Share News

పురోగతి ఏది?

ABN , Publish Date - May 15 , 2025 | 01:13 AM

కోనసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడంలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రహణం పట్టిన ఈ రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అడుగు ముందుకు పడడంలేదు. దీంతో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనులపై ప్రజల్లో ఆందోళన మొదలైంది.

పురోగతి ఏది?
వైనతేయ నదిపై పాశర్లపూడి-బోడసకుర్రు మధ్య నిర్మాణ దశలో ఉన్న పిల్లర్లు

  • ముందుకు కదలని కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైన్‌ పనులు

  • రెండున్నర దశాబ్దాల క్రితం పడిన పునాదిరాయి

  • మూడు గోదావరి నదుల్లో మొండి గోడల్లా మిగిలిన పిల్లర్లు

  • గడ్డర్లు, ట్రాక్‌ల నిర్మాణంలో కానరాని ప్రగతి

  • బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా ముందుకు సాగని పనులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడంలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రహణం పట్టిన ఈ రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అడుగు ముందుకు పడడంలేదు. దీంతో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనులపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. కోనసీమ జిల్లాలోని మూడు ప్రధానమైన గోదావరి నదీపాయలపై వారధులకు సంబంధించి పియర్స్‌(పిల్లర్స్‌) నిర్మాణాలు పూర్తయినా గడ్డర్ల ఏర్పాటులో మాత్రం కొన్నేళ్లుగా కాంట్రాక్టు సంస్థ మౌనం వహిస్తోంది. టెండర్లు పిలిచాం. త్వరలో గడ్డర్లు నిర్మిస్తామని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటికీ అతీగతీ లేదు. కేంద్రంలో టీడీపీ పార్లమెంటు విప్‌, అమలాపురం ఎంపీ హరీష్‌మాధుర్‌ కోనసీమ ప్రజలకు రైల్వేలైన్‌ కూత వినిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆశించిన మేర స్పందన లేకపోవడంతో ఈ రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి.

రెండున్నర దశాబ్ధాల క్రితం శంకుస్థాపన

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం తొలగించబడ్డ కాకినాడ-కోటిపల్లి రైల్వేలైన్‌తోపాటు కోటిపల్లినుంచి నర్సాపురం వరకు రైల్వేలైన్‌ నిర్మాణం కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయి కొంతకాలంపాటు ట్రైన్‌ నడిపారు. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఆ రైలు కాస్తా ప్రయాణికుల కోసం రైల్‌బస్‌గా నడిపారు. అది ప్రస్తుతం మరుగున పడిపోయింది. ఇక కోటిపల్లి-నర్సాపురం రైల్వే నిర్మాణం కోసం 2000, నవంబరు 16న అప్పటి కేంద్ర రైల్వేమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌ హోదాలో జీఎంసీ బాలయోగి సమక్షంలో శంకుస్థాపన జరిగింది. మొత్తం 102.500 కిలోమీటర్ల పొడవైన కాకినాడ-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా కాకినాడ-కోటిపల్లి వరకు 45.30 కిలోమీటర్ల మేర ట్రాక్‌ పూర్తయింది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57.207 కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వేట్రాక్‌ నిర్మాణంతోపాటు గౌతమీ, వశిష్ఠ, వైనతేయ నదులపై వారథులు నిర్మిం చడానికి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. అప్పట్లో రూ.2వేల కోట్ల పైబడిన నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.3వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. వశిష్ఠ,వైనతేయ, గౌతమీ నదీపాయ లపై యుద్ధ ప్రాతిపదికనే వారథుల నిర్మాణానికి అప్పట్లో బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పిల్లర్లు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అబెక్ట్‌మెంట్‌ వాల్స్‌ కూడా సిద్ధమయ్యాయి. రెండు మూడు ప్రాంతాల్లో సాంకేతిక సమస్యల కారణంగా పిల్లర్స్‌ నిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది.

