నిధులకు ‘ఓపి’గ్గా!
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:25 AM
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో కలిపి ఏడు జిల్లాలకు పెద్ద దిక్కు అయిన కాకినాడ జీజీహెచ్ రూపురేఖలు మార్చేందుకు అధికా రులు కొత్త కార్యాచరణ చేపట్టారు.
ఓపీ విభాగానికి మార్పులు
రూ.137 కోట్లతో కొత్త డిజైన్లు
ఒక్కో బ్లాక్ ఎనిమిది అంతస్తులు
ఐదు బ్లాకులకు ప్రణాళికలు
నిధులకు ఎదురుచూపులు
వైసీపీలో మరమ్మతులు గాలికి
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో కలిపి ఏడు జిల్లాలకు పెద్ద దిక్కు అయిన కాకినాడ జీజీహెచ్ రూపురేఖలు మార్చేందుకు అధికా రులు కొత్త కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే ఓపీ, ఇన్‌పేషెంట్ విభాగాల భవనాలన్నీ శిథిలా వస్థకు చేరడంతో వీటిస్థానంలో కొత్తవి నిర్మా ణానికి రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. నిధుల లభ్యత కష్టంగా మారింది. అటు ప్రభుత్వం, ఇటు సీఎస్ ఆర్ ద్వారా నిధుల సమీకరణ సాధ్య పడడం లేదు. ఎలాగైనా ఆధునికీకరణ పనులు జరిగేలా చేయడం కోసం ప్రణాళికలు సవరించారు.
7 జిల్లాలకు పెద్ద దిక్కయినా..
కాకినాడ జీజీహెచ్ ఏడు జిల్లాలకు పెద్ద దిక్కు. కాకి నాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లాల నుంచీ నిత్యం ఇక్కడకు వేలాది రోగులు వస్తుం టారు. రోజుకు అవుట్ పేషెంట్ విభాగంలో రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు వైద్యం చేయించుకుంటారు. కానీ రోగుల తాకిడికి అనుగుణంగా ఇక్కడ ఓపీ భవ నాలు, శస్త్రచికిత్సల భవనాలు లేవు. ఉన్న భవనాల్లో చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. వర్షం వస్తే లీకేజీలు సరేసరి. రోగుల తాకిడికి తగ్గట్టు ఇన్ పేషెంట్, ఓపీ భవనాలు నిర్మించాలని ఎన్నో ఏళ్లగా డిమాండ్ ఉంది. గత వైసీపీ ప్రభు త్వంలో అధికారులు రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కానీ అప్పటి ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయ లేదు. దీంతో శిథిలావస్థకు చేరుకున్న బ్లాకుల్లోనే ఇప్ప టికీ వైద్య సేవలందిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జీజీహెచ్‌ను ఆధునికీకరించే విషయంలో ప్రతిపాదనల్లో వేగం పెరిగింది.
నిధులకు ఓపిగ్గా
పెద్దాసుపత్రిలో కార్డియాలజీ, క్యాన్సర్, ఆర్థో పెడిక్, క్యాజువాలిటీ, టీబీ, సర్జికల్ వంటి బ్లాకు లు, ఓపీ భవనాలు కూలగొట్టి ఆధునీకరిం చేందుకు రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని నివేదిక తయారు చేశారు. దీన్ని పలుసార్లు జిల్లా కలెక్టర్ల సదస్సుల్లో ప్రభుత్వానికి అందిం చారు. అటు సీఎం చంద్రబాబు జిల్లా పర్యట నలకు వచ్చినప్పుడు జీజీహెచ్ ఆధునికీ కరణ అవశ్యకత వివరించారు. అయితే రూ.500కోట్ల నిధుల లభ్యత అంత వేగంగా సాధ్యపడడం లేదు. అదే సమయంలో కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సీఎస్‌ఆర్) సమీకరణకు ప్రయత్నించినా స్పందన రాలేదు. జీజీహెచ్ ఆధునికీకరణ ఇప్పట్లో సాధ్యం కాదన్న అంచనాల నేపథ్యంలో కలెక్టర్ జీజీహెచ్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షిం చారు. ఒకేసారి ఆధునికీకరణ పనుల కంటే తొలుత అవుట్ పేషెంట్ విభాగాన్ని ఆధునికీక రించాలని సమీక్షలో తేల్చారు. ఏడు జిల్లాల నుంచి రోజుకు 2,500 వరకు ఓపీ పేషెంట్లు నిత్యం పోటెత్తు తుండడంతో 15 ఓపీ స్పెషా లిటీ విభాగాలు సామర్థ్యానికి మించి పనిచేస్తు న్నాయని సమీక్షలో జీజీహెచ్ అధికారులు వివరించారు. ఇన్ పేషెంట్ విభాగంలో రోజూ 400 మంది, అత్య వసర వైద్యం కింద రోజూ 150మంది వస్తున్నారని జీజీహెచ్ అధికారులు వివరిం చారు. రూ.500 కోట్ల ఆధునికీకరణ ప్రతిపాదనల స్థానంలో తొలిదశ కింద ఓపీ ఆధునికీకరణను పట్టాలెక్కించాలని తేల్చారు. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో ఓపీ విభాగాలకు సంబంధించి ఇంజనీర్లు డిజైన్లు తయారుచేసి కలెక్టర్‌కు అందించగా వీటిని ఆమోదించారు.
