Share News

హాస్టల్‌..డల్‌!

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:45 AM

హాస్టల్‌ విద్యార్థులు డల్‌గా ఉన్నారు.. జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పదవ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారు.

హాస్టల్‌..డల్‌!

ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పూర్‌ రిజల్ట్‌

బాగా పడిపోయిన ఉత్తీర్ణత శాతం

65 మంది వరకూ ఫెయిల్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : హాస్టల్‌ విద్యార్థులు డల్‌గా ఉన్నారు.. జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పదవ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారు. దీంతో సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది. బీసీ హాస్టల్స్‌కు సంబంధించి 92 మంది పరీక్షలు రాస్తే 69 మంది ఉత్తీర్ణులయ్యారు. 23 మంది ఫెయిలయ్యారు. మొత్తం 46 మంది బాలురు, 46 మంది బాలికలు పరీక్షలు రాశారు. వీరిలో 29 మంది బాలురు, 40 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారి పరిధిలో 32 మంది టెన్త్‌ పరీక్షలు రాస్తే నలుగురు బాలురు, 12 మంది బాలికలు పాసయ్యారు. 16 మంది ఫెయిల్‌ కావడం గమనార్హం. కొవ్వూరు అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారి పరిఽధిలో 60 మంది పరీక్షలకు హాజరుకాగా బాలురు 25 మంది, బాలికలు 28 మంది పాసయ్యారు. ఏడుగురు బాలురు ఫెయిలయ్యారు. సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో చదువుతున్న 179 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా 137 మంది మాత్రమే పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాజమహేంద్రవరం ఏఎస్‌డబ్ల్యువో పరిధిలో 47 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 38 మంది పాస య్యారు. 9 మంది ఫెయిలయ్యారు. ఎస్సీ హాస్టల్స్‌ విద్యార్థుల్లో మోర్త నవీన్‌ (బాలుర వసతిగృహం 1, రాజమహేంద్రవరం) 521 మార్కులు సాధించి హాస్టల్‌ విద్యార్థుల్లో టాప్‌లో నిలిచాడు. అలాగే, కర్రి రాహుల్‌ 518 మార్కులు (బాలురు వసతిగృహం, గౌరీపట్నం), పెన్నాడ శ్రావణి 505 మార్కులు, మానుకొండ హర్షిణి 503 మార్కులు (ఐడబ్ల్యుహెచ్‌సీ, బాలికల వసతిగృహం, చిన్నాయిగూడెం) సాఽధించారు. ఎస్టీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు ముగ్గురు ఫెయిలయ్యారు.

Updated Date - Apr 25 , 2025 | 12:45 AM