గడ్డర్లు నిర్మించేది ఎప్పుడు..

మూడు నదీపాయలపై నిర్మించిన పిల్లర్లపై గడ్డర్లు నిర్మిస్తే రైల్వేట్రాక్‌ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా గడ్డర్ల నిర్మాణ ప్రగతిపై స్పష్టమైన ప్రకటన అయితే వెలువడలేదు. వారథులకు పిల్లర్లు నియమించినా గడ్డర్లు నిర్మించి ట్రాక్‌ ఏర్పాటు చేస్తే మిగిలిన ట్రాక్‌ నిర్మాణ పనులు, ఇతర కల్వర్టర్లు, నిర్మాణాలు వంటివి చేపట్టే అవకాశం ఉంది. కాంట్రాక్టు సంస్థ త్వరలోనే ఈ పనులు చేపడుతుందని కొన్నేళ్లనుంచి ప్రచారం జరుగుతున్నా వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు భూసేకరణ అంశం కూడా అవరోధంగా మారింది. కోటిపల్లి నుంచి శానపల్లిలంక వరకు గౌతమీ నదిపై వారథి పిల్లర్లు నియమించించారు. గడ్డర్లు వేయకపోవడంతో నదిలో నిర్మించిన 41 పిల్లర్లు మొండి గోడల్లా దర్శనమిస్తున్నాయి. శానపల్లిలంక నుంచి అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లి వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్‌ నిర్మాణానికి అప్పట్లోనే భూసేకరణ జరిగింది. ఇప్పుడు తాజా పరిణామాలతో రైతులు భూమిని అప్పగించేందుకు అడ్డంకులు సృష్టిస్తుండడంతో వాటిని క్లియర్‌ చేసేందుకు ఎంపీ హరీష్‌మాధుర్‌ కృషి చేస్తున్నారు. కానీ ఈ పనులకు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందా లేదా అనే సందిగ్ధత జిల్లా వాసుల్లో నెలకొంది.

బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా ప్రగతి శూన్యం

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణంకోసం కేంద్రం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ప్రతిఏటా రూ.వంద కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులను ఇక్కడ నిర్మాణ పనులకు వెచ్చించకపోవడంతో బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఇతర ప్రాంతాల రైల్వేపనులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా రూ.160కోట్లు పైబడి బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్టు ప్రచారం జరిగినా పనుల్లో పురోగతి లేదు. అయినవిల్లి మండలం శానపల్లిలంక నుంచి నర్సాపురం వరకు భూసేకరణ అవరోధంగా మారుతోంది. ఇష్టానుసారం రైల్వే ట్రాక్‌ను వివిధ ప్రాంతాల గుండా నిర్మిస్తున్నామనే ముందస్తు ప్రచారంతో ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో చాలాచోట్ల భూసేకరణకు బ్రేక్‌ పడుతోంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఈ రెండు నెలల్లో గడ్డర్ల నిర్మాణం పూర్తియితే ట్రాక్‌ను సునాయాసంగా నిర్మించుకోవచ్చునని ప్రజలు పేర్కొంటున్నారు. రైల్వేలైన్‌ కొత్త ఎలైన్‌మెంట్‌ పేరుతో వెలువడుతున్న ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

రైల్వే ప్రాజెక్టు పూర్తిచేయడమే నా లక్ష్యం

-గంటి హరీష్‌మాధుర్‌, ఎంపీ, అమలాపురం

మరో నాలుగేళ్లలో ఈ రైల్వే ప్రాజెక్టును పూర్తిచేసి కోనసీమ ప్రజలకు అంకితం చేయాలన్నదే నా లక్ష్యం. మా నాన్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత బాలయోగి చిరకాల వాంచగా మిగిలిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాను. ఇప్పటికే కేంద్ర రైల్వేమంత్రిని పలు పర్యాయాలు కలిసి రైల్వేలైన్‌ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నాను.

Updated Date - May 15 , 2025 | 01:13 AM