కుమ్మేసిన వాన
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:46 AM
జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది.
రాజమహేంద్రవరం సిటీ/ కొవ్వూరు/ నల్లజర్ల , అక్టోబరు 13( ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల వరకు వర్షం భారీగా కురిసింది. జిల్లాలో అత్యధికంగా 48.0 మీమీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గోకవరంలో 0.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 13.5 శాతం వర్షం పడింది.రాజమహేంద్రవరంలో 30.2 మి.మీ , రాజానగరంలో 28.2, రంగంపేటలో 26.8, గోపాలపురంలో 12.8, రాజమహేంద్రవరం రూరల్‌లో 12.4, తాళ్ళపూడిలో 11.2, నిడదవోలులో 11.0, చాగల్లులో 10.8, సీతానగరంలో 10.4, పెరవలిలో 9.4 , దేవరపల్లిలో 9.2 , బిక్కవోలులో 8.8, కడియంలో 8.4, కొవ్వూరులో 6.2, ఉండ్రాజవరంలో 6.0 , అనపర్తిలో 3.8, కోరుకొండలో 3.2 మి.మీల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. రాజమహేంద్రవరం, రాజానగరం, రంగంపేట మండలాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొవ్వూరు పట్టణ, మండలంలో సోమవారం ఉదయం సుమారు గంటసేపు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరి ముంపునకు గురయ్యాయి. ఉదయం పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు పడారు. కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయం, పట్టణ పోలీస్టేషన్, కోర్టు ప్రాంగణాలకు వెళ్లే రోడ్డుపై వర్షపునీరు నిలిచి ప్రజలు, కక్షిదారులు అవస్థలు పడ్డారు. నల్లజర్ల చెక్కుపోస్టు వద్ద వరద నీరు భారీగా చేరి రాకపోకలకు అంతరాయం కలిగించాయి. బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.