులకించారు.తెప్పోత్సవం అనంతరం ప్రత్యే క వేదికపై శ్రీ లక్ష్మినరసింహస్వామిని ఆశీనులను గావించి సేవాకాలం నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, రాజానగరం ఏఎంసీ చైర్మన్ తనకాల వెంకటరమణ, నాగేశ్వరరావు దంపతులు, కోరుకొండ సర్పంచ్ లక్ష్మిసరోజవీరగణేష్ దంపతులు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో అన్నవరందేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.