గూడు..గోడు!
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:35 AM
పేదల ఇంటి కలనెరవేరేదెపుడో.. ఏళ్ల పాటు అద్దె ఇళ్లలో బతుకీడుస్తూ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని ఆశపెట్టుకున్న కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి.
వెంటాడుతున్న వైసీపీ తప్పిదాలు
జిల్లాలో 429 లేఅవుట్లు
అనేక చోట్ల అధ్వానం
62,624 ఇళ్లు శాంక్షన్
వందల్లోనే గృహ ప్రవేశాలు
కూటమి ప్రభుత్వం దృష్టి
త్వరలో 10,794 గృహ ప్రవేశాలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
పేదల ఇంటి కలనెరవేరేదెపుడో.. ఏళ్ల పాటు అద్దె ఇళ్లలో బతుకీడుస్తూ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని ఆశపెట్టుకున్న కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి.అయితే గత వైసీపీ ప్రభు త్వం పేదలకు ఆశ చూపి నిలువునా ముం చింది. జగనన్న కాలనీల పేరిట పనికిరాని స్థలాలను ఎంపిక పేదలకు ఇచ్చింది. అక్కడ ఇళ్లు కట్టలేరు.. కట్టుకున్నా ఉండలేరు. దీంతో అప్పటి తప్పిదాలు ఇంకా వెంటాడుతున్నాయి. కేవలం వందల్లో మాత్రమే పేద ప్రజలు ఆయా కాలనీల్లో ఇళ్లు కట్టుకున్నారు. కానీ అక్క డి పరిస్థితులు నివాస యోగ్యంగా లేక నేటికీ ఇబ్బంది పడుతున్నారు. మౌలిక సదు పాయా ల్లేకపోవడంతో కొత్తవారెవరూ అక్కడకు రావ డంలేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం త్వరలో 10,794 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి సామూహిక గృహ నిర్మాణాలు చేయడానికి సిద్ధం అవుతుంది. అయితే కాలనీలు మాత్రం నేటికీ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలో 429 లేఅవుట్లు..
గత వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఇస్తామని జిల్లాలో 429 లేఅవుట్లు వేసింది. పథకం ఆరంభంలో మూడు ఆప్షన్స్ ఇచ్చింది.. అందులో ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని ఒక ఆప్షన్.. ఈ ఆప్షన్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో గత వైసీపీ ప్రభుత్వం మాట మడతేసింది. ఆ ఆప్షన్ పక్కన పెట్టేసింది. మొ దటి దశ కింద 45,051 ఇళ్లు, స్వంత స్థలాలు ఉన్నవారికి 17,573 ఇళ్లు మంజూరు చేసి హడా విడి చేసింది. అయితే ఇళ్ల నిర్మాణాలు ముం దుకు సాగలేదు. స్థలాలు అంటూ ఇచ్చేశారు. పనికిరాని భూములను ఇళ్ల స్థలాలుగా కేటా యించేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. బూరుగుపూ డి ఆవ భూముల గురించి తెలియని వారుం డరు.అటువంటిది వందలాది ఎకరాలను కోట్లా ది రూపాయల పోసి కొనుగోలు చేసేశారు. చినుకుపడితే ఆవ భూముల్లో రెండు తాడి చెట్లు ఎత్తున నీరు నిలిచిపోతోంది. అటువ ంటి భూముల్లో ఇళ్ల పట్టా లిచ్చేశారు.. తీరా జనం తిరగబడడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ప్రజలు జీవించడానికి అనుకూలంగా లేని లేఅ వుట్లను కూటమి ప్రభుత్వం గుర్తించింది.
త్వరలో కూటమి గృహ ప్రవేశాలు
కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి నోటీసులివ్వడంతో పాటు తామే అదనంగా కొంత డబ్బు ఇచ్చి కడతా మంటే కొందరు ముందుకు వచ్చారు. ప్రస్తుతం పాత కాల నీల్లో ఇళ్లను సాధ్యమైనంత వరకూ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యంతో ఉంది. దీనిలో భాగంగా జిల్లాలో 10,794 ఇళ్లను పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. ఇప్పటి వరకూ 7394 ఇళ్ల ను నిర్మించిం ది.ఇంకా 3400 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ఈ ఇళ్లతో పాటు కొత్తగా లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాం తంలో రెండు సెంట్ల స్థలంతో ఇళ్ల నిర్మించే యోచనలో ఉంది.
అధ్వానంగా కాలనీలు..
మౌలిక సదుపాయాల్లేక కాలనీలు భయంకరంగా ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం ఒకటే ఉంది. ప్రధాన రోడ్లు లేవు. ఇంటర్నల్ రోడ్లు లేవు.మంచినీటి సౌకర్యం లేదు. ఎవరైనా ఇల్లు కట్టు కుందామంటే అక్కడకు నిర్మాణ సామగ్రి తీసుకుని వెళ్లే దారి లేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొందరు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకం కలిగి ఇపుడిపుడే ముందుకు వస్తున్నారు.
ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్..
అనపర్తి నియోజకవర్గంలో 1684 లక్ష్యంకాగా 650 పూర్త య్యాయి. ఇంకా 1034 వివిధ దశల్లో ఉన్నాయి. రాజమండ్రి రూరల్‌లో మొత్తం 514 లక్ష్యం కాగా 267 పూర్తయ్యాయి. 247 పూర్తి కావాల్సి ఉంది. రాజానగరంలో 824 లక్ష్యంకాగా 513 పూర్తయ్యాయి.311 పెండింగ్‌లో ఉన్నాయి. రాజమండ్రి అర్బన్‌లో 3060 లక్ష్యంకాగా 2953 పూర్తయ్యాయి. 143 పూర్తి కావాల్సి ఉంది. గోకవరంలో 211 లక్ష్యం కాగా 144 పూర్త య్యాయి.67 పూర్తి చేయాల్సి ఉంది. కొవ్వూరు నియోజక వర్గంలో 1724 లక్ష్యం కాగా 889 పూర్తయ్యాయి. 835 పూర్తి కావలసి ఉంది.నిడదవోలు నియోజక వర్గంలో 1005 లక్ష్యంకాగా 638 పూర్తయ్యా యి. 367 పూర్తి కావాల్సి ఉంది. గోపాలపురం నియోజక వర్గంలో 1736 లక్ష్యంకాగా 1340 పూర్తయ్యా యి. ఇంకా 396 పూర్తి కావాల్సి ఉంది.