కడలి కెరటమై...
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:41 AM
బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల తాకిడికి చారిత్రక కట్టడాలతోపాటు చమురు సంస్థల ఆస్తులకూ పెనుముప్పు పొంచి ఉంది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావం, అలాగే గత కొన్నేళ్ల నుంచి అల్పపీడనాలు, తుఫాన్
తీరాన్ని కబళిస్తున్న సంద్రం
చారిత్రక కట్టడాలకు పొంచి ఉన్న పెనుముప్పు
అంతర్వేది లైట్‌హౌస్‌ల చుట్టూ నీరే
ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్‌కూ తాకిడి
భారీగా కోతకు గురవుతున్న సముద్ర తీరం
ఆందోళనలో తీర గ్రామాల ప్రజలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల తాకిడికి చారిత్రక కట్టడాలతోపాటు చమురు సంస్థల ఆస్తులకూ పెనుముప్పు పొంచి ఉంది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావం, అలాగే గత కొన్నేళ్ల నుంచి అల్పపీడనాలు, తుఫాన్ సమయాల్లో సముద్రపు కెరటాలు ఎగసి పడుతుండడం వల్ల తీరం భారీగా కోతకు గురవుతోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో సుమారు కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చి సారవంతమైన భూములను కడలి గర్భంలో కలిపేసుకుంది. తీర రక్షణ కోసం పెంచుతున్న మడ అడవులు సహా సర్వే కర్రల తోటలు కనుమరుగైపోతున్నాయి. ఇటు అంతర్వేది నుంచి అటు పాండిచ్చేరిలోని యానాం వరకు ఉన్న సుమారు 90 కిలోమీటర్ల మేర సముద్ర తీరం అనూహ్య మార్పులతో తీరాన్ని కడలి గర్భంలో కలుపుకోవడంతోపాటు లైట్ హౌస్ వంటి చారిత్రక కట్టడాలు సైతం కుప్పకూల్చేందుకు ముప్పు పొంచి ఉంది. దీనికి తోడు అల్లవరం మండలం ఓడలరేవు సముద్రతీరం వెంబడి వందల కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ ఆన్‌షోర్ టెర్మినల్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది.
అంతర్వేది లైట్‌హౌస్‌కు ముప్పు..
అంతర్వేది నుంచి యానాం వరకు ఉన్న 90 కిలోమీటర్ల సముద్ర తీరం ఇటీవల భారీగా కోతకు గురవుతోంది. ఈనేపథ్యంలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరప్రాంతంలో దశాబ్దాల కిందట నిర్మించిన చారిత్రాత్మక కట్టమైన లైట్‌హౌస్ మనుగడ ప్రశ్నార్థకమైంది. పాత లైట్‌హౌస్ స్థానే కొత్తగా మరో లైట్‌హౌస్ నిర్మాణం కూడా చేపట్టారు. అయితే సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల కెరటాల తాకిడికి వీటికి ప్రమాదం పొంచి ఉంది. అలలు లైట్‌హౌస్‌ను సైతం తాకే పరిస్థితులు రాగల ముప్పుకు సంకేతంగా ప్రజలు పేర్కొంటున్నారు. పూర్వం ఉండే ఓ లైట్‌హౌస్ ఆనవాళ్లు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయి అరకిలోమీటరు దూరంలో నేటికీ మొండి గోడలు తీరంలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు అన్నాచెల్లెలు గట్టుగా పిలిచే వశిష్ఠ నదీ చెంతన ఉండే లైట్‌హౌస్ సముద్రంలో నావిగేషన్ కోసం పనిచేస్తోంది. ఓడలకు, బోడ్లకు దిక్సూచిగా ఉపయోగపడే ఈ లైట్‌హౌస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
ఆన్‌షోర్ టెర్మినల్‌కు ముప్పే..
అల్లవరం మండలం ఓడలరేవులో వందల కోట్ల రూపాయల వ్యయంతో చమురు, సహజవాయు సంస్థ గల కొన్నేళ్ల నుంచి ఆన్‌ఫోర్ టెర్మినల్ ద్వారా చమురు, సహజవాయువుల అన్వేషణ, సరఫరా కొనసాగిస్తుంది. అయితే ప్లాంటు నిర్మాణ సమయంలో కిలోమీటరు దూరంలో ఉండే సముద్రం ఇప్పుడు ముందుకు చొచ్చుకు వచ్చి ప్లాంటు చుట్టూ నిర్మించిన రక్షణ గోడను ఛిద్రం చేస్తోంది. గోడ చుట్టూ నిర్మించిన రహదారి ఇప్పటికే కడలి గర్భంలో కలిసిపోయింది. వందల కోట్ల విలువైన ఈ ప్లాంటుకు సముద్రం నుంచే ముప్పు పొంచి ఉంది. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల వంటి విపత్తుల సమయాల్లో సముద్రం అల్లకల్లోలంగామారి ముందుకు చొచ్చుకు వస్తుండడం వల్ల ప్లాంట్లలోకి నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చుట్టూ ఉన్న రక్షణ కట్టడాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఓడలరేవులో ఉన్న సముద్ర రిసార్ట్స్ సమీపంలో వేసిన తాత్కాలిక రక్షణ షెడ్లు కుప్పకూలాయి. తీరం భారీగా కోతకు గురవుతుంది. అదేవిధంగా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలోని ఆన్‌షోర్ ప్లాంటు అడ్మినిస్ర్టేషన్ ఆఫీస్ చుట్టూ సముద్రపు అలల తాకిడి వల్ల ఇటీవల తుఫాన్ సమయంలో జల దిగ్బంధానికి గురైంది. తీరంలో కోత అనూహ్యంగా పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.