కుండపోత!
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:45 AM
కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. దాంతో జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రికార్డు స్థాయిలోనే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనూహ్యంగా నమోదైంది.
మునిగిన లోతట్టు ప్రాంతాలు.. స్తంభించిన జనజీవనం
రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధం
నీట మునిగిన బాలయోగి స్టేడియం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు అవరోధం
రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం
అత్యధికంగా ముమ్మిడివరంలో
18 సె.మీ వర్షపాతం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. దాంతో జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రికార్డు స్థాయిలోనే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనూహ్యంగా నమోదైంది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బుధవారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమై నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. అమలాపురం పట్టణంలోని ప్రధాన రహదారులతోపాటు పల్లపు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు అవుతున్న స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో వర్షం నీరు నిలిచిపోయి కెరటాలు కొడుతోంది. దాంతో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర పరేడ్‌కు ఈ వర్షం అవరోధంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో కురిసిన వర్షానికి తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్, సబ్‌ట్రెజరీతో సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపునీరు చొచ్చుకు రావడంతో పూర్తిగా జలదిద్బంధంలో ఉన్నాయి. ముమ్మిడివరంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి రికార్డులను నమోదు చేసింది.గత మూడు నెలల నుంచి వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు అల్లాడుతుండగా, బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా కురిసిన వర్షం ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. వర్షాలు లేకపోవడం, రికార్డుస్థాయిలో ఎండలు మండిపోవడం వంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే బుధవారం కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబడినా, కుంభవృష్టిగా కురవడంతో జనం బెంబేలెత్తిపోయారు. దాంతో అమలాపురం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో డ్రైన్లన్నీ పొంగి ప్రవహించడంతోపాటు రహదారులన్నీ రెండు అడుగులపైనే నీటితో జలదిగ్బంధంలో ఉన్నాయి. శ్రీదేవి మార్కెట్, ముస్లింవీధి, గాంధీబజార్, ముమ్మిడివరంగేట్‌తోపాటు నల్లవంతెన వద్దనున్న ఎన్టీఆర్ మార్గ్, అవతలవైపు ఉన్న ఎర్రవంతెన, నల్లవంతెన, సర్క్యులర్ బజార్, ఏజీ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్సు ఇలా అన్ని రహదారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతూ, లేస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్లారు. సాయంత్రం 6.30 గంటలు దాటిన తరువాత కొంచెం వర్షం నెమ్మదించడంతో ఒక్కసారిగా పట్టణంలోని వీధులన్నీ వాహనాల రద్దీతో కిటకిటలాడిపోయి వంతెన కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ సమయంలో రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఇక డ్రెయిన్లన్నీ ఒక్కసారిగా పొంగడంతో రోడ్ల మీదే మురుగునీరు ప్రవహించింది. భారీ వర్షాల కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సౌకర్యం నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ భారీవర్షం ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో నాట్లు వేస్తున్న అన్నదాతలకు మేలు చేకూరుస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని పల్లపు ప్రాంతాల్లో డ్రైన్లలో నుంచి ముంపునీరు దిగే మార్గం లేకపోవడంతో సమీప పొలాలను ముంచెత్తే ప్రమాదం కూడా ఉందని ఆందోళన చెందుతున్నారు.
జలదిగ్బంధంలో బాలయోగి స్టేడియం..
భారీ వర్షంతో అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం పూర్తిగా జలదిగ్బంధానికి గురైంది. ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో వర్షం ఏర్పాట్లకు అడ్డంకిగా మారింది. స్టేడియం ప్రాంగణంలో రెండు, మూడు అడుగులపైనే నీరు నిలిచిపోవడం వల్ల ఏర్పాట్లు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో శకటాల ప్రదర్శన, పోలీసుల కవాతుతోపాటు అధికారులు ముందస్తుగా సిద్ధంచేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మూడు రోజులపాటు భారీ వర్షాలు
కాగా బుధవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రానున్న అయిదు రోజులపాటు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అయిదురోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఆలస్యంగా అప్రమత్తత
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు తెలియజేస్తూ అత్యవసర సహాయం కోసం 08856 293104 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. అయితే అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీచేసినా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదు. మధ్యాహ్నం నుంచి అతి భారీ వర్షం పడుతున్నా రాత్రి వరకు ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు. అన్ని జిల్లాలు అప్రమత్తమైనా కోనసీమ జిల్లాలో మాత్రం బాగా పొద్దుపోయేదాకా కంట్రోల్ రూమ్‌లు ప్రకటించకపోవడం గమనార్హం.
ముమ్మిడివరంలో 18.8 సె.మీ వర్షపాతం
ఉదయం 8.30 నుంచి రాత్రి 10.30 వరకు కురిసిన వర్షపాతాన్ని చూస్తే రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ముమ్మిడివరంలో 188.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా అల్లవరంలో 143 మి.మీ, అమలాపురంలో 132.25మి.మీ మామిడికుదురులో 130మి.మీ, అంబాజీపేటలో 128.75మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.