జంక్షన్ జామ్
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:52 AM
జాతీయ రహదారిపై దివాన్‌చెరువులో ట్రాఫిక్‌జామ్ పరిపాటిగా మారింది. పరిసర గ్రామాల రహదారులను కలుపుతూ ఏర్పాటు చేసిన కూడళ్లలో వాహనచోదకులు రహదారిని దాటి రెండో ప్రక్కకు వెళ్లేందుకు చాలా సమయం వేచి ఉండవలసివస్తోంది. ఆ తర్వాత కూడా భయంభయంగా రహదారిని దాటవలసిన పరిస్థితి నెలకొంటోంది. అలాగే జాతీయ రహదారిపై తరచు మరమ్మతులు సాగిస్తున్నారు. పనులు జరిగే చోట్ల స్టాపర్లు పెట్టి ఒకవైపు రాకపోకపోకలను నియంత్రించడంతో వాహనాలు వేగం నెమ్మదిస్తోంది. పని జరిగే ప్రాంతానికి దాదాపు కిలో మీటరు దూరం వరకూ బంద్ చేస్తున్నారు.
దివాన్‌చెరువులో తరచూ ట్రాఫిక్ సమస్యలు
16వ నెంబరు జాతీయ రహదారికి మరమ్మతులు
గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఇబ్బందుల్లో ప్రయాణికులు
ప్రారంభం కాని ఫ్లయ్‌ఓవర్ పనులు
సేకరించిన స్థలాల్లో చిరువ్యాపారాలు
దివాన్‌చెరువు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై దివాన్‌చెరువులో ట్రాఫిక్‌జామ్ పరిపాటిగా మారింది. పరిసర గ్రామాల రహదారులను కలుపుతూ ఏర్పాటు చేసిన కూడళ్లలో వాహనచోదకులు రహదారిని దాటి రెండో ప్రక్కకు వెళ్లేందుకు చాలా సమయం వేచి ఉండవలసివస్తోంది. ఆ తర్వాత కూడా భయంభయంగా రహదారిని దాటవలసిన పరిస్థితి నెలకొంటోంది. అలాగే జాతీయ రహదారిపై తరచు మరమ్మతులు సాగిస్తున్నారు. పనులు జరిగే చోట్ల స్టాపర్లు పెట్టి ఒకవైపు రాకపోకపోకలను నియంత్రించడంతో వాహనాలు వేగం నెమ్మదిస్తోంది. పని జరిగే ప్రాంతానికి దాదాపు కిలో మీటరు దూరం వరకూ బంద్ చేస్తున్నారు. దీనితో ఒకే మార్గంలో వాహన రాకపోకలు సాగించాల్సి రావడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా కొంతమంది సాగిస్తున్న వ్యాపారాలు కూడా వాహనదారులను కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లో పడేస్తున్నాయి..
గస్తీ పెంచాలి
16వ నెంబరు జాతీయ రహదారిపై దివాన్‌చెరువు జంక్షన్ నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. పాఠశాలలు, వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు తిరిగే ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో ఈ రహదారి మీదుగా కార్యాలయాల్లో విధులకు వెళ్లి, వచ్చే ఉద్యోగులు సైతం గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని భావిస్తుంటారు. అయితే తరచూ ఏర్పడే ట్రాఫిక్‌జామ్‌లతో అవస్ధలు పడుతున్నారు. కొంతమంది ఉద్యోగులైతే సకాలంలో తమ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాలన్న ఆతృతతో వేగంగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలూ ఉంటున్నా యి. ఇక దివాన్‌చెరువు జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీస్‌లు, బొమ్మూరు పోలీసులు గస్తీ కాస్తూ ప్రమాదాలను కొంతవరకూ నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లాలాచెరువు వైపు నుంచి రాజానగరం వైపు వెళ్లే వాహనాలనూ, అలాగే దివాన్‌చెరువు వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలను నియంత్రించేందుకు, దివాన్‌చెరువులో అపసవ్యదిశలో నడిపే వాహనాలను అడ్డుకునేందుకు వీలుగా దివాన్‌చెరువు జంక్షన్‌లో గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది.
ఫ్లయ్‌ఓవర్‌తో భద్రత..
దివాన్‌చెరువు వద్ద ఫ్లయ్‌ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దివాన్‌చెరువు పండ్ల మార్కెట్ కూడలి నుంచి గామన్ బ్రిడ్జి జంక్షన్ కలుపుతూ ఫ్లయ్‌ఓవర్‌ను దాదాపు రూ.300 కోట్లతో నిర్మాణం జరుగనుంది. 8 నెల క్రితమే ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో దీనికి సంబంధించి భూసేకరణపనులను సంబంధిత అధికారులు చేపట్టారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తిచేస్తామని కొంతమంది నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఫ్లయ్‌ఓవర్ కోసం సేకరించేందుకు నిర్ణయించిన స్థలాలల్లో నిర్మాణాలను దాదాపు ఐదు నెలలక్రితమే అధికారులు తొలగించారు.
ప్రారంభం కాని పనులు.. ఇబ్బందులు
కానీ ఇంతవరకూ ఫ్లయ్‌ఓవర్ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో వంతెన కోసం ఖాళీ చేసిన స్థలాల్లో కొంతమంది వ్యాపారులు జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా తోపుడుబండ్లు, టెంట్లు ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. దీనితో రద్దీ సమయాలలో రహదారి మార్జిన్ దిగేందుకు కొన్ని చోట్ల వీలు కావడంలేదని పలువురు వాహనచోదకులు వాపోతున్నారు. ఫ్లయ్‌ఓవర్ పూర్తయితేనే ట్రాఫిక్ సమస్యలు తీరి, రహదారి భద్రత మెరుగవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.