Share News

పేరుకే పట్టా.. స్థలం ఎక్కడ?

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:18 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వేలాదిమంది నిరుపేదలు ఇళ్లస్థల పట్టాపత్రాలతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లుగా తమకు కేటాయించిన ఇళ్లస్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తారని.. ఇళ్థ స్థలాలు అయితే చూపించలేదు గానీ ఆయా పట్టాలను మాత్రం గతేడాది ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చేసి మళ్లీ అందించింది.

పేరుకే పట్టా.. స్థలం ఎక్కడ?
రూరల్‌ మండలం పేరూరులంకతోటలో మెరక చేయని ఇళ్లస్థల పట్టాల భూమి

  • ఇళ్లస్థల భూముల సేకరణలో చిత్రవిచిత్రాలు

  • ఐదేళ్లు గడిచిపోయినా మెరక పనులు లేవు

  • పట్టాలు ఇచ్చారు సరే.. పొజిషన్‌ ఎప్పుడు

  • జగనన్న లేఅవుట్ల లబ్ధిదారులపై పునఃపరిశీలన

అమలాపురం రూరల్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వేలాదిమంది నిరుపేదలు ఇళ్లస్థల పట్టాపత్రాలతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లుగా తమకు కేటాయించిన ఇళ్లస్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తారని.. ఇళ్థ స్థలాలు అయితే చూపించలేదు గానీ ఆయా పట్టాలను మాత్రం గతేడాది ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చేసి మళ్లీ అందించింది. తమ పేరున రిజిస్టర్డ్‌ పట్టా ఉందని చెప్పుకోవడమే ఆ పేదలకు మిగిలింది. వేలాదిమంది లబ్ధిదారులైతే ఏగ్రామంలో ఇళ్లస్థలాలు కేటాయించారో తెలియని పరిస్థితి. మరికొందరికైతే ఎక్కడో పదినుంచి 15కిలోమీటర్ల దూరంగా ఉన్న గ్రామాల్లో ఇళ్లస్థల పట్టాలు కేటాయించారు. వందలాది ఎకరాల్లో మెరక పనులు చేయించకుండా గత వైసీపీ ప్రభుత్వం గడిపేసింది. జిల్లావ్యాప్తంగా 296జగనన్న లేఅవుట్ల ఐడీ నెంబర్లతో మెరక పనులు చేయించారు. వాటికి సంబంధించి గత ప్రభుత్వం జిల్లాలో రూ.26కోట్లు బిల్లు బకాయిలు పెట్టింది.

లేఅవుట్లలో మెరక పనులపై దృష్టి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో మెరక పనులపై క్వాలిటీ కంట్రోల్‌ బృందాలను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ బృందాలు సర్వే పూర్తిచేసిన తర్వాత అసలు ఎంత మేర పనులు జరిగాయో నిర్ధారించుకున్న తర్వాతే ప్రభుత్వం బిల్లులు చెల్లించే అవకాశం ఉందని ఆశాఖ అధికారులు చెప్తున్నారు. దానికితోడు ప్రస్తుతం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జగనన్న లేఅవుట్లలో పట్టాలు పొందిన లబ్ధిదారుల పునఃపరిశీలన కార్యక్రమం ఆన్‌లైన్‌లో చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రకటించింది. వైసీపీప్రభుత్వం సెంటున్నర స్థలానికి రిజిస్ర్టేషన్‌ చేసి మరీ ఇళ్థ స్థల పట్టాలు ఇవ్వడంతో మరోసారి నష్టపోయామని అర్హులైన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థలాలు చూపలేదు

గత ప్రభుత్వం ఇళ్లస్థల పట్టాలు ఇచ్చి లక్షలాది రూపాయల ఆస్తిని సమకూర్చినట్టు నిరుపేదలను నమ్మించి మెరక పనులు చేయకుండా మోసం చేసింది. ఈసారైనా న్యాయంచేయాలని పేదలు వేడుకుంటున్నారు. పట్టాలకు సంబంధించి ఇళ్లస్థలాలను చూపిస్తే ఏదొకటి కట్టుకుంటామని వాపోతున్నారు. ఒక్క అమలాపురం రూరల్‌ మండలంలోనే 5,526మందికి ఇళ్లస్థలపట్టాలు ఇస్తే 3490 మందికి ఇంతవరకు ఇంటి స్థలాలను చూపించలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోను ఈ పరిస్థితి నెలకొంది.