ఒక్కో బ్లాకులో 8 అంతస్తులు
సవరించిన ప్రతిపాదనల మేరకు ఓపీ విభా గం కింద కొత్తగా ఐదు బ్లాకులను నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కోబ్లాకులో 8 అంతస్తులు వచ్చేలా డిజైన్లు సిద్ధం చేశారు. ప్రధానంగా బ్లాక్1 కింద న్యూ ఫార్మసీ, పల్మనాలజీ ఓపీడీ భవనం నిర్మించాలని ప్రతి పాదించారు. ఇది టీబీ వార్డు క్యాంపస్ పరిస రాల్లో రానుంది. దీనికి రూ.23 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. బ్లాక్ 2 కింద న్యూ రేడియాలజీ, ఈఎన్‌టీ ఓపీ బ్లాకులు, పరిపాలన భవనం ఎనిమిది అంతస్తుల్లో రాను న్నాయి. దీనికి రూ.44 కోట్లు ఖర్చవు తుందని ప్రతిపాదించారు. బ్లాక్ 3 కింద ఓబీజీ, ఆర్థో విభా గాలు రానున్నాయి. ఇవి కూడా టీబీ వార్డు క్యాంపస్ పరిసరాల్లో నిర్మించనున్నారు. ఇందుకు రూ.26 కోట్లు ఖర్చుకానుంది. బ్లాక్ 4 కింద న్యూ డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఓపీడీ రానున్నాయి. దీనికి రూ.18 కోట్లు ఖర్చవుతుంది. బ్లాక్ 5 కింద కార్డియాలజీ, సైకియాట్రీ ఓపీ విభాగాలు రాను న్నాయి. ఈ బ్లాకు నిర్మాణానికి రూ.26 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం అన్ని బ్లాకులకు కలిపి రూ.137 కోట్లతో సవరించిన డిజైన్లు సిద్ధం చేశారు. ఈ మేరకు పూర్తయితే సమస్యలు తీరనున్నాయి.
కొత్త బ్లాక్‌ల నిర్మాణం పూర్తయితే..
కొత్త బ్లాకుల నిర్మాణం పూర్తయితే ఇప్పు డున్న ఓపీ పేషెంట్ల సామర్థ్యం రోజుకు రూ.3,500 వరకు పెరగ నున్న పేర్కొన్నారు. ఏడాదికి 1.1 మిలియన్ పేషెంట్లను చూడవచ్చని విశ్లేషించారు. ఒక్కో బ్లాకులో మాడ్యు లర్ వార్డులు,స్పెషలైజ్‌డ్ యూని ట్లు రానున్నాయి. తొలివిడతలో ఈ బ్లాకుల నిర్మాణం పూర్తయ్యాక మలివిడత కింద ఇన్‌పేషెంట్ బ్లాకుల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. తాజాగా సిద్ధం చేసిన ప్రతిపాదనలను త్వరలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వానికి కలెక్టర్ వివరించనున్నారు. ఒక్కో బ్లాకుకు ఒక్కో కంపెనీ సీఎస్‌ఆర్ కింద నిధులిచ్చేలా ప్రభు త్వం, జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారాను ప్రయ త్నాలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో బ్లాకు రూ.18 కోట్ల నుంచి రూ.23కోట్ల మధ్య ఉండడంతో సీఎస్సార్ నిధులను సులువుగా రాబట్టవచ్చని తమ ప్రణాళిక అని కలెక్టర్ షాన్‌మోహన్ వివరించారు.