ఉధృతంగా వరద
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:24 AM
గోదావరికి వరద పోటెత్తింది. దీంతో జిల్లాలోని గౌతమీ, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు బుధవారం పొంగి ప్రవహిస్తున్నాయి. సమీపంలోని నదీపరివాహక లంక గ్రామాలన్నీ క్రమంగా జలదిగ్బంధానికి గురవుతున్నాయి.
పెరుగుతున్న గోదావరి
మునుగుతున్న లంక గ్రామాలు
అన్నంపల్లిలో ఫ్లడ్‌స్టోరేజ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
పలు రేవుల్లో ప్రయాణాలు బంద్
గోదావరికి వరద పోటెత్తింది. దీంతో జిల్లాలోని గౌతమీ, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు బుధవారం పొంగి ప్రవహిస్తున్నాయి. సమీపంలోని నదీపరివాహక లంక గ్రామాలన్నీ క్రమంగా జలదిగ్బంధానికి గురవుతున్నాయి.
అమలాపురం,ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): ముం బైలో భారీవర్షాల నేపథ్యంలో భద్రాచలానికి వరద పోటెత్తింది. బుధవారంరాత్రికి రెండోప్రమా ద హెచ్చరిక స్థాయికి భద్రాచలంవద్ద వరద నీరు చేరుకోవడంతో అక్కడినుంచి 10.78లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద 8.5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడంతో కోనసీమలోని నదీపాయలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉభయగోదావరి జిల్లాల మధ్య ఉన్న సి.గన్నవరం మండలంలోని చాకలిపాలెం కాజ్‌వే పూర్తిగా నీట మునగడంతోపాటు దొడ్డిపట్ల రేవులో ప్రయాణికుల రాకపోకలను నిలిపివేయడంవల్ల సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. జి.పెదపూడి వద్ద నాలుగు లంకగ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు లైఫ్ జాకెట్ల సహాయంతో బోట్లపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ముమ్మిడివరం మండలం అన్నంపల్లిలోని ఫ్లడ్ స్టోరేజ్ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట జేసీతోపాటు వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. వరద పెరుగుతున్న దృష్ట్యా బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలకు అవసరమైన ఇసుక బస్తాలు, సర్వే కర్రలు వంటి ఇతర మెటీరియల్‌ను సిద్ధం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. వరదలు, వర్షాల ముంపుతో ఏవిపత్తులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎక్కడా పశు ప్రాణనష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అక్విడెక్టుల పటిష్టతపై తీసుకుంటున్న రక్షణ చర్యలను సమీక్షించారు. ముఖ్యనదీ పరివాహక లంకగ్రామాల్లో ఉన్న పశువులను వరద పెరుగుతున్న దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా రైతులను అప్రమత్తం చేశారు. గౌతమీనది పొంగి ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇసుక ర్యాంపు నిలిచిపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాల ద్వారా ఇసుకను తీసుకువెళ్లేందుకు వినియోగదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో రెండురోజుల్లో గోదావరి వరద మరింత పెరగనుందని సమాచారం.