మెరక పనుల బకాయి రూ.26కోట్లు

ఇళ్లస్థలాలకు సేకరించిన భూములను మెర క చేసేందుకు అవసరమైన మట్టికి కొరత లే దు. కానీ మట్టి తరలింపు నిబంధనలతోనే అస లు సమస్య అని అధికారులు వాపోతున్నారు. మట్టి తరలింపులో గత ప్రభుత్వ హయాంలో ఎన్నోఅక్రమాలు జరిగాయి. మెరక పనులను తొలుత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం ద్వారా నిర్వహించారు. అప్పట్లో జరిగిన ప నులకు కొంతమేర బిల్లులు చెల్లించారు. ప్ర స్తుతం జిల్లాలో మెరక పనులకు రూ.26కోట్లు బకాయిలు విడుదల కావాల్సి ఉంది.

చిత్రవిచిత్రంగా ఇళ్లస్థల భూములు..

జిల్లాలో శ్మశానవాటికలు,వరదలొస్తే పొంగి ప్రవహించే మేజర్‌ డ్రెయిన్లు, గోదావరి తీరం లోను ఇలాఎక్కడపడితే అక్కడ గతప్రభుత్వం ఇళ్లస్థల పట్టాలు మంజూరుచేశారు. అమలా పురంరూరల్‌ మండలంలోనే పేదలకు ఇచ్చిన ఇళ్లస్థల పట్టాభూముల్లో చిత్రవిచిత్ర పరిస్థితు లు నెలకొన్నాయి. మండలంలో జగనన్న కాల నీలకోసం తొలుత 24 లేఅవుట్లు ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇళ్లస్థల భూములతో కలిపి ప్రభుత్వం సేకరించిన భూములతో వెరసి 76.48 ఎకరాల్లో ఇళ్లస్థలాల లేఅవుట్లు వేశారు. అమలాపురం పట్టణానికి సంబంధించి నిరుపేదల కోసం మండలంలోనే మరికొన్ని లేఅవుట్లు వేసేందుకు భూములు సేకరించారు. వీటిలో 80ఎకరాల వరకు మెరక పనులకు నోచుకోలేదు. మండలానికి సం బంధించి చివరకు 22 లేఅవుట్లను మిగిల్చా రు. అమలాపురం రూరల్‌ మండలానికి సంబంధించి 39 లేఅవుట్లలో 5526మందికి ఇళ్లస్థల పట్టాలు మంజూరుచేశారు. వారిలో 3490మందికి ఇప్పటివరకు వారికి ఎక్కడ ఇంటి స్థలం కేటాయించారో చూపించలేదు.

రోడ్డు మార్గం లేక..

ఇమ్మిడివరప్పాడులో ఇళ్లస్థల పట్టాభూము ల్లో వింతపరిస్థితి నెలకొంది. ఇక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారులు 95శాతం శంకుస్థాపన లు చేసుకున్నారు. కానీ, ఒక్కఇళ్లూ నిర్మించలే దు. ఎందుకంటే అక్కడకు వెళ్లేందుకు దారిలే దు. దారీతెన్నూ లేని అక్కడకు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదరపల్లికి చెందిన పేద లబ్ధిదారులకు ఇళ్లస్థలపట్టాలుగా ఇచ్చారు.

ఈదరపల్లిలో శ్మశానవాటిక చెంతన మత్స్య శాఖ అధీనంలోని 1.70ఎకరాల్లోఉన్న చెరువు లను 64మందికి పట్టాలుగా ఇచ్చారు. వెంటనే మెరక పనులు పూర్తి చేశారు. చకచకా స్టోన్లు ప్లాంటేషన్‌ చేశారు. ఇక ఇళ్ల నిర్మాణమే తరు వాయి అన్న సమయంలో మత్స్యశాఖ ప్రతిని ధులు కోర్టును ఆశ్రయించడంతో ఆ భూము లు నిరుపయోగంగా మారాయి.

బండారులంకలో నిరుపేదల కోసం స్థానిక అప్పర్‌ కౌశిక మేజర్‌ డ్రెయిన్‌ చెంతన పది ఎకరాల భూమిని సేకరించారు. ఆ స్థలంలో 383మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. తమ ఇళ్ల స్థలాలను చూపించాలని గ్రామస్తులు పలు సార్లు ఆందోళనలు చేశారు.

జనుపల్లి పంచాయతీ కార్యాలయం సమీ పంలో ఉన్న 1.26 ఎకరాల మందబయలు భూమిని 49మందికి ఇళ్లస్థల పట్టాలుగా ఇచ్చారు. చెరువుగా ఉన్న వాటిని మెరక చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనే కాదు. స్థానికులు తమకు ఇళ్లస్థలం చూపించాలని కలెక్టర్‌ కార్యాలయంలో పలుసార్లు అర్జీలు అందించారు. వారికి తాండవపల్లి, గూడాల లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కేటాయిస్తామని మాట ఇచ్చారు తప్ప ఇంతవరకు చర్యలు చేపట్టలేదు.

Updated Date - Jul 31 , 2025 | 01:18 AM