Share News

బాబోయ్‌.. ఇవేం ఎండలు!

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:03 AM

ఇది వర్షాకాలమా! మండు వేసవిలో ఉన్నామా! ప్రస్తుత వాతావరణం పరిస్థితి చూస్తే అందరికీ అదే అనుమానం కలుగుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేసవిని తలపించే రీతిలో కాస్తున్న ఎండలు, వీస్తున్న వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బాబోయ్‌.. ఇవేం ఎండలు!
కాకినాడ నగరంలో ఎండ తీవ్రత కారణంగా గొడుగు వేసుకు వెళుతున్న యువతులు

  • ఉక్కపోత, వేడి వాతావరణం

  • వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి

  • వర్షాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

  • మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యం

  • కొందరికి అనారోగ్య పరిస్థితులు

ఇది వర్షాకాలమా! మండు వేసవిలో ఉన్నామా! ప్రస్తుత వాతావరణం పరిస్థితి చూస్తే అందరికీ అదే అనుమానం కలుగుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేసవిని తలపించే రీతిలో కాస్తున్న ఎండలు, వీస్తున్న వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పిఠాపురం/ రాజమహేంద్రవరం సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలంలో వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి అందరూ సేదతీరారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అప్పుడప్పుడు పడిన వర్షాలు, రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉండి ఎండలు తీవ్రంగా కాస్తుండడంతో ఇప్పుడు వేసవికాలం అన్నట్టుగా మారిపోయింది వాతావరణం. గత నాలుగైదు రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే వేడిగాలులు ప్రారంభమై, సాయంత్రం వరకు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు సాహసించట్లేదు. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బైక్‌లపై కూడా బయట తిరగలేని పరిస్థితి. టోపీలు పెట్టుకున్నా, కూలింగ్‌ గ్లాస్‌లు ధరించినా మాస్క్‌ లు పెట్టుకున్నా సరే ఎండదెబ్బకు హడలిపోయారు. ఉపశమనం కోసం శీతలపానీయాలు వైపు పరుగులు పెడుతున్నారు. ఈ వాతావరణంతో మరోపక్క తలపోటు, జ్వరాలు వచ్చి జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒకటే ఉక్కపోత. ఆపై వేడి తగ్గకపోవడంతో వృద్ధులు, చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పిఠాపురం, కాకినాడ, తుని, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, ఏలేశ్వరం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. అమలాపురం, రాజమహేంద్రవరంలలో కూడా ఇదే పరిస్థితి. అయితే 41-43 డిగ్రీలు ఉన్న ఫీలింగ్‌ ఉంటుందని వాతావరణశాఖ చెప్తోంది. రుతుపవనాల ప్రభావం అంతగా లేకపోవడం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వేడిగాలులు వీస్తున్నట్టు చెప్తున్నారు. బుధవా రం ఇదే పరిస్థితి ఉండగా, గురువారం నుంచి అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పడం ఒక్కటే కొంత ఉపశమనంగా ఉంది.

Updated Date - Jul 17 , 2025 | 01:03 AM