వైద్య సేవలు మరింత మెరుగుపడాలంటే.. ఈ పోస్టులివ్వండి సారూ..
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:53 AM
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్)లో కీలకమైన ప్రధాన విభాగాలకు వైద్యుల కొరత వేధిస్తోంది. మెడికల్ కాలేజీకి జీజీహెచ్ అనుసంధంగా ఉన్నా కొన్ని కీలకమైన విభాగాలకు వైద్యులను నియమించకపోవడం వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర వైద్యసేవల్లో కార్డియాలజిస్ట్ పాత్ర ఎంతో కీలకం. ఇటీవలి కా
నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్
పోస్టులు ఖాళీ.. ఔట్‌సోర్సింగ్‌లో
రేడియాలజిస్ట్ సేవలు
పిడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీకి
వైద్యుల నియామకమూ అవసరమే
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్ నేడు రాక
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్)లో కీలకమైన ప్రధాన విభాగాలకు వైద్యుల కొరత వేధిస్తోంది. మెడికల్ కాలేజీకి జీజీహెచ్ అనుసంధంగా ఉన్నా కొన్ని కీలకమైన విభాగాలకు వైద్యులను నియమించకపోవడం వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర వైద్యసేవల్లో కార్డియాలజిస్ట్ పాత్ర ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్నవారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. వీరికి జనరల్ మెడిసిన్ వైద్యులే గుండె సంబంధిత వైద్యం చేస్తున్నారు. గుండె నెప్పితో వస్తున్న వారికి ఈసీజీ, 2డీ ఎకో వంటి టెస్టులు రాసి, వాటి రిపోర్టులు చూసి మందులు రాసి పంపేస్తున్నారు. రిపోర్టులో లోతైన పరిశీలన, ఇతర కారణాలను వారు పరిగణలోకి తీసుకోవడంలేదు. దీంతో కార్డియాక్ వైద్యసేవలు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. అలాగే కీలకమైన కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం చేసే నెఫ్రాలజిస్ట్ ఇక్కడ లేరు. కిడ్నీ సమస్య వస్తే ఎవరికి చూపించుకోవాలో తెలియని అయోమయం జీజీహెచ్‌లో ఉంది. సర్వరోగాలకు ఒకటే మం త్రం అన్నట్టు అందరూ జనరల్ మెడిసిన్ వైద్యుల వద్దకే వెళ్లాల్సి వస్తోంది. మరోపక్క రోగ నిర్ధారణలో అత్యంత కీలకమైన రేడియాలజిస్ట్ సేవలను ఔట్‌సోర్సింగ్‌లో మాత్రమే అందుతున్నాయి. శాశ్వత రేడియాలజిస్ట్ లేకపోవడంతో సమయానికి రిపోర్టులు అందడంలేదనే అసంతృప్తి రోగులు, వారి కుటుంబీకుల్లో వ్యక్తమవుతోంది. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, ఆల్ర్టా సౌండ్ వంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్ నివేదిక వైద్యుడికి అత్యంత కీలకం అన్న విషయం తెలిసినా శాశ్వత రేడియాలజిస్ట్ నియామకంపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జీజీహెచ్‌లోని పిడియాట్రిక్ విభాగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీటికి సంబంధించిన విభాగాలను మంగళవారం ప్రారంభిస్తున్నారు. అయితే పిడియాట్రి క్ విభాగంలో వైద్యులున్నా సూపర్‌స్పెషాలిటీ వైద్యులు ప్రస్తుతం లేరు. కొత్తగా నియామకం చేపట్టాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు వైద్యసేవల్లో నాణ్యత పెరగాలంటే ప్రధాన విభాగాల్లో వైద్యులు, సాంకేతిక నిపుణులను నియమించాల్సి ఉంది.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన ఇలా..
రాజమహేంద్రవరం అర్బన్/ రంగంపేట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7.30 గంటలకు మంగళగిరి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి 10 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటికి వెళతారు. అక్కడి నుంచి బయలుదేరి 10.25 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి చేరుకుని ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాకులో కొత్తగా ఏర్పాటుచేసిన ఎన్‌ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ -1, ఎస్‌ఎన్‌సీయూ-2, పీఐసీయూ విభాగాలను ప్రారంభిస్తారు. తర్వాత వడిశలేరులో హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొంటారు. సీసీ రోడ్డు శంకుస్థాపన, జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మాత్రల పంపిణీలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాజానగరం చేరుకుని పబ్లిక్ హెల్త్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 3 గంటలకు జీ ఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల సముదాయాన్ని ప్రారంభించి, సుశ్రుత ఆడిటోరియంలో జరిగే ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు కొవ్వూరు చేరుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర నివాసానికి వెళ్లి, ఆ తర్వాత మంగళగిరికి బయలుదేరి వెళతారు.