హాస్టల్ ‘పంచాయితీ’
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:10 AM
రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమశాఖ కాలేజీ బాలుర హాస్టల్ నెం.1లో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి.
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమశాఖ కాలేజీ బాలుర హాస్టల్ నెం.1లో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న లేడీవార్డెన్‌కు, హాస్టల్‌లోని కొందరు విద్యార్థులకు మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ జరుగుతోంది. అదికాస్తా తారస్థాయికి చేరుకుని ఇటీవల పోలీస్టేషన్‌లో ఫిర్యాదుల వరకూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సెమిస్టర్ ఒకటి పూర్తికాకుండానే హాస్టల్‌లో చదువు ముగించి ఇటీవలే బయటకు వెళ్లిన ఒక విద్యార్థిపై లేడీవార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీనికి ప్రతిగా సదరు విద్యార్థి కూడా కౌంటర్ ఫిర్యాదు చేయడం, మర్నాడు లేడీ వార్డెన్ పోలీస్టేషన్‌కు వెళ్లి మరో ఫిర్యాదు ఇవ్వడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అలాగే ఇటీవల దసరా సెలవుల సమయంలో అందరూ బయటకు వెళ్లిపోవాలని, హాస్టల్‌లో ఒక్కరు కూడా ఉండకూడదని చెబుతూ లేడీ వార్డెన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదులు, మెనూ సక్రమంగా పెట్టకపోవడం, ఇక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్న లేడీ వార్డెన్ గతంలో రాజమహేంద్రవరంలో పనిచేసిన ఒక హాస్టల్‌కు సంబంధించి విద్యార్థుల మాన్యువల్ హాజరుపై ఆర్‌టీఐలో సమాచారం కోరడం వంటి పలు అంశాలు ఈ పరిణామాలు, పరిస్థితులకు ప్రధానకారణంగా తెలిసింది. వీటితోపాటు ‘దసరా సెలవులు-హాస్టల్ బియ్యం’ ఆరోపణలపై హాస్టల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరిని కొందరు విద్యార్థులు నిలదీసిన తీసిన అంశం వీటన్నింటికీ ప్రధాన మూలకారణంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, చిక్కుముడి వీడిపోతుందని కూడా చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని నెం.1 బాలుర కాలేజీ హాస్టల్‌లో ఇంత జరుగుతున్నా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నించకపోవడం ఇప్పుడు జిల్లా సాంఘిక సంక్షేమశాఖలో అంతర్గతంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఫ డీఎస్‌డబ్ల్యువో కార్యాలయంలో..
కాగా, హాస్టల్ లేడీ వార్డెన్‌కు, విద్యార్థులకు మధ్య కోల్డ్‌వార్ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవంతో డీఎస్‌డబ్ల్యువో సోమవారం రాత్రి తన కార్యాలయం లో ఇరువర్గాలతోనూ ‘పంచాయితీ’ నిర్వహించినట్టు సమాచారం. రెండు వర్గాలతో చర్చలు జరిపి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా అధికారులు, నేతలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. హాస్టల్‌లో జరుగుతున్న అక్రమాలు, ఇతర పరిణామాలు, తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వరా అని కొందరు విద్యార్థులు నిలదీసినట్టు సమాచారం. చివరకు అదేరోజు రాత్రి ఇరువర్గాలు పోలీస్టేషన్‌లో ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే కాలేజీ హాస్టల్ కావడంతో యుక్తవయస్సులోని వాళ్లే ఉంటారు. లేడీ వార్డెన్‌ను ఇన్‌ఛార్జిగా నియమించడం ఇక్కడి విద్యార్థుల్లో అసంతృప్తికి ఒక కారణంగా చెబుతున్నారు. లేడీ వార్డెన్ కావడం వల్ల తాము హాస్టల్‌లో ఏ సమస్య చెప్పుకోవాలన్నా, వ్యక్తిగత ఇబ్బందులు తెలియజేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటున్నదని వీరు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న లేడీ వార్డెన్ కోరుకొండలో ఎస్సీ హాస్టల్‌కు రెగ్యులర్ వార్డెన్‌గా ఉన్నారు. అక్కడి వార్డెన్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌ఛార్జిగా వేయడం ఏమిటనే ప్రశ్నా తలెత్తుతోంది. నెం.1 కాలేజీ బాలుర హాస్టల్‌లో ప్రస్తుతం 160 మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. వివిధ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారు లు తక్షణమే ఈ హాస్టల్‌పై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.