Share News

కోనసీమలో అలర్ట్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:18 AM

అమలాపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఈనెల 27 నుంచి జిల్లాలో తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఉంటుందని, తుఫాను తీరాన్ని ఈ ప్రాంతంలోనే దాటే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో తుఫాన్‌ ప్రభావంపై కలెక్టర్‌ శనివారం వీడి

కోనసీమలో అలర్ట్‌
కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన కలెక్టర్‌

తీరప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించాలంటూ ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఆదేశం

జిల్లాలో 428 మంది గర్భిణులను ముందస్తుగా పీహెచ్‌సీలకు తరలించాలి

జనరేటర్లు సిద్ధంచేసుకోండి.. విద్యుత్‌ కార్మికులు, ట్రాన్స్‌ఫార్మర్లను రెడీగా ఉంచండి

అమలాపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఈనెల 27 నుంచి జిల్లాలో తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఉంటుందని, తుఫాను తీరాన్ని ఈ ప్రాంతంలోనే దాటే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో తుఫాన్‌ ప్రభావంపై కలెక్టర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తుఫానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సముద్ర తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి, అత్యవసరమైతే తప్ప ఈ మూడు రోజులు ప్రజలు బయట ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతోపాటు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా కార్తీకమాసంలో భక్తులు సముద్ర, నదీ స్నానాలు, దైవ దర్శనాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ ప్రభావంతో ఎవరికైనా ఇబ్బందుల తలెత్తితే కంట్రోల్‌ రూము నంబరు 08856293104కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ హెచ్చరికలను దండోరా ద్వారా గ్రామాల్లో తెలియజేయాలని, తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న తుఫాను పునరావాస కేంద్రాలను సిద్ధంచేసి ఆయా ప్రాంతాల ఆవాసాలను మ్యాపింగ్‌ చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలను పునరావాస కేంద్రాల నిర్వహణకు ఇన్‌చార్జిలుగా నియమించాలని, పారిశుధ్య ఏర్పాట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చేపట్టాలని సూచించారు. తీరం వెంబడి మూడు కిలోమీటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమిస్తూ తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలను అప్రతమత్తంచేయాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 27 నాటికి నిత్యావసరాలన్నీ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఐదు రోజులపాటు అవసరాల మేరకు సిద్ధం చేసుకోవాలని ముఖ్యంగా మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయడంతోపాటు వెళ్లినవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో 428 మంది గర్భిణీలను గుర్తించి వీరిని సమీపంలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు బర్త్‌ వెయిటింగ్‌ హాలులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడే జనరేటర్లు, అంబులెన్సులు, అత్యవసర ఔషధాలు సిద్ధం చేసుకోవాలని, విద్యుత్‌శాఖ కార్మికులను, స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్ల మెటీరియల్‌ను ముందస్తు నిల్వలు సిద్ధంచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీర్లు, పీడబ్ల్యుఎస్‌ పథకాల వద్ద విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను సిద్ధం చేసుకుని ప్రజలకు అవసరమైన తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పవర్‌ జేసీబీలు, క్రేన్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదేవిధంగా తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా పాఠశాలలకు తాత్కాలిక సెలవులు ఇవ్వాలని ఆయన సూచించారు.

రేపు గ్రీవెన్స్‌ రద్దు..

ఈనెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తుఫాను హెచ్చరికల వల్ల రద్దయినట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వెల్లడించారు. అర్జీదారులు తమ సమస్యలఅర్జీలను టోల్‌ఫ్రీ నంబరు 1100 లేదా మీకోసం వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించవచ్చని, తమ ఫిర్యాదులతో జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని సూచించారు. సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్‌ను రద్దుచేసిన దృష్ట్యా ప్రజలు గమనించాలని కోరారు.

Updated Date - Oct 26 , 2025 | 01:18 AM