ప్రజారోగ్యమే పరమావధిగా వైద్యసేవలు అందించాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:07 AM
వైద్యులు, సిబ్బంది ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. వైద్యసేవలు అందించే క్రమంలో ప్రతి వైద్యుడు ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావనతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్)లో వివిధ విభాగాల హెచ్ వోడీలు, వైద్యులు, వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల పరిస్థితి, సిబ్బంది కొరత, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి అధికారులు వైద్యసేవలతోపాటు ఆసుపత్రి పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లపైనా దృష్టి పెట్టాలన్నారు. కేన్సర్ అనుబంధ వైద్యసేవల విభాగంలో అంకాలజీ విభాగం ద్వారా రోగులకు సమగ్ర వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ విభాగంలో స్పెషలిస్టు వైద్యులు రోగులకు కేన్సర్ నిర్ధారణ, చికిత్స, కౌన్సెలింగ్, ఫాలోఅప్ సేవలు అందిస్తున్నారన్నారు. జీజీహెచ్‌లో మొత్తం 484 పోస్టులు మంజూరయ్యాయని, వీటిలో 326 పోస్టులు భర్తీకాగా 158 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ పోస్టులభర్తీకి నవంబరు తొలివారంలో నోటిఫికేషన్ జారీచేయాలన్నారు. 50 పడకలతో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాకు పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈనెలాఖరునాటికి పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మార్చురీ విభాగంలో ఫ్రీజర్ల కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, మార్చురీ సమీపంలో టాయిలెట్లు నిర్మించాలని అన్నారు. పిడియాట్రిక్స్ విభాగంలోని ఎస్‌ఎన్‌సీయూలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పల్మనాలజిస్టును జీజీహెచ్‌కు డిప్యూట్ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోకు సూచించారు. ఈసమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ఎస్.భాస్కరరెడ్డి, వివిధ వైద్య విభాగాల హెచ్‌వోడీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.