అల్పపీడనంతో జిల్లాకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:01 AM
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు.
కంట్రోల్ రూం ఏర్పాటుకు ఆదేశాలు
ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సమస్య పది రోజుల్లో పరిష్కరిస్తా
అమలాపురం, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అధికార యంత్రాంగమంతా భారీవర్షాలు, వరదలు వంటి విపత్తులు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన, మామిడికుదురు, ముమ్మిడివరంలో ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కొత్తపేట, రామచంద్రపురంలో అన్ని ముంపు ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లు తీసుకున్నామని తెలిపారు. టెలీకాన్ఫరెన్సులో జేసీ నిషాంతి, డీఆర్వో మాధవితోపాటు వివిధ డివిజన్లు, మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్‌రూము నంబర్లను కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము నంబరు 08856293104, కొత్తపేట 8500238258, రామచంద్రపురం 08857245166లను సంప్రదించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అందరికీ ఆమోద యోగ్యమయ్యేలా..
సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట పరిమితులను నిర్ణయించేందుకు పది రోజుల్లో అందరికీ ఆమోద యోగ్యమైన మార్గాన్ని కనుగొంటామని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మత్స్యకార సమస్యలపై పలువురు ప్రతినిధులతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు సముద్ర వేట విషయంలో ఏర్పడ్డ సమస్యలను కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వివరించారు. ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎక్కడైనా స్వేచ్ఛగా వేటాడుకునే అవకాశం కల్పించాలని వర్మ నాయకత్వంలో ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2014- 19లో అప్పటి సీఎం చంద్రబాబు నర్సాపురం వద్ద అంతర్వేది, భీమవరం వద్ద గొల్లపాలెం, వైజాగ్ ప్రాంతాల్లో వేటకు అభ్యంతరాలు కలిగినప్పుడు అక్కడ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు జోక్యం చేసుకుని చర్చించి వేటకు అవకాశం కల్పించారని, అదే రీతిలో ప్రస్తుతం ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ వేట పరిమితిని నిర్దేశించేందుకు మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించి పది రోజుల్లో అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు ఇండియాస్ స్కిల్ కాంపిటీషన్స్-2025కు సంబంధించి 60 మంది స్కిల్ ట్రేడ్స్‌లో నిర్వహించడం జరుగుతుందని, దీనికి సంబంధించి ఏపీ నైపుణ్య పోర్టల్‌లో సెప్టెంబరు 30లోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు.