కోనసీమ మళ్లీ...ముక్కలు కానుందా?
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:45 AM
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ బుధవారం అమరావతిలో జరగనున్న నేపథ్యంలో జిల్లాల్లోని మండలాలు, నియోజకవర్గాలు, సరిహద్దుల మార్పులపై ఆసక్తికరమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ బుధవారం అమరావతిలో జరగనున్న నేపథ్యంలో జిల్లాల్లోని మండలాలు, నియోజకవర్గాలు, సరిహద్దుల మార్పులపై ఆసక్తికరమైన చర్చలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో రెండు ప్రధాన నియోజకవర్గాలను పక్కపక్క జిల్లాల్లో విలీనం చేయాలంటూ ఇప్పటికే అఖిలపక్ష సమావేశాల్లో చర్చించి తీర్మానాలు చేయడంతోపాటు ఉద్యమ కార్యాచరణలకు సిద్ధమవుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యమైతే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై 13వ తేదీన అమరావతిలో జరిగే జీవోఎం భేటీ ప్రజల నుంచి వినతులకు ఆహ్వానం పలికేందుకు వీలుగా కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్‌శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో వివిధ శాఖలకు ప్రాతినిథ్యం వహించే మంత్రులతో ప్రభుత్వం నియమించిన ఉపసంఘం తొలి భేటీ జరగనుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైసీపీ నేతల సిఫార్సుల మేరకు జిల్లాల పునర్విభజన కార్యక్రమం చేపట్టినప్పటికీ నియమ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రాజకీయ సిఫార్సులకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిని జిల్లాగా ప్రకటిస్తామని అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఆచరణలో అమలు కాకుండా నియోజకవర్గ పరిధిలోని మండలాలను ఇతర జిల్లాల సరిహద్దుల్లో విలీనం చేయడంతో అప్పుడు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అమలాపురం ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పట్టణాలు, ఒక నగర పంచాయతీతోపాటు తొలుత 24 మండలాలతో కోనసీమ జిల్లాను విభజించారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం స్థానిక పాలకుల సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండే తాళ్లరేవులో కాకినాడ జిల్లా పరిధిలో విలీనం చేసింది. అలాగే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండే కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలోను విలీనం చేసింది. ఈ పరిణామాలతో లోక్‌సభ పరిధిలో జిల్లా ఏర్పాటు అనే నిబంధనలకు అప్పటి ప్రభుత్వంలోనే తిలోదకాలు ఇచ్చినట్టయింది. దాంతో 22 మండలాలు, ఐదు నియోజకవర్గాలు, మూడు పట్టణాలు, ఒక నగర పంచాయతీతో కోనసీమ జిల్లా ఆవిర్భవించింది. అయితే ఈ జిల్లా పరిధిలో ఉండే రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలోను, మరో ని యోజకవర్గాన్ని కాకినాడ జిల్లా పరిధిలో విలీనం చేయాలనే డిమాండ్ ప్రస్తుత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు నేపథ్యంలో ఊపందుకుంది. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరిలో ఖచ్చితంగా విలీనం చేయాలంటూ ప్రస్తుత సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిల పక్ష కమిటీని ఏర్పాటుచేసి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామగ్రామాన మండపేటను తూర్పులో విలీనం చేయాలంటూ గ్రామసభల తీర్మానాలు చేసే పనిలో ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. ఇక రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దాంతో కోనసీమ జిల్లా పరిస్థితి అయోమయంగా మారనుంది. అప్పుడు ఐదు నియోజకవర్గాలతో జిల్లాను కుదిస్తారా, మొత్తం ఉమ్మడి జిల్లా పరిధిలో ఏజెన్సీతో సహా కలిపి జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తారా అనే దానిపై చర్చలు తీవ్రమయ్యాయి.